కేటీఆర్‌ ఎందుకు రాలే? ఆ ఇద్దరి మధ్య విభేదాలే కారణమా?

కేటీఆర్‌ ఎందుకు రాలే? ఆ ఇద్దరి మధ్య విభేదాలే కారణమా?

మీటింగ్ కు రాని కేటీఆర్
డిప్యూటీ స్పీకర్, మంత్రి మధ్య విభేదాలే కారణం
కేటీఆర్ ముందు పంచాయితీకి సిద్ధమైన పద్మారావు వర్గీయులు

లష్కర్‌‌లోని సీతాఫల్‌‌మండిలో మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదుకు టీఆర్‌‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌ హాజరు కాలేదు. షెడ్యూల్‌‌ ప్రకారం ఈ ప్రోగ్రామ్‌ కు మంత్రితో పాటు డిప్యూటీ స్పీకర్‌‌ పద్మారావు, మేయర్‌‌ బొంతు రామ్మోహన్‌‌ పాల్గొనాల్సి ఉంది. అయితే కేటీఆర్ సమావేశానికి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. సిటీలో అందుబాటులో ఉండి ఉదయం టీఆర్ఎస్ ​భవన్​లో కార్యక్రమానికి హాజరై కూతవేటులో ఉన్న లష్కర్​ మీటింగ్​కు గైర్హాజర్​కు బలమైన కారణం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​, డిప్యూటీ స్పీకర్​ పద్మారావుగౌడ్​ వర్గీయుల మధ్య వైరుధ్యాలు సమావేశంలో ఉప్పెనగా మారే అవకాశం ఉందనే సమాచారంతోనే కేటీఆర్​ సీతాఫల్​మండి సమావేశానికి హాజరుకాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. మున్సిపల్​ ఎన్నికలకు ముందు రాజధాని నగరంలో పార్టీలో లుకలుకలు బట్టబయలైతే దాని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే కేటీఆర్​ రాలేదని అనుకుంటున్నారు.

పార్టీ సీనియర్​ నాయకుడిగా,  స్థానిక ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్​గా ఉన్న పద్మారావుగౌడ్​ను  మంత్రి తలసాని ఖాతరుచేయకపోవడంపై పద్మారావుగౌడ్​ వర్గీయులు కొంతకాలంగా ఆగ్రహంతో ఉన్నారు.  ఉద్యమకాలం నుంచి సీఎం కేసీఆర్​కు సన్నిహితుడిగా, సుధిర్ఘకాలంపాటు పార్టీకి వెన్నెముకగా ఉన్న పద్మారావుకు మంత్రి పదవిరాకపోవడానికి మంత్రి తలసాని కారణమని సికింద్రాబాద్​లోని పద్మారావుగౌడ్​ వర్గీయులు ఇప్పటికీ భావిస్తున్నారు.

ఒకప్పుడు టీఆర్​ఎస్​ పార్టీని విమర్శించి సొంతలాభం కోసం పార్టీ మారిన తలసాని తన సొంత నియోజకవర్గాన్ని కాదని సికింద్రాబాద్​ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపధ్యంలోనే  స్థానిక కార్పొరేటర్లు, సీనియర్​నాయకులు సభ్యత్వ నమోదుకు దూరంగా ఉన్నారు. దాంతో నియోజకవర్గంలో సభ్యత్వాల నమోదు కేవలం 13వేలకే పరిమితం అయ్యింది.

ఇదే అంశాన్ని కేటీఆర్​ సమక్షంలో వాస్తవాలను  ప్రస్తావించి నిలదీసేందుకు పద్మారావుగౌడ్​ వర్గీయులు సమాయత్తం అయ్యారన్న సమాచారంతోనే కేటీఆర్​ సీతాఫల్​మండి సమావేశానికి హాజరుకాలేదని వారు అనుకుంటున్నారు. ఇప్పటికే  మంత్రి తలసాని వ్యవహారశైలితో మేయర్​ బొంతు రాంమోహన్​అన్నింటా అంటిముట్టనట్లుగా ఉన్న సంగతి తెలిసిందే.

నాలుగు సీట్లకే ఆగుతలేరు

తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలవగానే బీజేపోళ్లు ఆగుతలేరని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. లక్కీ లాటరీ మాదిరిగా గెలవగానే ఇక టీఆర్ఎస్ కు మేమే ప్రత్యామ్నాయం అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.  మంగళవారం సీతాఫల్​మండి జీహెచ్ఎంసీ ఫంక్షన్​ హాల్​లో ఏర్పాటుచేసిన సికింద్రాబాద్ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్​యాదవ్​ మాట్లాడుతూ మాకు ప్రత్యామ్నాయం ఓ వైపు కాంగ్రెస్, మరో వైపు బీజేపీ మేమే అంటున్నాయి. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏమైందో గుర్తుతెచ్చుకోవాలని సూచించారు.

సిటీలో 5 సీట్లు ఉండే బీజేపీ ఒకే ఒక్క సీటుకే పరిమితమయ్యిందనే విషయాన్ని గుర్తించాలన్నారు. జడ్పీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఒక్క జడ్పీ చైర్మన్​సీటుపే గెలవలేకపోయాయని విమర్శించారు.    ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని  చెప్పారు.   సంక్షేమం, అభివృద్ధి అంశాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మరింత ఉత్సాహంగా పనిచేయాలని ఆయన టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

మనది కుటుంబ పార్టీ

రాష్ట్రంలో టీఆర్ఎస్​ పార్టీ మాత్రమే మన ఇంటి పార్టీ అని హోంమంత్రి మహమూద్​ అలీ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లు ఏమాత్రం మన పార్టీలు కాదన్నారు.   టీఆర్ఎస్ కు  బలం లేని సమయంలో సికింద్రాబాద్ నుంచి  పద్మారావు గౌడ్ గెలిచారని గుర్తు చేశారు.  నియోజకవర్గంలో  కనీసం 60 వేలకు పైగా సభ్యత్వాలు నమోదు కావాలని కోరారు. పార్టీ నేతలు కష్టపడి పనిచేయాలని,  ప్రజలందరూ బాగుండాలన్న ఉద్దేశంతో  సీఎంకేసీఆర్ ప్రతి ఒక్కరికి మేలు జరిగేలా రూ.60 వేల కోట్లతో  పథకాలు అమలుచేస్తున్నారని వివరించారు.

 మంచి స్పందన వస్తోంది

సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జనం నుంచి మంచి స్పందన వస్తోందని సికింద్రాబాద్​ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్  పద్మారావు గౌడ్ తెలిపారు.  ఈ నెల 10వ తేదీ నాటికి సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. ఇప్పటివరకు 13 వేల సభ్యత్వాలు మాత్రమే పూర్తయాయ్యి. మరో నాలుగు రోజుల వ్యవధిలో మిగతా 37 వేల సభ్యత్వాలను పూర్తి చేసి చూపిస్తామన్నారు.   కార్యక్రమానికి పార్టీ ఇన్​చార్జి వెంకటయ్య,   తలసాని సాయికిరణ్ యాదవ్, నియోజకవర్గం కార్పొరేటర్లు
హాజరయ్యారు.

మేము మారం

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దన్న సూచనలను నేతలెవ్వరూ పట్టించుకోవడంలేదు. మంగళవారం నాటి సమావేశానికి కేటీఆర్​ హాజరవుతారన్న ఉద్దేశంతో పార్టీ నాయకులు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. పర్యావరణ  పరిరక్షణ  దృష్ట్యా ఫ్లెక్సీల ఏర్పాట్లపై జీహెచ్​ఎంసీ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.