మోడీ మాటిచ్చారు.. ఇకపై భారత్ రష్యా ఆయిల్ కొనదు: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

మోడీ మాటిచ్చారు.. ఇకపై భారత్ రష్యా ఆయిల్ కొనదు: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

వాషింగ్టన్: రష్యా ఆయిల్ కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైట్ హౌస్‎లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఇకపై రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయదని.. ఈ మేరకు ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ తెలిపారు. అయితే.. కొనుగోళ్లు వెంటనే ఆపకుండా మెల్ల మెల్లగా బంద్ చేస్తారని చెప్పారు. మూడేళ్లుగా ఉక్రెయిన్‎పై దండయాత్ర చేస్తోన్న రష్యాను ఒంటరిని చేసే ప్రయత్నంలో ఇది కీలక ముందడుగు అని ట్రంప్ అభివర్ణించారు.

 భారత్ రష్యా చమురు కొనుగోలును ఆపివేస్తే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ఈ చర్య ఎంతగానో సహాయపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చైనాను కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా ఒత్తిడి చేస్తామన్నారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు విషయంలో భారత్‎తో వివాదం ఉన్న మాట వాస్తవమేనని.. కానీ ఇండియా అమెరికాకు ఎప్పటికీ సన్నిహిత దేశమేనని అన్నారు. 

ప్రధాని మోడీ నాకు మంచి స్నేహితుడు అని.. మా ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. కాగా, మూడేళ్లుగా ఉక్రెయిన్‎తో యుద్ధం చేస్తోన్న రష్యాతో వాణిజ్యం చేయొద్దని ప్రపంచదేశాలను ట్రంప్ హెచ్చరిస్తు్న్న విషయం తెలిసిందే. అయితే.. భారత్ మాత్రం దేశ అవసరాల దృష్ట్యా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుంది. 

తన మాట ధిక్కరించి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోందన్న అక్కసుతో ఇండియా ఎగుమతులపై ట్రంప్ 25 శాతం అదనపు సుంకాలు విధించాడు. ఈ క్రమంలో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు ఆపేస్తుందని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేస్తున్నట్లు భారత ప్రభుత్వం మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.