ల్యాండ్ వాల్యూ పెరిగిందనే.. దళితులకు 3 ఎకరాలు ఇయ్యలేకపోతున్నం

ల్యాండ్ వాల్యూ పెరిగిందనే.. దళితులకు 3 ఎకరాలు ఇయ్యలేకపోతున్నం
  • బండి సంజయ్, రేవంత్​రెడ్డి భాష మార్చుకోవాలె
  • శాసన మండలి మాజీ చైర్మన్​గుత్తా సుఖేందర్​రెడ్డి

దేవరకొండ, వెలుగు: రాష్ట్రంలో ల్యాండ్​వ్యాల్యూ విలువ పెరిగింది కాబట్టే దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ హామీ అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్​రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపల్​ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ ఇంట్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వచ్చాక భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. ఇక్కడ ఎకరం అమ్మితే ఏపీలో 2 నుంచి 3 ఎకరాలు కొనవచ్చన్నారు. టీఆర్ఎస్​ప్రభుత్వం దళితుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అందుకే ‘దళిత బంధు స్కీమ్’ తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. బండి సంజయ్, రేవంత్​రెడ్డి తమ భాష మార్చుకోవాలని సూచించారు. లేకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. కృష్ణానదిపై నిర్మించనున్న ప్రాజెక్ట్​ను ఏపీ ప్రభుత్వం అడ్డుకోవడం బాధాకరమన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్ యాదవ్, రైతు సంఘం అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. 

భూమి ఇయ్యలేకనే ‘దళిత బంధు’ తెచ్చినం
హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీశ్

భీమదేవరపల్లి, వెలుగు: సీఎం కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేకనే ‘దళిత బంధు పథకం’ తీసుకొచ్చారని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ చెప్పారు. రాష్ట్రంలోని భూములకు రెక్కలు రావడంతో దళితులకు ఇచ్చిన 3 ఎకరాల హామీ అమలు చేయలేకపోయామని స్పష్టం చేశారు. వరంగల్​అర్బన్​జిల్లాలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, వేలేరు మండలాల్లో ఎమ్మెల్యే సోమవారం పర్యటించారు. అర్హులకు కొత్త రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సతీశ్​ మాట్లాడుతూ గౌరవెళ్లి ప్రాజెక్ట్ పూర్తయితే హుస్నాబాద్ నియోజకవర్గంలో బంగారం పండిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భీమదేవరపల్లి, ఎల్కతుర్తి ఎంపీపీలు జక్కుల అనిత, మేకల స్వప్న, జడ్పీటీసీలు వంగ రవి, చాడ సరిత, జిల్లా సివిల్​ సప్లై ఆఫీసర్ ​వసంత లక్ష్మి, తహసీల్దార్​లు ఉమారాణి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.