పోలీసుల‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బంధువు వీరంగం

పోలీసుల‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బంధువు వీరంగం

పెద్దపల్లి: లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేశాడ‌ని పోలీసులు అడ్డుకున్నందుకు.. ఓ వ్య‌క్తి వీరంగం సృష్టించాడు. అధికార పార్టీ ఎమ్మెల్యే త‌న అన్న అంటూ పోలీసుల‌పై చిందులు వేశాడు. ఈ సంఘ‌ట‌న సోమ‌వారం పెద్దపల్లి జిల్లాలో జ‌రిగింది. సుల్తానాబాద్ మండలం, దుబ్బపల్లి ద‌గ్గ‌ర‌ పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. అయితే పెద్దపల్లి వైపు నుంచి వస్తున్న కారును పోలీసులు ఆపి వివరాలు అడిగారు. దీంతో కారు దిగి ఒక్క‌సారిగా చిందులేసిన వ్య‌క్తి.. నేను పెళ్లికి వెళ్తున్నాను. నేను ఎవరనుకుంటున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే తమ్ముడిని. నా కారునే అపుతారా.. ఎంత ధైర్యం.. మేమిచ్చే డబ్బులతో డ్యూటీ చేస్తూ మేమంటే మీకు లెక్క లేదా అంటూ రెచ్చిపోయాడు.

ఆయన పేరు దాసరి అంజిరెడ్డి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి సమీప బంధువు. తనను ఎవరడ్డుకుంటారన్న ఆలోచనతో డ్యూటీలో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే ఈ తతంగాన్ని మొత్తం  అక్కడ ఉన్నవారు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. దీంతో పోలీసులు అంజిరెడ్డిపై కేసు నమోదు చేశారు. లాక్ డౌన్ ను మ‌రింత క‌ఠిన‌త‌రం చేశామ‌న్న పోలీసులు.. రూల్స్ బ్రేక్ చేస్తే ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్టం అన్నారు.