- అమెరికా అధ్యక్షుడి మూడు రోజుల చైనా టూర్ ముగింపు
- ఇరాన్ అణ్వాయుధాల తయారీ జిన్ పింగ్కూ ఇష్టంలేదు: ట్రంప్
- ట్రంప్ పర్యటన చరిత్రాత్మకమైనదన్న చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్
బీజింగ్: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం తమ మధ్య జరిగిన చర్చలు చారిత్రకమైనవని, ఇరుదేశాల మధ్య సంబంధాల్లో మైలురాయి వంటివని కొనియాడారు. అమెరికా అధ్యక్షుడి మూడు రోజుల చైనా పర్యటన ఉత్సాహంగానే ముగిసినప్పటికీ, ఇరాన్ యుద్ధం ముగింపు, అంతర్జాతీయ ఇంధన భద్రత వంటి కీలక అంశాలపై మాత్రం ఎటువంటి ఒప్పందాలు ప్రకటించలేదు.
ఇరాన్ యుద్ధం, ద్వైపాక్షిక వాణిజ్య ఘర్షణలతో సహా పలు ప్రపంచ అంశాలపై అనేక రౌండ్ల చర్చలు జరిపిన ఇద్దరు అధ్యక్షులు, బీజింగ్‌లో అగ్రనేతలు నివసించే అత్యంత భద్రత కలిగిన జోంగ్నానీ ప్రాంగణంలో ప్రైవేట్ సమావేశంతో తమ చర్చలను శుక్రవారం ముగించారు. ఆ ప్రాంగణంలో ట్రంప్, జిన్ పింగ్ నడుస్తూ మాట్లాడుకున్నారు. అక్కడక్కడా ఆగుతూ తోటలోని చెట్లు, పూలను వీక్షించారు. అయితే, ఈ పర్యటన చాలా విజయవంతమైందని, ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని ట్రంప్ అభివర్ణించినట్టు చైనా మీడియా వెల్లడించింది. "జిన్ పింగ్ నా పాత మిత్రుడు. ఆయనపై గొప్ప గౌరవం ఉంది. నిజాయతీతో కూడిన, లోతైన కమ్యూనికేషన్ కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నా” అని ట్రంప్ చెప్పారు.
వైట్ హౌస్‌కు జిన్ పింగ్ ను ఆహ్వానించడానికి తాను ఎదురు చూస్తున్నట్లు ఆయన తెలిపారు. ట్రంప్ పర్యటన చరిత్రాత్మకమైనదని జిన్ పింగ్ కూడా అభివర్ణించారు. చైనా, -అమెరికా సంబంధాల బలోపేతానికి ఇరుపక్షాలు ఒక కొత్త దార్శనికతను నిర్దేశించాయని చెప్పారు.
- ఇరాన్ పని అయిపోయింది: ట్రంప్
ఇరాన్ పని అయిపోయిందని, ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణను ముగించడానికి ఆ దేశం ఒప్పందం చేసుకోవాలని, లేదంటే విధ్వంసాన్ని ఎదుర్కోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. చైనాలో శుక్రవారం తన మూడు రోజుల పర్యటన ముగింపు సందర్భంగా ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. "అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదరాలని జిన్ పింగ్ కోరుకుంటున్నారు.
ఏ రకమైన సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండటం చైనాకు కూడా ఇష్టం లేదని నేను నమ్ముతున్నా” అని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే, ఇరాన్ ఖార్గ్ ద్వీపాన్ని కేవలం నాలుగు లేదా ఐదు నిమిషాల్లో అమెరికా నిర్వీర్యం చేయగలదని చైనా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కెయిన్ తనకు తెలిపారని ట్రంప్ అన్నారు.
ఇరాన్‌కు చైనా సైనిక పరికరాలను ఇవ్వదని జిన్ పింగ్ హామీ ఇచ్చారని చెప్పారు. కాగా, తైవాన్‌కు అమెరికా ఆయుధాల విక్రయ ఒప్పందంపై తాను ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
- అమెరికా పతనమవుతోందన్న జిన్ పింగ్..
- అది బైడెన్ వైఫల్యమంటూ ట్రంప్ పోస్ట్
అమెరికా పతనం అవుతోందంటూ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చేసిన వ్యాఖ్యలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తక్కువ చేసి చూపారు. బైడెన్ పాలనలో ఉన్న పరిస్థితిని ఉద్దేశించి జిన్ పింగ్ ఆ వ్యాఖ్యలు చేశారంటూ ట్రంప్ 'ట్రూత్ సోషల్'లో పేర్కొన్నారు.
