టీఆర్ఎస్ నాయకులు క్షమాపణలు చెప్పాలి

టీఆర్ఎస్ నాయకులు క్షమాపణలు చెప్పాలి
  • కేటీఆర్ అండ్ కో చిల్లరగా వ్యవహరిస్తున్నదని కామెంట్

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌‌‌‌‌‌‌పై టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, రాణి రుద్రమ, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ డిమాండ్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పులు తొడుక్కునే సమయంలో సంజయ్ సహకరించడం తప్పు ఎలా అవుతుందని టీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో నేతలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ అండ్ కో చిల్లరగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. మునుగోడులో బీజేపీ సభ సక్సెస్ కావడాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘అమిత్ షా మాకు గెస్ట్. ఆయనకు మర్యాదలు చేసి పంపాల్సిన బాధ్యత మాపై ఉంది”అని చెప్పారు. రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ కుటుంబం ఇప్పుడు దేశం మీద పడిందని రాణి రుద్రమ విమర్శించారు. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త, బంధువులకు, పీఏకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సంబంధం ఉందని తెల్సిందని, ఇందులో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ లిక్కర్ స్కాంపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

బురద జల్లే ప్రయత్నం
మునుగోడులో బీజేపీ సభతో టీఆర్ఎస్, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ మైండ్ బ్లాక్ అయిందని ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ అన్నారు. సభ విజయవంతం కావడంతో బండి సంజయ్‌‌‌‌‌‌‌‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు చేసి బయటకు వచ్చాక అమిత్ షాకు సంజయ్ చెప్పులు అందిస్తే తప్పేముందని, దీన్ని భూతద్దంలో చూసుడేందని ప్రశ్నించారు. ‘‘పెద్దలను గౌరవించడం మా సంస్కృతి. తెలంగాణలోనూ ఈ కల్చర్ ఉంది. ఇంటికి ఎవరైనా బంధువులు, పెద్దలు వచ్చినా వాళ్ల కాళ్లు కడుక్కునేందుకు నీళ్లు ఇస్తాం. అది ఆనవాయితీ. అమిత్ షాకు చెప్పులు అందిస్తే ఏదో పెద్ద తప్పు చేసినట్లుగా మాట్లాడుతున్నారు” అని మండిపడ్డారు.