వికలాంగులకు ఉపాధిని కల్పించేలా ట్రైనింగ్ సెంటర్ : వినయ్ భాస్కర్

వికలాంగులకు ఉపాధిని కల్పించేలా ట్రైనింగ్ సెంటర్ : వినయ్ భాస్కర్

ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా పకడ్బంది చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తెలిపారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో సుబేదారిలోని వికలాంగుల వసతి గృహాన్ని ఆయన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి సందర్శించారు. ఇటీవల కొందరు వసతి గృహం స్థలం కాంపౌండ్ వాల్ కూల్చివేసి ఆక్రమణకు ప్రయత్నించారు. దీని ఎమ్మెల్యే పరిశీలించారు. ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిరక్షించే విధంగా వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం వినయ్ భాస్కర్ మీడియాతో మాట్లాడారు. 2008లో పంచారయి భూమిని వికలాంగుల కోసం 30 గుంటలు కేటాయించామన్నారు. అక్కడ 70 మంది దివ్యంగులకు వసతి కల్పించామని చెప్పారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసి ఆక్రమణలను తొలగించడం జరిగిందన్నారు. వికలాంగులకు కేటాయించిన స్థలంలో వారికి అవసరమయ్యే పరికరాలతో కూడిన పార్కును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వారికి ఉపాధిని కల్పించే విధంగా ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. వికలాంగులకు కేటాయించిన స్థలంలో నిర్మాణానికి అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, కమిషన్ లకు సూచించామన్నారు.