చైనా విమానయాన సంస్థలపై అమెరికా నిషేధం

చైనా విమానయాన సంస్థలపై అమెరికా నిషేధం

కరోనా వైరస్‌ విషయంపై అమెరికా మొదటి నుంచి చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు చైనాపై అమెరికా మరింత దూకుడు పెంచింది. చైనాకు చెందిన నాలుగు విమానయాన సంస్థల రాకపోకలను నిషేధిస్తూ అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 16 నుంచి ఇది అమల్లోకి వస్తుందని అమెరికా ట్రాన్స్‌పోర్టేషన్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. కరోనా వైరస్ క్రమంలో ఈ ఏడాది మొదట్లో వుహాన్‌ ప్రావిన్స్‌కు అమెరికా తన విమానాలను నిలిపివేసింది. అయితే, ఈ నెల 1 నుంచి విమానాలు నడిపేందుకు అమెరికా విమానయాన సంస్థలు యునైటెడ్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్ సిద్ధమైనప్పటికీ చైనా అనుమతులు మంజూరు చేయలేదు. ఫలితంగా అమెరికా ఇప్పుడీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రెండు దేశాల మధ్య విమానాల రాకపోకలపై జరిగిన అగ్రిమెంట్ ను చైనా ఉల్లంఘించిందని అమెరికా ట్రాన్స్‌పోర్టేషన్ డిపార్ట్‌మెంట్ ఆరోపించింది. చైనా ప్రభుత్వం ఎన్ని అమెరికా విమానాలను తమ దేశంలోకి అనుమతిస్తుందో, అన్నే విమానాలను తాము కూడా అమెరికాలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది అమెరికా ట్రాన్స్‌పోర్టేషన్ డిపార్ట్‌మెంట్.