టీఆర్ఎస్ సభ్యులే సర్కారును నిలదీసిన్రు

V6 Velugu Posted on Sep 28, 2021

 • ఆందోల్​లో రోడ్లు అధ్వానంగా ఉన్నయ్​: క్రాంతికిరణ్
 • జూనియర్ కాలేజీ సమస్య ఎన్నోసార్లు చెప్పిన: జైపాల్
 • రోడ్ల గురించి చెప్తే పట్టించుకోలే: రసమయి
 • మంత్రులు నోట్ చేసుకుంటే సరిపోదు: అబ్రహం
 • పంచాయతీల్లో ఎంపీటీసీలకు కుర్చీ కూడా ఉంటలే: కవిత
 • ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు అధికారాలివ్వండి: చిన్నపరెడ్డి

హైదరాబాద్, వెలుగు: తమ నియోజకవర్గాల్లోని సమస్యలను పట్టించుకోవడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలే నిలదీశారు. మంత్రులకు పదే పదే చెప్పినా పనులు జరగడం లేదని వాపోయారు. అసెంబ్లీ వేదికగా టీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యేలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. సోమవారం జీరో అవర్‌‌ సందర్భంగా పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో అసెంబ్లీలో లేవనెత్తిన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని కుండబద్ధలు కొట్టారు. ‘సమస్యలను నోట్ చేసుకుంటున్నాం, పరిశీలిస్తాం’ అని చెబితే సరిపోదని.. పరిష్కారానికి చర్యలు కూడా తీసుకోవాలని చురకలంటించారు.

 • తమ నియోజకవర్గంలోని దారూర్ స్టేషన్, దోర్నల్ మధ్య నాలుగైదు ఏండ్ల కిందట శాంక్షన్ అయిన బ్రిడ్జి పనులు ఇప్పటికీ 30% కూడా పూర్తి కాలేదని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. ఇప్పటికైనా పనులను పూర్తి చేయాలని కోరారు. పులుసుమామిడి, సిద్దులూరులోని బ్రిడ్జిలు కూడా ఏండ్ల కొద్దీ అసంపూర్తిగానే ఉన్నాయన్నారు. నాగ సముద్రం వద్ద కూడా కొత్త బ్రిడ్జి నిర్మించాలన్నారు. 
 • ఆందోల్‌‌ నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. 9 ఏండ్లుగా రోడ్ల రిపేర్లు చేయలేదన్నారు. సింగూరు ప్రాజెక్టు వద్దకు అప్రోచ్‌‌ రోడ్లు, రేలింగ్ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.
 • స్టేషన్‌‌ ఘన్‌‌పూర్ నియోజకవర్గ కేంద్రానికి డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తున్నట్టు 2018లో సీఎంవో సమాచారం ఇచ్చిందని, ఇప్పటిదాకా కాలేజీ పనులు మొదలు కాలేదని తాటికొండ రాజయ్య అన్నారు. కాలేజీ కోసం 20 ఏండ్లుగా పోరాటాలు జరుగుతున్నాయని, ఇప్పటికైనా వీలైనంత త్వరగా కాలేజీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
 • తన నియోజకవర్గంలోని ఆమన్‌‌గల్‌‌ జూనియర్ కాలేజీ సమస్యను గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రస్తావించానని, మళ్లీ ఇప్పుడు ప్రస్తావిస్తున్నానని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. 2003లో శాంక్షన్ అయిన జూనియర్ కాలేజీ.. ఇప్పటికీ అక్కడి బాయ్స్ స్కూల్‌‌లోనే నడుస్తోందన్నారు. అక్కడున్న 9.17 ఎకరాల స్థలాన్ని కాలేజీ కోసం కేటాయించి, బిల్డింగ్ నిర్మించాలన్నారు.
 • మానకొండూరు నియోజకవర్గంలో వర్షాలకు రోడ్లు, కల్వర్టులన్నీ దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చెప్పారు. గతంలో రోడ్ల సమస్యలను ప్రస్తావించినా ఇప్పటికీ ఆ పనులు చేయలేదన్నారు. గుండ్లపల్లి, గన్నేరువరం నుంచి కొత్తూరు దాకా డబుల్ రోడ్డు, సిరిసిల్ల జిల్లా జిల్లర్ల నుంచి ఇల్లంతకుంట దాకా డబుల్ రోడ్డు కోసం ప్రతిపాదనలు పంపించినా పనులు జరగలేదన్నారు.
 • తన నియోజకవర్గంలోని బండ రావిరాల, చిన్నరావిరాల, గోలేటి గ్రామాల్లో 670 ఎకరాల భూమిని మైనింగ్ జోన్‌‌‌‌గా 2004లో ప్రకటించారని, భూమి కోల్పోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌‌‌‌రెడ్డి అన్నారు. ఇప్పటికైనా పరిహారం ఇప్పించాన్నారు. 
 • తన నియోజకవర్గంలో వర్షాలకు దెబ్బతిన్న కనెక్టింగ్ రోడ్లు, కల్వర్టులను బాగు చేయాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోరారు. 
 • లక్ష్మీదేవిపల్లిలో గ్రుండి బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉందని, అక్కడ కొత్త బ్రిడ్జి కట్టాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌‌‌‌ కోరారు.
 • ఇనుగుర్తిని మండల కేంద్రంగా ఇప్పటికైనా ఏర్పాటు చేయాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌‌‌‌‌‌‌‌నాయక్ కోరారు. ఇప్పటికే శాంక్షన్ అయిన హార్టికల్చర్ కాలేజీని ఏర్పాటు చేయాలని కోరారు. 
 • 2009లో వచ్చిన తుంగభద్ర వరదల వల్ల తన నియోజకవర్గంలోని 2 మండలాల్లో చాలా ఇండ్లు దెబ్బతిన్నాయని, కొత్త ఇండ్ల నిర్మాణం గురించి మంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా కట్టివ్వలేదని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. సమస్యలను నోట్ చేసుకోవడమే గాకుండా, చర్యల గురించి కూడా ఆలోచించాలని చురకలంటించారు.
 •  వరదలు వచ్చినప్పుడల్లా నిజాం సాగర్ బ్యాక్‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌తో నాగిరెడ్డిపేట, చీనూరు, ఆత్మకూరు, తాండూరు, జలాల్‌‌‌‌పూర్ తదితర గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌‌‌‌‌‌‌‌ అన్నారు. నిజాంసాగర్‌‌‌‌‌‌‌‌ అవుట్‌‌‌‌ ఫ్లో పెంచి, ముంపును అరికట్టాలని కోరారు.
 • రామంతాపూర్ చెరువు పనుల కోసం రూ.15 కోట్లు శాంక్షన్ చేసినా, ఇప్పటిదాకా పనులు స్టార్ట్ చేయలేదని ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌‌‌‌రెడ్డి అన్నారు. ఇప్పుడు చెరువు నిండడం వల్ల రామంతాపూర్, హబ్సిగూడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. 
 • తన నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌‌‌‌‌‌‌ అన్నారు.
 • ఎన్‌‌‌‌టీపీసీ, సింగరేణి, ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ వ్యర్థాలు గోదావరి కలుస్తున్నాయని సభ దృష్టికి రామగుండం ఎమ్మెల్యే చందర్‌‌‌‌‌‌‌‌ తీసుకెళ్లారు. 
 • సారా అమ్ముకుని బతికే ఆరె కటికలకు వైన్‌‌‌‌ షాపుల కేటాయింపులో రిజర్వేషన్లు కల్పించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కోరారు.
 • కరోనా కారణంగా ఎస్‌‌‌‌డీఎల్‌‌‌‌సీ, డీఎల్‌‌‌‌సీ అప్రూవల్స్ ఆగిపోయాయని, ఈ ఆలస్యం వల్ల చాలా మందికి రైతు బంధు రావడం లేదని ఎమ్మెల్యే బానోతు హరిప్రియ చెప్పారు.
 • మహర్ కులస్తులకు కుల సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల, వారికి ప్రభుత్వ పథకాలు అందడం లేదని బోథ్‌‌‌‌ ఎమ్మెల్యే రాథోడ్‌‌‌‌ బాపురావు అన్నారు.

మండలిలోనూ..

 • గ్రామ పంచాయతీలో కనీసం కూర్చోడానికి ఎంపీటీసీలకు కుర్చీ ఉండటం లేదని, తగిన గౌరవం దక్కడం లేదని కల్వకుంట్ల కవిత అన్నారు. కొత్తగా మండలాలు ఏర్పాటైనా మండల ప్రజా పరిషత్‌‌‌‌లకు తగిన ఆఫీసులులేవని, రోజు వారీ అధికారిక విధుల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.
 • ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు అధికారాలను బదలాయించాలని, వారి ఓట్లతో గెలిచిన తాము ముఖం చూపించలేని పరిస్థితి ఉందని తేరా చిన్నపరెడ్డి అన్నారు. గత సమావేశాల్లోనే సభ దృష్టికి, సీఎం దృష్టికి తీసుకొచ్చినా పరిష్కారం కాలేదన్నారు.
 • రాష్ట్రంలో జైళ్లలో ఖైదీలు తయారు చేసిన వస్తువులకు భారీ డిమాండ్‌‌‌‌ ఉందని, వందల కోట్ల వ్యాపారం జరుగుతోందని, ఇలా వచ్చిన ఆదాయాన్ని ఏం చేస్తున్నారని ఎంఎస్‌‌ ప్రభాకర్ ప్రశ్నించారు.
 • మంత్రులెక్కడ?
 • జీరో అవర్‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్యేలు లేవనెత్తే ప్రశ్నలకు, సమస్యలకు బదులివ్వాల్సిన మంత్రులు.. అసలు సభలోనే లేరు. మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ, ఎడ్యుకేషన్, ఫైనాన్స్‌‌‌‌, పంచాయతీరాజ్, హెల్త్, వెల్ఫేర్ మినిస్ట్రీలకు సంబంధించిన సమస్యలను ఎమ్మెల్యేలు ప్రస్తావించారు‌‌‌‌. కానీ ఆయా శాఖల మంత్రులెవరూ సమావేశాలకు హాజరు కాలేదు. సమస్యలను నోట్‌‌ చేసుకున్నామని, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్తామని సభలో ఉన్న ఇతర మంత్రులు బదులిచ్చారు.

Tagged TRS MLAs, zero hour, government, assembly questione

Latest Videos

Subscribe Now

More News