వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఎఫ్ –15 ఈగిల్ ఫైటర్ జెట్ ఇరాన్‌లో కూలిపోయిందని తెలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గంటల తరబడి అధికారులపై కేకలు వేశారని వాల్ స్ట్రీట్ జర్నల్ (డబ్ల్యూఎస్‌జే) తెలిపింది. దీంతో పైలట్ రెస్క్యూ ఆపరేషన్‌లో ఆయన అసహనం తమకు అడ్డంకిగా మారుతుందని అధికారుల్లో ఆందోళన వ్యక్తమైంది. వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో ట్రంప్ అసహనం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉందని భావించారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షణ మొత్తం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆధ్వర్యంలోనే జరిగింది. అయితే, వైట్‌హౌస్ ఈ వార్తలను కొట్టిపారేసింది.
అమెరికా దళాల రెస్క్యూ మిషన్
ఏప్రిల్ 3న ఇరాన్ భూభాగంలో ఎఫ్–15 ఈగిల్ ఫైటర్ జెట్ కూలిపోవడంతో అమెరికాకు చెందిన ఇద్దరు పైలట్లు గల్లంతయ్యారు. ఒక పైలట్‌ను వెంటనే రక్షించినా.. అదే విమానంలోని మరో పైలట్ శత్రు భూభాగంలోనే చిక్కుకుపోయారు. ఆ సైనికుడిని కాపాడేందుకు అమెరికా భారీ ఆపరేషన్ చేపట్టింది. అతడి ఆచూకీని కనిపెట్టేందుకు అమెరికా దళాలు 24 గంటల పాటు ప్రాణాలకు తెగించి ఇరాన్ భూభాగంలో గాలింపు చేపట్టాయి.
సీఐఏ అందించిన కీలక సమాచారంతో పర్వత లోయల్లో దాక్కున్న పైలట్‌ను గుర్తించారు. ఆపై చాకచక్యంగా వ్యవహరించి, ఇరాన్ దళాలను పక్కదోవ పట్టించి పైలట్‌ను కాపాడారు. ఈ క్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్ మొత్తాన్ని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రత్యక్షంగా వార్ రూమ్ నుంచి పర్యవేక్షించారు.
ఫైటర్ జెట్ కూలిన విషయం తెలిసినపుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారులపై గంటల తరబడి ఆగ్రహం వ్యక్తం చేయడంతో వార్ రూమ్‌కు ఆయనను దూరం పెట్టారని సమాచారం. కీలక అధికారులతో కలిసి జేడీ వాన్స్ పరిస్థితిని గమనిస్తూ, నిరంతరం ట్రంప్‌తో టచ్‌లో ఉన్నారని డబ్ల్యూఎస్‌జే తన కథనంలో పేర్కొంది. ఫోన్ ద్వారా అధ్యక్షుడికి పరిస్థితిని వివరిస్తూ ఆయన సూచనలు తీసుకున్నారని తెలిపింది.

