వాషింగ్టన్: ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటన వెనక ఇరాన్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఇరాన్ ఈ ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ఇరాన్ ప్రమేయం ఉందా అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
ఫ్లైదుబాయ్ ఘటనపై అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ట్రంప్, జేడీ వాన్స్ వైఖరి భిన్నంగా ఉంది. ఈ ఘటనతో ఇరాన్‌కు సంబంధం ఉందని చెప్పడానికి ఇప్పటివరకు నిశ్చయాత్మకమైన ఆధారాలు ఏమీ లేవని జేడీ వాన్స్ పేర్కొనగా.. ఫ్లైదుబాయ్ విమాన ఘటన వెనక ఇరాన్ ప్రమేయం ఉందని ట్రంప్ ఆరోపించడం గమనార్హం.
ఈ ఘటనపై అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షుల భిన్న వైఖరి చర్చనీయాంశంగా మారింది. ఫ్లైదుబాయ్ ఘటనను దర్యాప్తు చేస్తోన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఈ దాడి వెనుక ఎవరున్నారనే దానిపై తుది నిర్ధారణకు రాలేదు. కానీ ఈ ఘటనను ఒక ఉగ్రవాద చర్యగా యూఏఈ, ఇజ్రాయెల్ ప్రకటించాయి.
అసలేం జరిగిందంటే..?
బుధవారం (సెప్టెంబర్ 30) ఆకాశంలో సినీ రేంజ్లో హైడ్రామా నడిచింది. ఫ్లైదుబాయ్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం 180 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ బయలుదేరింది. విమానం గాల్లో ఉండగా కాక్ పిట్లో పైలట్ల మధ్య ఘర్షణ జరిగింది. పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో పైలట్ కత్తితో దాడి చేశాడు. పైలట్ల మధ్య ఘర్షణతో విమానం అదుపు తప్పింది.
ఆకాశంలో విమానం కేవలం 30 సెకన్లలోనే దాదాపు 14 వేల నుంచి 17 వేల అడుగుల మేర కిందికి పడిపోయింది. కాక్ పిట్ నుంచి అరుపులు వినిపించడం, విమానం ఆకస్మాత్తుగా ఎత్తు తగ్గడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోనకు గురయ్యారు. ఈ క్రమంలోనే కొందరు పైలట్లు ధైర్యంగా కాక్ పిట్ డోర్ బద్దలుకొట్టి పైలట్‌పై దాడి చేసిన కో పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు పైలట్ల (ఆన్-డ్యూటీ సిబ్బంది) సహాయంతో విమానాన్ని ఈశాన్య సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే సౌదీ పోలీసులు కో పైలట్‌ను అరెస్ట్ చేశారు.
గాయపడ్డ పైలట్‌ను ఆసుపత్రికి తరలించారు. కో పైలట్ విమానాన్ని క్రాష్ చేయడానికి ప్రయత్నించినట్లు సౌదీ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై విచారణకు యూఏఈ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా ఫ్లైదుబాయ్ ఘటనను ఉగ్రవాద చర్యగా ప్రకటించింది.
