
Trump News: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీని ప్రభావం అమెరికాలోని వలస ప్రజలపై మాత్రం ప్రతికూలంగా ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల కిందట ట్రంప్ సర్కార్ అమెరికా నుంచి విదేశాలకు పంపే డబ్బుపై పన్ను వసూళ్లను స్టార్ట్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
వాస్తవానికి అమెరికా వెళ్లి ప్రతి మధ్యతరగతి కుటుంబంలోని వ్యక్తులు అక్కడ సంపాదించిన దానిలో ఎక్కువ భాగాన్ని స్వదేశంలోని కుటుంబసభ్యులకు పంపేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసే డబ్బుపై 5 శాతం చొప్పున పన్ను వసూలు చేయాలని గతంలో ట్రంప్ సర్కార్ నిర్ణయించినప్పటికీ ప్రస్తుతం దానిని 3.5 శాతానికి తగ్గించినట్లు వెల్లడైంది.
ఎవరైనా వ్యక్తి తాజారేటు కింద అమెరికా నుంచి తమ ఫ్యామిలికీ 10వేల డాలర్లు అంటే రూ.8లక్షల 50వేలు పంపినట్లైతే.. గతంలో లెక్క ప్రకారం 500 డాలర్లు అంటే 42వేల 500 రూపాయలు దీనికి పన్నుగా చెల్లించాల్సి ఉండేది. కానీ ప్రస్తుతం తగ్గించిన పన్ను రేటు ప్రకారం వారు 350 డాలర్లు అంటే రూ.29వేల 750 కడితే సరిపోతుంది. ఇక్కడ ట్రంప్ సర్కార్ కొత్త నిర్ణయం కారణంగా రూ.12వేల 750 వరకు చెల్లించాల్సిన పన్ను తగ్గనుంది. (ఇక్కడ డాలర్ రూపాయి మారకం రేటు రూ.85గా తీసుకోవటం జరిగింది)
అలాగే ఇకపై కొత్త చట్టం ప్రకారం ఎవరైనా వ్యక్తులు అమెరికా నుంచి తమ దేశాలకు రోజులో 5వేల డాలర్లకు మించి డబ్బు పంపిస్తే సదరు ట్రాన్సాక్షన్ వివరాలను మనీ ట్రాన్స్‌ఫర్ కంపెనీలు అమెరికా ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. అలాగే డబ్బు ఇందుకోసం కేవైసీ రూల్స్ కూడా కఠినతరం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ చర్యలు విద్యార్థులకు కొంత ఇబ్బందిని కలిగించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతానికి ఈ బిల్లు ఇంకా చట్టరూపం దాల్చలేదు. ఇది ఇప్పటికి చర్చల దశలో ఉన్నప్పటికీ అమెరికాలో చదుకువుకోవటానికి వెళ్లిన విద్యార్థులు ఆర్థికంగా రాబోయే పరిస్థితులకు అనుగుణంగా సంసిద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇప్పటి వరకు అమెరికా ఇమ్మిగ్రెంట్లు తమ స్వదేశాలకు డబ్బు పంపటంపై ఎలాంటి పన్నులను విధించలేదు. కానీ ట్రంప్ ప్రస్తుతం విధిస్తున్న పన్ను అమెరికాకు బిలియన్ డాలర్ల మేర సంపదను తెచ్చిపెడుతుందని వీటిని బోర్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టులకు వినియోగించాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడైంది.
ఇక భారతదేశం విషయానికి వస్తే ప్రతి ఏటా ప్రవాస భారతీయులు అమెరికాలో సంపాదించిన దాని నుంచి తమ ప్రియమైన వారికి, ఫ్యామిలీకి అక్షరాలా రూ.7 లక్షల కోట్ల వరకు పంపిస్తూ ఉంటారు. ట్రంప్ చర్యల కారణంగా ఇకపై ఇండియాకు అమెరికాలో నివసిస్తున్న భారతీయుల నుంచే వచ్చే డబ్బు తగ్గిపోతుందని అంచనా వేయబడింది. అమెరికా నుంచి పంపే ప్రతి రూ.లక్షలో రూ.5వేలు పన్ను రూపంలో కట్ అవనుంది. ఇది సొంత దేశాలకు డబ్బు పంపే ధోరణిని దెబ్బతీస్తుందని తెలుస్తోంది.