ట్రంప్ మాస్ వార్నింగ్: మాట వినకుంటే ఫ్రాన్స్ వైన్, షాంపైన్‌లపై 200% టారిఫ్ బాంబ్..

ట్రంప్ మాస్ వార్నింగ్: మాట వినకుంటే ఫ్రాన్స్ వైన్, షాంపైన్‌లపై 200% టారిఫ్ బాంబ్..

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనదైన శైలిలో అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. గాజా పునర్నిర్మాణం కోసం ఆయన ప్రతిపాదించిన "బోర్డ్ ఆఫ్ పీస్"లో చేరడానికి ఫ్రాన్స్ నిరాకరించడంతో.. ఆ దేశంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రాన్స్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వైన్, షాంపైన్‌లపై ఏకంగా 200 శాతం టారిఫ్ విధిస్తానని తీవ్రంగా హెచ్చరించారు. ఈ బెదిరింపుతోనైనా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దారిలోకి వస్తారని, తమ కూటమిలో చేరతారని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి బెదిరింపులకు తాము లొంగబోమని మాక్రాన్ స్పష్టం చేయడంతో ఇప్పుడు వాషింగ్టన్, పారిస్ మధ్య దౌత్యపరమైన యుద్ధం మొదలైంది.

అసలు తాజా వివాదానికి ప్రధాన కారణం ట్రంప్ ఏర్పాటు చేయాలనుకుంటున్న శాంతి మండలి నిబంధనలు. కేవలం గాజా ప్రాంతానికే పరిమితం కాకుండా.. ఈ బోర్డు పరిధి చాలా విస్తృతంగా ఉందని, ఇది ఐక్యరాజ్యసమితి సూత్రాలకు విరుద్ధంగా ఉండే అవకాశం ఉందని ఫ్రాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందుకే ట్రంప్ ఆహ్వానాన్ని మాక్రాన్ సున్నితంగా తిరస్కరించారు. మరోవైపు ఈ బోర్డులో శాశ్వత సభ్యత్వం కావాలంటే సదరు దేశం కనీసం 1 బిలియన్ డాలర్ల నిధులను అందించాలని ట్రంప్ రూల్స్ విధించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలీ వంటి నేతలను కూడా ఈ బోర్డులోకి ఆహ్వానించడం గమనార్హం. దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో దీనిపై సంతకాలు చేయించాలని ట్రంప్ భావిస్తున్నారంట.

ట్రంప్ హెచ్చరికలు కేవలం ఫ్రాన్స్‌కే పరిమితం కాలేదు. గ్రీన్ లాండ్ భూభాగాన్ని అమెరికాకు అప్పగించే వరకు డెన్మార్క్, జర్మనీ, బ్రిటన్, స్వీడన్ వంటి యూరప్ దేశాల నుంచి వచ్చే వస్తువులపై ఫిబ్రవరి 1 నుంచి 10 శాతం టారిఫ్ విధిస్తామని కొద్ది రోజుల మునుపే ప్రకటించారు. గ్రీన్ లాండ్‌లోని ఖనిజ సంపద, వ్యూహాత్మక ప్రాధాన్యత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ సమర్థించుకున్నారు. గతంలో పనామా కాలువ, వర్జిన్ ఐలాండ్స్‌ను అమెరికా ఎలాగైతే పొందిందో.. ఇప్పుడు గ్రీన్ లాండ్ విషయంలోనూ అదే విధానాలను అనుసరిస్తామని ట్రంప్ చెబుతున్నారు.

అమెరికా అనుసరిస్తున్న ఈ వాణిజ్య ఒత్తిడి విధానంపై యూరోపియన్ దేశాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఎటువంటి బెదిరింపులు తమ విదేశాంగ విధానాన్ని మార్చలేవని ఫ్రాన్స్ తేల్చి చెప్పేసింది. వాణిజ్య సుంకాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఆయుధంగా వాడుకోవడం అంతర్జాతీయ సంబంధాలను దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ తీసుకుంటున్న ఈ అసాధారణ నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆర్థిక, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసేలా కనిపిస్తున్నాయి. ఒకవైపు శాంతి మండలి అని చెబుతూనే.. మరోవైపు మిత్రదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెుత్తానికి ట్రంప్ చేస్తున్న పనులతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వరుస షాక్‌లకు గురవుతోంది.