Aishwarya Rai : ' సేవ చేయడమే నిజమైన నాయకత్వం'.. ప్రధాని మోదీ పాదాలకు నమస్కరించిన ఐశ్వర్య రాయ్!

Aishwarya Rai : ' సేవ చేయడమే నిజమైన నాయకత్వం'..  ప్రధాని మోదీ పాదాలకు నమస్కరించిన ఐశ్వర్య రాయ్!

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఆరాధించే ఆధ్యాత్మిక గురువు శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు పుటపర్తిలో ఈ రోజు ( నవంబర్ 18న ) ఘనంగా జరిగాయి.  హిల్ వ్యూ స్టేడియంలో  ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ , పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 

ప్రధాని ఆశీర్వాదం తీసుకున్న ఐశ్వర్య

ఈ కార్యక్రమంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్..  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాదాలకు నమస్కరించిన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ దృశ్యం అక్కడి భక్తులను, ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. అనంతరం మాట్లాడిన ఐశ్వర్య.. సత్యసాయి బాబా బోధించిన ఐక్యత, కరుణ, ఆధ్యాత్మిక బాధ్యత వంటి విలువలను ప్రముఖంగా ప్రస్తావించారు. బాబా సూచించిన ఐదు విధానాలను తాను ఇప్పటికీ పాటిస్తానని చెప్పారు.  జాతి, మతం వంటి అడ్డుగోడలను దాటి ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

మర్చిపోలేని మార్గదర్శకాలు..

"ఒకే ఒక్క జాతి ఉంది, అది మానవతా జాతి. ఒకే ఒక్క మతం ఉంది, అది ప్రేమ మతం. ఒకే ఒక్క భాష ఉంది, అది హృదయ భాష. ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, ఆయన సర్వవ్యాప్తుడు అని బాబా ఎప్పుడూ చెబుతుండేవారు అని  ఐశ్వర్య సత్యసాయి బోధనలను గుర్తు చేసుకున్నారు. సత్యసాయి జన్మించి వందేళ్లు గడిచినా, బాబా లక్షలాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని ఐశ్వర్య రాయ్ అన్నారు. బాబా నేర్పిన క్రమశిక్షణ , అంకితభావం , భక్తి , సంకల్పం , విచక్షణ అనే ఐదు మార్గదర్శక సూత్రాలను తాను ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె పేర్కొన్నారు.

►ALSO READ | సారీ చెప్పు.. లేదంటే హిందు సమాజం నిన్ను క్షమించదు: రాజమౌళికి బీజేపీ నేత చికోటీ వార్నింగ్

 నిజమైన నాయకత్వం అంటే సేవ చేయడమే..

ఈ శత జయంతి వేడుకలకు హాజరైనందుకు ఐశ్వర్య రాయ్ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని రాక వేడుకలకు పవిత్రతను, స్ఫూర్తిని ఇచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. నిజమైన నాయకత్వం అంటే సేవ చేయడమే, మానవుడికి సేవ చేయడమే దేవుడికి సేవ చేయడమని బాబా సందేశాన్ని మీ ఉనికి మాకు గుర్తు చేస్తుంది అని ఆమె ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.