ఇవాళ (జూన్ 14) ఇరాన్‌‌‌‌ తో శాంతి ఒప్పందం...డీల్‌‌‌‌పై సంతకాలు అయిన వెంటనే  అందరికీ హార్మూజ్ జలసంధి ఓపెన్..!

ఇవాళ (జూన్ 14) ఇరాన్‌‌‌‌ తో శాంతి ఒప్పందం...డీల్‌‌‌‌పై సంతకాలు అయిన వెంటనే  అందరికీ హార్మూజ్ జలసంధి ఓపెన్..!
  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన 
  • గతంలో ఒబామా కుదుర్చుకున్న డీల్​కు ఇది భిన్నం
  • ఇరాన్ ఇక ఏ రకంగానూ అణ్వాయుధాలు పొందలేదు 
  • ఆ దేశం వద్ద ఉన్న శుద్ధి చేసిన  యురేనియంనూ ధ్వంసం చేస్తామని వెల్లడి
  • ఒప్పందం అమలు చేయకుంటే  తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక

వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికేలా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చరిత్రాత్మక శాంతి ఒప్పందం ఆదివారం నాడే జరగబోతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం రాత్రి ప్రకటించారు. ఈ ఒప్పందంపై సంతకాలు జరిగిన వెంటనే హార్మూజ్ జలసంధి అందరి రవాణాకు అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ‘‘రేపు ఒప్పందంపై సంతకాలు జరగాల్సి ఉంది. ఆ సంతకాలు పూర్తయిన వెంటనే హార్మూజ్ జలసంధి అందరికీ ఓపెన్ అవుతుంది” అని ఆయన తెలిపారు. 

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో ఇరాన్ తో జరిగిన ఒప్పందంతో పోలిస్తే తన ఒప్పందం పూర్తి భిన్నమైనదని చెప్పారు. ‘‘బరాక్ హుస్సేన్ ఒబామా ఇరాన్‌తో కుదుర్చుకున్న జేసీపీఓఏ ఒప్పందం అణ్వాయుధాన్ని తయారు చేసుకోవడానికి ఒక సులువైన, చక్కని, సాఫీ మార్గం లాంటిది. ఒకవేళ అదే ఉండి ఉంటే ఇరాన్ ఆరేళ్ల క్రితమే అణ్వాయుధాన్ని సాధించి ఉండేది. ఈ పాటికే ఎప్పుడో దానిని ఉపయోగించి కూడా ఉండేది. కానీ ఇరాన్‌తో నా ఒప్పందం దానికి పూర్తి విరుద్ధం. అణ్వాయుధాలు లేకుండా చేసే ఒక బలమైన గోడ లాంటిది’’ అని ఆయన రాశారు. ఇరాన్ ఇప్పుడు అణ్వాయుధాన్ని కోరుకోవడం లేదని, భవిష్యత్తులో కూడా కొనుగోలు ద్వారా కానీ, అభివృద్ధి చేయడం ద్వారా కానీ, మరే ఇతర మార్గాల్లో కానీ ఆ దేశం అణ్వాయుధాన్ని కలిగి ఉండబోదని ట్రంప్ స్పష్టం చేశారు.

ఇరాన్ యురేనియం స్వాధీనం చేస్కుంటాం.. 

ఇరాన్ వద్ద అణుబాంబులు తయారు చేసేందుకు దగ్గరగా శుద్ధిచేసి ఉంచిన యురేనియం నిల్వలను అమెరికా స్వాధీనం చేసుకుని, పూర్తిగా ధ్వంసం చేయబోతోందని ట్రంప్ వెల్లడించారు. ‘‘సమయం వచ్చినప్పుడు, అంతా ప్రశాంతంగా ఉన్న వేళ, మన అద్భుతమైన బీ-2 బాంబర్లు, వాటి అసాధారణ పైలట్ల సహాయంతో అత్యంత శక్తివంతమైన గ్రానైట్ పర్వతాల కింద లోతుగా పాతిపెట్టిన అణు వ్యర్థాలను లోపలికి వెళ్లి వెలికితీస్తాం. ఆ నిల్వలను ఇరాన్‌లో అయినా లేదా అమెరికాలో అయినా సరే డౌన్‌బ్లెండ్ చేసి (తీవ్రతను తగ్గించి) పూర్తిగా నాశనం చేస్తాం’’ అని ఆయన చెప్పారు. ‘‘భవిష్యత్తులో ఇరాన్, మొత్తం పశ్చిమాసియాతో కలిసి దీర్ఘకాలం పని చేయడానికి మేం ఎదురుచూస్తున్నాం’’ అని పేర్కొన్నారు. అయితే, ఈ ఒప్పంద ప్రణాళికను పూర్తిగా అమలు చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించారు.

‘‘ఈ ప్రక్రియ అంతా త్వరగా, సులభంగా, సాఫీగా సాగుతుందని ఆశిస్తున్నాను. అలా జరగకపోతే, మా దగ్గర అత్యున్నత ప్రత్యామ్నాయ మార్గం సిద్ధంగా ఉంది. దానిని మళ్లీ ఎప్పుడూ ఉపయోగించాల్సిన అవసరం రాకూడదని కోరుకుంటున్నాను” అని వార్నింగ్ ఇచ్చారు. కాగా, ట్రంప్ ప్రకటనకు కొన్ని గంటల ముందే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. అమెరికా, ఇరాన్ మధ్య చరిత్రాత్మక శాంతి ఒప్పందం ఖరారు కానుందని వెల్లడించారు. ఈ ప్రకటనను ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయీ ఖండించారు. ఆదివారం ఎలాంటి ఒప్పందం గానీ, సంతకాలు చేయడం గానీ జరగబోవని ఆయన చెప్పారు.