టీఆర్ఎస్​కు ఓటెయ్యా అన్నందుకు దాడి

టీఆర్ఎస్​కు ఓటెయ్యా అన్నందుకు దాడి
  • పెన్షన్ ​తీసుకుంటూ బీజేపీకి ఓటేస్తానంటావా అంటూ అటాక్​
  • హైదరాబాద్​ దవాఖానకు తరలింపు
  • చౌటుప్పల్ మండలం రెడ్డిబాయి గ్రామంలో ఘటన
  • పోలీస్​స్టేషన్​లో ముగ్గురిపై ఫిర్యాదు 

చౌటుప్పల్, వెలుగు : చౌటుప్పల్ మండలం రెడ్డిబాయి గ్రామంలో బీజేపీకే ఓటు వేస్తానని అన్నందుకు ఒకరిని టీఆర్ఎస్ లీడర్లు విచక్షణారహితంగా కొట్టారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడి హైదరాబాద్​లోని ఓ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నాడు. పంతంగి గ్రామానికి చెందిన శ్యామల యాదయ్య తల్లి ఐదు రోజుల క్రితం చనిపోయింది. ఆమె గోరి కట్టించడానికి మేస్త్రీలను మాట్లాడడానికి రెడ్డి బాయి గ్రామానికి శుక్రవారం బైక్ పై వెళ్తున్నాడు. ఈ సందర్భంగా గ్రామంలో టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తున్నఆ పార్టీ నాయకులు బైక్కు బీజేపీ, రాజగోపాల్ ​స్టిక్కర్​ఉండడంతో ఆపారు. ‘నీకు పెన్షన్ వస్తుందా’ అని యాదయ్యను అడిగారు. వస్తుందని చెప్పడంతో ఓటు ఎవరికి వేస్తావని ప్రశ్నించారు. దీంతో రాజగోపాల్ రెడ్డికే వేస్తా అని చెప్పడంతో ప్రభుత్వం నుంచి పెన్షన్, గొర్లు తిస్కుంటూ  రాజగోపాల్ రెడ్డికి ఎట్లా ఓటేస్తవ్​అని అడిగారు.

తాను పిచ్చుకకుంట్ల కులానికి చెందిన వాడినని, తనకు  ప్రభుత్వం నుంచి ఏ స్కీమూ రావట్లేదని, ఎందుకు టీఆర్ఎస్​కు ఓటెయ్యాలని సమాధానమిచ్చాడు. దీంతో ఒక్కసారిగా అతడిపై దాడికి దిగారు. ఈ ఘటనలో యాదయ్య తల, చేతికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ లీడర్లు చౌటుప్పల్ ప్రభుత్వ దవాఖానాకు తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స తర్వాత మెరుగైన ట్రీట్​మెంట్​కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ దవాఖానాకు తరలించారు. దాడి చేశారంటూ ఆవుల నర్సింహా, చీదుగుల్ల శివాజీ మరొకరిపై చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పంతంగి సర్పంచ్ బాతరాజు సత్యం మాట్లాడుతూ టీఆర్ఎస్ లీడర్లు ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇలా చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.