టీఆర్ఎస్ మంత్రులను హౌస్ అరెస్టు చేయాలి

టీఆర్ఎస్ మంత్రులను హౌస్ అరెస్టు చేయాలి

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు నిరసనలు తెలియజేసే అవకాశం లేకుండా చేసిన టీఆర్ఎస్ మంత్రులను ముందు హౌస్ అరెస్ట్ చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ డిమాండ్ చేశారు. విజయశాంతి బీజేపీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఆమె మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ..  రైతులను తప్పుదోవ పట్టించేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు వ్యతిరేకంగా ఒక్కపదం కూడా చట్టంలో లేదు..  రైతులకు మేలుచేసే చట్టాలని ప్రధాని చెప్పినా కుట్రతో ఆందోళనలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. సన్నరకం వడ్లు పండించిన రైతులకు కేసీఆర్ ఇంకా న్యాయం చేయలేదు..  రైతులకు భరోసా కల్పించకుండా..అపోహలు సృష్టిస్తున్నారని ఆమె విమర్శించారు. తెలుగు రాష్ట్రాల రైతులు అపోహలు నమ్మొద్దని ఆమె కోరారు. నేరుగా నిరసనలకు పిలుపివ్వడానికి సీఎం కేసీఆర్ కు సిగ్గుందా అని ఆమె ప్రశ్నించారు. ప్రతిపక్షాలు నిరసనలు తెలిపే అవకాశం లేకుండా చేసిన వ్యక్తి కేసీఆర్.. ఇప్పుడు ఆయనే బంద్ పాటించమంటున్నారు.. ముందుగా టిఆర్ఎస్ మంత్రులు, వారి నాయకులను హౌస్ అరెస్ట్ చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.