ఓట్ల కోసం కాదు.. ప్రజాసంక్షేమం కోసమే పని చేశాం

ఓట్ల కోసం కాదు.. ప్రజాసంక్షేమం కోసమే పని చేశాం

గజ్వేల్: రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు.  70 ఏండ్లలో గత ప్రభుత్వాలు చేయలేని పనులను తాము ఏడేండ్లలో పూర్తి చేశామని తెలిపారు. రైతులను అవహేళన చేసిన ప్రభుత్వాలను చూశామని.. కానీ కేసీఆర్ సర్కారు అన్నదాతలకు అండగా ఉంటోందన్నారు.  కేసిఆర్ రైతు బంధుగా మారి రైతన్నలకు వెన్నుదన్నుగా ఉంటున్నారని చెప్పారు. గజ్వేల్ నియోజవర్గంలోని గజ్వేల్ మున్సిపాలిటీ సహా 6 మండలాలకు చెందిన 1,543 మంది లబ్దిదారులకు ఆహార భద్రత కార్డులను హరీశ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, మిషన్ భగీరథ అమలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణనే అన్నారు.

‘కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఓట్ల కోసం కాదు.. ప్రజల సంక్షేమం కోసమే పని చేశాం. అంతిమంగా గెలిచేది పనితీరే. తెలంగాణలో పేదలకు లిబరల్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నాం. 87.41 లక్షల మందికి రేషన్ కార్డులు గతంలో అందజేశాం. కొత్తగా 3.98 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్నాం. కొత్త కార్డులతో కలిపి రాష్ట్రంలో అన్నిరకాల కార్డులు దాదాపు 90.50 లక్షలు ఉంటాయి. 2.88 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. మొత్తంగా రాష్ట్రంలోని 90.5 శాతం మంది జనాభాకు రేషన్ బియ్యం అందిస్తున్నాం. దేశంలో ఇంత మొత్తంలో జనాభాకు రేషన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే. కార్డుపై 20 కిలోల సీలింగ్ ఎత్తేశాం. యూనిట్‌‌కు 4 నుంచి 6 కిలోలకు బియ్యాన్ని పెంచాం. రేషన్ మీద ప్రతి ఏటా ప్రభుత్వం రూ.2,766 కోట్లు, ప్రతి నెలా రూ.232 కోట్లు ఖర్చు చేస్తోంది’ అని హరీశ్ రావు పేర్కొన్నారు.