టీఆర్ఎస్​ పార్టీ​ లీడర్ల భూ దందా

టీఆర్ఎస్​ పార్టీ​ లీడర్ల భూ దందా
  • రెగ్యులరైజేషన్​ పట్టాల కోసం స్కెచ్​
  • ఆధారాలున్నా కాపాడలేక పోతున్నామంటున్న ఆఫీసర్లు 
  • కలెక్టర్ ఫోకస్​ చేయాలంటున్న స్థానికులు​

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం పట్టణం నడిబొడ్డున రూ. కోట్ల విలువైన ఎండోమెంట్​ల్యాండ్స్​ కబ్జాలో కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్ని రికార్డుల్లో గవర్నమెంట్, మరికొన్ని రికార్డుల్లో ఎండోమెంట్​ కింద ఉన్న ల్యాండ్​ను అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, లీడర్ల సాయంతో అక్రమార్కులు కబ్జా చేశారు.  గతంలో పనిచేసిన కొందరు ఆఫీసర్ల నిర్లక్ష్యం, లాలూచి  కారణంగా బడాబాబులు ఎండోమెంట్ ల్యాండ్స్​లో పాగా వేశారు. జీవో 76 కింద రెగ్యులరైజేషన్​ పట్టాలు చేసుకునేందుకు  ప్లాన్​ చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందిస్తే ఈ ల్యాండ్స్​గవర్నమెంట్​కు దక్కే అవకాశం ఉంది. లేకుంటే చూస్తుండగానే  వందల కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని పట్టణ  వాసులు వాపోతున్నారు. కలెక్టర్​ ఫోకస్ ​చేసి కాపాడాలని కోరుతున్నారు.

గణేశ్​ టెంపుల్, సూపర్​ బజార్​ ఏరియాలో..

జిల్లా కేంద్రంలోని గణేశ్​టెంపుల్​, సూపర్​బజార్​ ఏరియాల్లో ఎక్కువగా ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి.  సూపర్​బజార్​ఏరియా.. రైల్వేస్టేషన్​ సమీపంలో గల కామేశ్వరి సత్రం అలియాస్​ కామమ్మ సత్రానికి చెందిన 2 వేల గజాల ల్యాండ్​ దాదాపుగా అక్రమార్కులు కబ్జా చేశారు. ఇక్కడ ప్రస్తుతం గజం దాదాపు రూ. 1.50 లక్షల నుంచి రూ.2లక్షల వరకు రేట్​పలుకుతోంది. డబ్బున్న వాళ్లు రాజకీయ పలుకుబడితో ఆఫీసర్ల లాలూచీని ఆసరా చేసుకుని ఇంటి  నంబర్లు తీసుకున్నారు. కామేశ్వరి సత్రానికి చెందిన ఈ  ల్యాండ్స్​లో నిర్మాణా లు చేపట్టి ఆక్రమణదారులు మున్సిపాలిటీ, రెవె న్యూ నుంచి యజమాని సర్టిఫికెట్లు పొందిన దాఖలాలు కూడా ఉన్నాయి. కామమ్మ సత్రానికి చెందిన ఈ ల్యాండ్​లో దాదాపు 19 అక్రమ నిర్మాణాలను ఎండోమెంట్​ ఆఫీసర్లు గుర్తించారు. అందులో కొందరు ఇప్పటికే రెగ్యులరైజేషన్​ పట్టాలు కూడా పొందారు. 

అలాగే  గణేశ్​టెంపుల్​ సమీపంలో గల చిట్టి వారి సత్రానికి చెందిన దాదాపు 4,800 గజాల ల్యాండ్​ను కొందరు బడా బాబులు తప్పుడు ధృవీకరణ పత్రాలతో తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడ గజం రూ. లక్ష నుంచి రూ. 1.50 లక్షలకు పైగా ధర పలుకుతోంది.  చిట్టి వారి సత్రానికి చెందిన ల్యాండ్​లో కూడా కబ్జాదారులు కొంత మేర రెగ్యులరైజేషన్​ పట్టాలను పొందినట్టుగా ప్రచారం సాగుతోంది.  ఇటీవల కాలంలో 76 జీవో ప్రకారంగా రెగ్యులరైజేషన్​ పట్టాల కోసం అప్లికేషన్లు కూడా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తప్పుడు డాక్యుమెంట్లతో చిట్టివారి సత్రానికి చెందిన రూ. వందల కోట్లు విలువ చేసే ల్యాండ్​ను కొట్టేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. ముందుగా ఆఫీసర్లతో సెటిల్​మెంట్​ చేసుకునేందుకు అధికార టీఆర్ఎస్​పార్టీ లీడర్లు, ప్రజాప్రతినిధులతో మంతనాలు  సాగిస్తున్నారని చర్చ సాగుతోంది. 

ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలానికి వెళ్లే భక్తులు సేద తీరడంతో పాటు వారికి అన్నదాన కార్యక్రమాలు చేపట్టేందుకు గతంలో ఇక్కడ సత్రాలను ఏర్పాటు చేశారు. రైళ్లు, ఎడ్ల బండ్ల ద్వారా వచ్చే భక్తులు ఇక్కడ విశ్రాంతి తీసుకునేలా సత్రాలను ఏర్పాటు చేశారని పలువురు సీనియర్​ సిటిజన్స్​ పేర్కొంటున్నారు. ఆక్రమణలకు గురైన ల్యాండ్​ విలువ దాదాపు రూ.120 కోట్లకుపైగానే ఉంటుందని చెప్తున్నారు. కాగా సత్రాలు ఏర్పాటు చేసిన వారి తదనంతరం అను భవదారులు తమకు అమ్మినట్టుగా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి విలువైన ల్యాండ్​ను తమ కబ్జాలోకి బడాబాబులు తెచ్చుకున్నారంటూ ఎండోమెంట్​ ఆఫీసర్లు కూడా చెప్తున్నారు. ఇందులో భాగంగానే చిట్టివారి సత్రానికి చెందిన ల్యాండ్​లో నిర్మాణాలను ఇటీవల కాలంలో ఎం డోమెంట్, రెవెన్యూ ఆఫీసర్లు పరిశీలించారు. కలెక్టర్​ అనుదీప్​ ఫోకస్​ పెడితేనే  వందల కో ట్ల విలువైన ల్యాండ్​ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లకుండా ఉంటుందని ప్రజలు పేర్కొంటున్నారు.

ఆ ల్యాండ్​ ప్రభుత్వానిదే..

కొత్తగూడెం పట్టణంలోని చిట్టివారి సత్రం పేర ఉన్న 142 సర్వే నంబర్​లోని 4,800 గజాల ల్యాండ్​ గవర్నమెంట్​దే. ఇందుకు సంబంధించి మా వద్ద రికార్డులున్నాయి. 373, 76 జీవోల ప్రకారం.. ఈ ల్యాండ్​పై ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్​ పట్టాల కోసం కొందరు దరఖాస్తు చేసుకున్నారు. రిజెక్ట్​ చేశాం. ఈ ల్యాండ్​ను పొందాలనుకునే వారు కొందరు కోర్టుకు వెళ్లి స్టే తీసుకొస్తుండ డంతో  మాకు కూడా కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. - రామకృష్ణ, తహసీల్దార్​, కొత్తగూడెం

మా వద్ద ఆధారాలున్నయ్.. 

మా వద్ద  ఉన్న ఆధారాల ప్రకారంగా చిట్టివారి సత్రానికి చెందిన ల్యాండ్స్​ ఎండోమెంట్​శాఖవే.  దేవుడి భూములు దేవుడికే చెందాలి. ఈ ల్యాండ్స్​ను కాపాడేందుకు చాలా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాం. ఈ విషయంలో కలెక్టర్​అనుదీప్​ సహకారం మరువలేనిది. - సులోచన, గణేశ్​ టెంపుల్​ఈవో, కొత్తగూడెం