చైనా 2 వేల కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించిందంటారా? రాహుల్‌‌ గాంధీకి సుప్రీంకోర్టు ప్రశ్న

చైనా 2 వేల కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించిందంటారా?  రాహుల్‌‌ గాంధీకి సుప్రీంకోర్టు ప్రశ్న
  • మీ దగ్గర ఆధారాలున్నాయా?
  • నిజమైన భారతీయులెవరూ  అలా మాట్లాడరని ఘాటు వ్యాఖ్య

న్యూ ఢిల్లీ: కాంగ్రెస్​ అగ్రనేత, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్​ అయ్యింది. భారత్‌‌‌‌కు చెందిన 2 వేల కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించిందంటూ రాహుల్​ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. ఆ విషయం మీకెలా తెలుసు? అని ప్రశ్నించింది. నిజమైన భారతీయులెవరూ అలా మాట్లాడరని ఘాటు వ్యాఖ్యలు చేసింది.  భారత్ జోడో యాత్రలో దేశ సైన్యాన్ని అవమానించేలా మాట్లాడారని ఆరోపిస్తూ 2022లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అనే వ్యక్తి  ఫిర్యాదు దాఖలు చేశారు. 

ఈ  ఫిర్యాదులో విచారణపై స్టే విధించాలంటూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏసీ మాసిహ్‌‌‌‌తో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు రాహుల్‌‌‌‌ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇందుకు సంబంధించిన ఆధారాలున్నాయా? అని ప్రశ్నించింది.  రాహుల్ ​గాంధీ పిటిషన్​పై విచారణను నిలిపేసిన కోర్టు.. ఆయనకు నోటీసులు జారీ చేసింది. 

పార్లమెంట్‌‌‌‌లో మాట్లాడాలి..

రాహుల్​ తరఫున సీనియర్​ లాయర్​ అభిషేక్​సింఘ్వీ వాదించారు. ఇలాంటి సమస్యలపై ప్రశ్నించకపోతే రాహుల్‌‌‌‌ గాంధీ  ప్రతిపక్ష నాయకుడు ఎలా అవుతారన్నారు. దీంతో ధర్మాసనం సీరియస్​ అయ్యింది. ఏ సమస్యనైనా పార్లమెంట్‌‌‌‌లో మాట్లాడాలి.. కానీ, సోషల్‌‌‌‌ మీడియాలో కాదని మందలించింది. ఇలాంటి సమస్యలపై పార్లమెంట్‌‌‌‌లో ఎందుకు మాట్లాడరని ప్రశ్నించింది.  కాగా, భారత్‌‌‌‌ జోడో యాత్ర సందర్భంగా..2 వేల కిలోమీటర్లకుపైగా భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని రాహుల్‌‌‌‌ గాంధీ ఆరోపించారు.  2020 జూన్‌‌‌‌లో లఢఖ్​ గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణ అనంతరం, మోదీ  ప్రభుత్వం చైనాకు లొంగిపోయిందని, 2 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్నారు. దీనిపై మన సైన్యం చైనా సైన్యంతో చర్చలు జరిపినప్పటికీ ప్రధాని మోదీ  అబద్ధాలు చెబుతున్నారని, ఆక్రమణే జరగలేదంటున్నారని వ్యాఖ్యానించారు. దీంతో రాహుల్ ​వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి.

ప్రతి ఇండియన్​ సమాధానం కోరుతున్నాడు: కాంగ్రెస్​

చైనా దురాక్రమణపై ప్రతి భారతీయుడు కేంద్ర సర్కారు నుంచి సమాధానం కోరుతున్నాడని కాంగ్రెస్​ పేర్కొన్నది. మోదీ ప్రభుత్వం సమాధానాలు ఇవ్వడానికి బదులుగా,  గత ఐదేండ్లుగా ‘తిరస్కరించు, దృష్టి మరల్చు, అబద్ధం చెప్పు, సమర్థించు’  అనే విధానాన్ని పాటిస్తున్నదని ధ్వజమెత్తింది. 2020న గల్వాన్‌‌‌‌ ఘటన తర్వాత భారత భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని చైనాకు మోదీ ఎందుకు క్లీన్‌‌చిట్ ఇచ్చారని ఆ పార్టీ జనరల్ ​సెక్రటరీ జైరాం రమేశ్​ ప్రశ్నించారు. 1962 తర్వాత ఇండియా ఎదుర్కొన్న అతిపెద్ద భూభాగం దురాక్రమణకు మోదీ ప్రభుత్వమే కారణమన్నారు.  పిరికితనం, అసంబద్ధ ఆర్థిక ప్రాధాన్యతల వల్లే మోదీ సర్కారు వెనుకడుగు వేస్తున్నదని మండిపడ్డారు. 

రాహుల్​గాంధీ ‘చైనా గురువు’: బీజేపీ

రాహుల్‌‌‌‌ గాంధీ చైనా గురువు అని బీజేపీ విమర్శించింది. ఆయన భారత సాయుధ దళాలను అవమానిస్తున్నారని మండిపడింది. విదేశీ శక్తులు రాహుల్​గాంధీని రిమోట్​ కంట్రోల్​తో ఆపరేట్​ చేస్తున్నారని పేర్కొన్నది. ఆధారాలు లేని వ్యాఖ్యలు చేసినందుకు సుప్రీంకోర్టు మందలించిన తర్వాతైనా రాహుల్ ​తీరు మార్చుకుంటారని తాను ఆశిస్తున్నట్టు పార్లమెంటరీ అఫైర్స్​ మినిస్టర్​ కిరణ్​​ రిజుజు అన్నారు.

‘‘ప్రతిపక్ష నాయకుడు ఈ రకమైన ప్రకటనలు చేయడం దేశానికి హానికరం, అవి మన సైన్యాన్ని నిరుత్సాహ పరుస్తాయి” అని పేర్కొన్నారు. ఆధారాలు లేని ప్రకటనలు చేయవద్దని అనేక మంది నాయకులకు రాహుల్​గాంధీ విజ్ఞప్తి చేశారని, కానీ ఆయన  ఎలాంటి సలహా తీసుకోవడానికి ఇష్టపడడం లేదని ఎద్దేవా చేశారు.  రాహుల్​గాంధీని సుప్రీంకోర్టు హెచ్చరించడం తనకు సంతోషాన్ని కలిగించిందని అన్నారు.