- జపాన్ ప్రధాని టకాయిచీతో యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ భేటీ
టోక్యో, వాషింగ్టన్: అమెరికా, జపాన్ మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది. రేర్ ఎర్త్, క్రిటికల్ ఎలిమెంట్స్ అంశంపైనా ఒప్పందం ఓకే అయింది. సోమవారం మలేసియా నుంచి జపాన్ చేరుకున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మంగళవారం టోక్యోలో జపాన్ ప్రధాని సనే టకాయిచీతో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలు, రష్యా–ఉక్రెయిన్ వార్, తదితర అంశాలపై చర్చించుకున్నారు. అనంతరం ట్రేడ్ డీల్, రేర్ ఎర్త్ మినరల్స్, క్రిటికల్ ఎలిమెంట్స్ ఒప్పందాలపై ట్రంప్, టకాయిచీ సంతకాలు చేశారు. ట్రేడ్ డీల్ ప్రకారం.. జపాన్ వస్తువులపై అమెరికా 15% టారిఫ్ లు వేయనుంది.
అలాగే అమెరికాలో జపాన్ పెట్టుబడి పెట్టేందుకు 550 బిలియన్ డాలర్ల ఫండ్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా టకాయిచీ మాట్లాడుతూ.. ట్రంప్‌ను జపాన్ తరఫున నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తామని ప్రకటించారు. ట్రంప్ మాట్లాడుతూ.. జపాన్‌కు తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన టకాయిచీకి పాలనా వ్యవహారాలను సమర్థంగా నడపడం ‘బిగ్ డీల్’ అవుతుందన్నారు. జపాన్ తమకు గట్టి మిత్ర దేశమని, ఆ దేశానికి అన్ని రకాలుగా సహకారం అందిస్తామన్నారు. కాగా, అమెరికా వెహికల్స్‌ను జపాన్ కొనదంటూ తరచూ ట్రంప్ విమర్శలు చేసిన నేపథ్యంలో తాజాగా ఫోర్డ్ ఎఫ్150 వెహికల్స్‌ను టకాయిచీ కొనుగోలు చేయించడం విశేషం. కాగా, టోక్యో సమీపంలోని అమెరికా నేవల్ బేస్‌ను ట్రంప్ సందర్శించారు.
వీలైతే మూడోసారి కూడా నేనే ప్రెసిడెంట్: ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మూడోసారి పోటీ చేయడంపై వస్తున్న ఊహాగానాలపై ఆయన సోమవారం స్పందించారు. మలేసియా నుంచి జపాన్ వస్తుండగా విమానంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మూడోసారి ప్రెసిడెంట్ ఎన్నికల బరిలోకి దిగుతారనే వార్తలను తోసిపుచ్చలేదు. ఆ అవకాశం వస్తే తనకు సంతోషమేనని అన్నారు. అయితే, ట్రంప్ ఈసారి వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తారని, ఎన్నికల్లో గెలిచాక ప్రెసిడెంట్ అభ్యర్థిని రాజీనామా చేయించి, అధ్యక్ష బాధ్యతలు చేపట్టొచ్చన్న ఊహాగానాలూ సాగుతున్నాయని జర్నలిస్టులు ప్రశ్నించగా.. ‘‘నిజమే.. నేను అలాకూడా చేయొచ్చు” అని ట్రంప్ బదులిచ్చారు. కానీ తాను అలా ప్రెసిడెంట్ అయితే ప్రజలు ఇష్టపడకపోవచ్చని, అందుకే తాను చేయనని చెప్పారు. అయితే, అమెరికా రాజ్యాంగం 22వ అమెండ్ మెంట్ ప్రకారం ఏ వ్యక్తి కూడా దేశ అధ్యక్షుడిగా రెండు విడతలకు మించి బాధ్యతలు చేపట్టేందుకు అవకాశం లేదు. అందుకే థర్డ్ టైం ప్రెసిడెంట్ అయ్యేందుకు ఈ నిబంధనను కోర్టులో సవాల్ చేస్తారా? అన్న జర్నలిస్టుల ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. కోర్టుకు వెళ్లే ఆలోచన మాత్రం లేదన్నారు.
