
కరీంనగర్, వెలుగు: కరోనా తగ్గేదాక పోటీ చేయనని, ప్రజల ప్రాణాలే తనకు ముఖ్యమని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెబుతూ ఉంటే.. ఎలాగైనా ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న హైకమాండ్ ఆయనను అనేక రకాలుగా టీఆర్ఎస్ రెచ్చగొడుతోంది. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఆఫీసర్లను మార్చడం, క్యాడర్‌ను తమవైపు తిప్పుకోవడమే కాకుండా శని, ఆదివారాల్లో ‘రా.. దమ్ముంటే ఎన్నికల్లో పోటీచేసి గెలువ్’ అంటూ ఆ పార్టీ లీడర్లతో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను రెచ్చగొట్టిస్తున్న తీరు పొలిటికల్సర్కిల్స్లో హాట్‌టాపిక్‌లా మారింది. ఆదివారం మంత్రి గంగుల కమలాకర్‌ను కలిసివచ్చిన వెంటనే టీఆర్ఎస్ లీడర్ పింగళి ప్రదీప్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మరీ మాజీమంత్రిని రెచ్చగొట్టడం విశేషం. ఈటలకు వ్యతిరేకంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న క్రమంలోనే రాజేందర్ అభిమానులు అడ్డుకోవడంతో అక్కడ తోపులాట జరిగింది. పోలీసులు వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. రాష్ట్రం మొత్తం కొవిడ్ తో సతమతమవుతుంటే హుజూరాబాద్ కేంద్రంగా ఈ నీచరాజకీయాలేంటో అర్థంకాక పబ్లిక్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రెండుగా చీలిన క్యాడర్
మంత్రి గంగుల కమలాకర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటలకు వ్యతిరేకంగా హైకమాండ్ డైరెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని కీలక నేతలందరినీ నయానోభయానో తనవైపు తిప్పుకున్నారు. వీళ్లకు ఇన్నోవా కార్లు, డబ్బు, ఇతరత్రా ఆఫర్లతో ఎర వేస్తున్నారని ఇప్పటికే మాజీమంత్రి ఈటల రాజేందర్ఆరోపించారు. ఈ ఆరోపణల్లో నిజానిజాలు ఎలా ఉన్నా గడిచిన వారం, పదిరోజుల నుంచి హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన కొందరు చిన్న పెద్ద టీఆర్ఎస్ లీడర్లు మంత్రి గంగుల క్యాంపు ఆఫీస్ కు క్యూ కడుతున్నారు. అక్కడ మీటింగ్ లో మంత్రి డైరెక్షన్ మేరకు హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రెస్మీట్లు పెట్టి మరీ ఈటలకు సవాళ్లు విసురుతున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోనే హుజూరాబాద్‌లోని లీడర్లు, క్యాడర్ఇప్పుడు ఈటల అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయారు.
ఇప్పుడు రాజకీయాలేంటో?
ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే 5 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. సుమారు 3 వేల మంది ఆఫీషియల్గానే చనిపోయారు. నాగార్జునసాగర్ బై ఎలక్షన్ కారణంగా నియోజకవర్గంలో ఏకంగా 13 వేలకు పైగా కేసులు వచ్చాయి. దగ్గర దగ్గర 200 మంది వరకు మృతిచెందారు. కార్పొరేషన్ ఎన్నికల తర్వాత వరంగల్, ఖమ్మం సిటీల్లో జనం పెద్దసంఖ్యలో హాస్పిటళ్లకు క్యూ కట్టారు. ఎంజీఎంలో రోజూ పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్నేతలు బై ఎలక్షన్ కోసం ఈటలను రాజీనామా చేయాలని రెచ్చగొట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా టైంలో ఈ తరహా రాజకీయాలేంటని నియోజకవర్గంలో పబ్లిక్ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
పోటాపోటీగా ప్రెస్ మీట్లు.. గొడవ
మంత్రి గంగుల కమలాకర్‌ను కలిసివచ్చిన వెంటనే హుజూరాబాద్ లో టీఆర్ఎస్ నేత పింగళి ప్రదీప్‌రెడ్డి ఈటలకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. రాజేందర్వెంటనే రాజీనామా చేసి.. ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలని సవాల్ విసిరారు. అదే టైంలో జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న 13మంది కౌన్సిలర్లతో కలిసి ప్రెస్మీట్పెట్టారు. తామంతా ఈటల వెంటే ఉంటామని, తనకు, ఈటలకు టీఆర్ఎస్ నుంచి ప్రాణభయం ఉందని ఆవేదన వెలిబుచ్చారు. హుజూరాబాద్ లోనూ టీఆర్ఎస్యూత్ నియోజకవర్గం అధ్యక్షుడు జె. కుమార్, టీఆర్ఎస్వీ ఇన్ చార్జి కొమ్ము అశోక్ ఆధ్వర్యంలో ఈటలకు అనుకూలంగా ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఒకరోజు ముందు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు ప్రెస్ మీట్ నిర్వహించి ఈటలకు వ్యతిరేకంగా స్టేట్ మెంట్లు ఇచ్చారు. వీణవంకలో ఈటల వర్గీయులైన సాధవరెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎల్లారెడ్డి కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. కొద్దిసేపటి తరవాత ఈటల వ్యతిరేకవర్గం ఏఎంసీ చైర్మన్ బాలకిషన్ రావు, ఎంపీపీ భర్త కలిసి ప్రెస్ మీట్ నిర్వహిస్తుంటే .. ఈటల అభిమానులు అక్కడికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. గొడవ జరిగే అవకాశం ఉండటంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈటల వర్గీయులను మాత్రం అదుపులోకి తీసుకొని టీఆర్ఎస్ నేతలను వదిలేశారు.