
రాష్ట్ర గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేశ్‌గౌడ్
నర్సాపూర్, వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ గడ్డపై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని రాష్ట్ర గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేశ్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన ఆధ్వర్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి, కౌన్సిలర్ సంఘసాని సురేశ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో నర్సాపూర్ పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ పట్టణ బీజేవైఎం అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శిలు ప్రవీణ్, సురేశ్, గొల్లపల్లి బూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ ఉన్నారు.
పెండింగ్ కేసులపై సీపీ సమీక్ష
సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట కమిషనరేట్ ఆఫీస్ లో పెండింగ్ కేసులపై గురువారం సీపీ ఎన్.శ్వేత సమీక్ష నిర్వహించారు. ఏసీపీ, సీఐ, ఎస్సైలను వివిధ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని, పోక్సో, మహిళలకు సంబంధించిన కేసుల్లో శిక్షల శాతం పెంచాలని ఆమె సూచించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఏసీపీ దేవారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ ఫణీంద్ర్, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సైదా నాయక్, సీఐ భిక్షపతి, రవికుమార్, భాను ప్రకాశ్, జానకీరామ్ రెడ్డి, కృష్ణ పాల్గొన్నారు.
ఫ్లాగ్ డే పోటీలకు దరఖాస్తు చేసుకోండి..
పోలీస్ అమరవీరుల ఫ్లాగ్ డే ను పురస్కరించుకొని ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ విభాగాలలో పోటీలకు ఆహ్వానిస్తున్నట్లు సీపీ తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లా పరిధిలోని విద్యార్థులకు, యువతకు, ఔత్సహిక ఫొటోగ్రాఫర్లకు ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ కు సంబంధించి రాష్ట్ర పోలీస్ అధ్వర్యంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహించడం జరుగుతుందని, ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్, కమ్యూనిటీ పోలీసింగ్, మూఢనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలు, అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాల్లో పోలీసుల సేవ లాంటి అంశాలకు సంబంధించి ఉండాలన్నారు. అందుకు సంబంధించిన మూడు ఫొటోలు, 3 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్ ను తమ పూర్తి వివరాలతో పెన్ డ్రైవ్ లో కానీ, డీవీడీ లో కానీ తీసుకొచ్చి సీపీ ఆఫీస్ లో అందజేయాలని సూచించారు.
యువకుడి దారుణ హత్య
జిన్నారం, వెలుగు: కాళ్లు, చేతులు తాళ్లతో కట్టి.. ముఖాన్ని కవర్‌తో చుట్టి.. గొంతు కోసి ఓ యువకుడిని దుండగులు దారుణంగా హత్య చేసి రోడ్డుపై పడేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రామిక వాడలో గురువారం జరిగింది. సీఐ సురేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. బొల్లారం పారిశ్రామిక వాడలో గురువారం ఉదయం స్థానికులకు గుర్తుతెలియని వ్యక్తి(25) డెడ్‌బాడీ రక్తపు మడుగుల్లో కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం , డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపి ఆధారాలు సేకరించారు. నోట్లో గుడ్డలు కుక్కి, తలపై గాయాలు చేసి, తీవ్రంగా హింసించి చంపినట్లు గుర్తించారు. మృతుడు ఏ ప్రాంతానికి చెందినవాడు? హత్య చేసిందెవరు?
తదితర కోణాల్లో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
కట్టుడే కాలే.. అప్పడే కూలిన మోరీ!
నారాయణఖేడ్ పట్టణంలోని భూమయ్య కాలనీలో డ్రైనేజీలు ఓవైపు కడ్తుండగానే మరో వైపు కూలుతున్నాయి. కొత్త మున్సిపాలిటీగా ఖేడ్ పట్టణంలో స్టార్టప్ నిధులతో ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ పనులు క్వాలిటీ లేకుండా చేస్తున్నారని పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరవై రోజుల కింద ప్రారంభమైన పనులు కంప్లీట్ కాకముందే మోరీ కూలిపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. నిబంధనలేవీ పాటించుకుండా మోరీ కడుతున్నారని, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని వర్క్స్క్వాలిటీగా జరిగేలా అధికారులు చూడాలని స్థానికులు కోరుతున్నారు. - నారాయణ్ ఖేడ్, వెలుగు
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
మెదక్ (శివ్వంపేట), వెలుగు: పురుగుల మందు తాగి డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం అల్లీపూర్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మహేశ్(19) నర్సాపూర్ డీఎస్ఆర్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అతడు మంగళవారం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి చనిపోయాడు. మహేశ్ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసుకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. కాగా, మృతుడి ఫ్రెండ్స్ గురువారం రత్నాపూర్ లో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు.
పంటలకు మద్దతు ధర ప్రకటించాలి
కంది, వెలుగు : రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గురువారం భారతీయ కిసాన్సంఘ్ఆధ్వర్యంలో రైతులు సంగారెడ్డి తహసీల్దార్ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రతి పంటకూ మద్దుతు ధర కల్పించాలని, అధిక వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల వద్ద ఫెస్టిసైడ్స్ దుకాణదారులు ఎంఆర్పీ కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రీజినల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులకు ఓపెన్ మార్కెట్‌ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. పంటలను అడవిపందుల భారీ నుంచి కాపాడేవిధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీకేఎస్నాయకులు, రైతులు పాల్గొన్నారు.
సిద్దిపేటలో పాలియేటివ్ కేర్ సెంటర్ ఏర్పాటు
సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడు బెడ్లతో పాలియేటివ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, వయో వృద్ధులకు ఆసుపత్రిలోనే సేవలు అందించే గొప్ప కార్యక్రమం త్వరలో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభం కానుంది. కేంద్రంలో ఒక పాలిటివ్ కేర్ ఫిజిషియన్‌తో పాటు ఒక ఫిజియో థెరపిస్ట్, ఐదుగురు స్టాఫ్ నర్సులు ఉండనున్నారు. ఈ విషయమై గురువారం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆత్మీయ పలకరింపు, ఆరోగ్య సేవలు, పౌష్టికాహారం లాంటివి ఇచ్చే గొప్ప కార్యక్రమానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు.
చెక్‌డ్యామ్ లో ఒకరు గల్లంతు!
మెదక్ (కౌడిపల్లి), వెలుగు : చెక్ డ్యామ్ లో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రం సమీపంలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. కౌడిపల్లి మండలం కంచన్ పల్లి గ్రామానికి చెందిన సిరినేని వినయ్ రావు (35) ఆరు నెలల కింద కామారెడ్డిలో పని కోసం వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నాడు. మంగళవారం కంచన్ పల్లికి వచ్చాడు. బుధవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన చల్ల మల్లేశ్‌తో కలిసి బైక్ పై కౌడిపల్లి వెళ్లారు. అనంతరం స్థానిక వైన్ షాప్ కు వెళ్లి మద్యం తాగారు. ఆ తర్వాత కామారెడ్డి వెళ్లిపోతానని వినయ్ రావు చెప్పగా రాత్రిపూట వద్దంటూ మల్లేశ్ బతిమాలాడు. ఆ తర్వాత వైన్స్ లో నుంచి ఇద్దరూ బయటకు వచ్చారు. తాగిన దగ్గర ఏమైన పడిపోయాయేమో చూసి వస్తా అని మల్లేశ్ మరోసారిలోపలికి వెళ్లి వచ్చాడు. అంతలోనే బయట ఉన్న వినయ్ రావు కనిపించలేదు. కౌడిపల్లి బస్టాండ్, తదితర చోట్ల అర్ధరాత్రి వరకు వెతికినా అతడు కనిపించకపోవడంతో మల్లేశ్ ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటిరోజు ఉదయం మరోసారి వెతికేందుకు మల్లేశ్ కౌడిపల్లికి వచ్చాడు. దేవులపల్లి రోడ్డు గుండా వెతుకుతుండగా స్థానిక చెక్ డ్యామ్‌వద్ద వినయ్ రావు చొక్క కనిపించింది. దీంతో చెక్ డ్యామ్ లో పడిపోయాడేమోననే అనుమానంతో బాధిత కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు సమచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో చెక్ డ్యామ్ లో వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆయన ఆదేశంతో ఫైర్‌ఇంజన్ సహాయంతో గురువారం సాయంత్రం వరకు వెతికినా ఎలాంటి ఫలితం దక్కలేదు. వినయ్ రావు తల్లి పుష్పమాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కౌడిపల్లి ఎస్సై శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు.