టారిఫ్‎లు వేస్తానని బెదిరించా.. భయంతో ఒక్కో దేశం బయటకు వస్తోంది: బ్రిక్స్ కూటమిపై ట్రంప్ ఫైర్

టారిఫ్‎లు వేస్తానని బెదిరించా.. భయంతో ఒక్కో దేశం బయటకు వస్తోంది: బ్రిక్స్ కూటమిపై ట్రంప్ ఫైర్

వాషింగ్టన్ డీసీ: డాలర్​పై బ్రిక్స్ కూటమి దాడి చేస్తోందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. డాలర్ కు పోటీగా ప్రత్యామ్నాయ కరెన్సీని తేవాలని బ్రిక్స్ ప్రయత్నిస్తోందని, అందుకే ఆ కూటమిలోని దేశాలపై అదనపు టారిఫ్ లు వేస్తానని బెదిరించానని అన్నారు. అందుకే ఇప్పుడు బ్రిక్స్ కూటమి నుంచి ఒక్కో మెంబర్ కంట్రీ బయటకు వస్తోందంటూ కామెంట్ చేశారు. మంగళవారం వైట్ హౌస్ లో ట్రంప్ తో అర్జెంటినా ప్రెసిడెంట్ జేవియర్ మిలీ సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. బ్రిక్స్ దేశాలు యాంటీ అమెరికా పాలసీని అనుసరిస్తున్నాయని విమర్శించారు. ‘‘బ్రిక్స్ లో ఉండాలనుకునే దేశాలకు నేను ఒకటే చెప్పా. ఆ కూటమిలో ఉంటే మంచిదే. కానీ ఆ దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే వస్తువులపై అదనపు టారిఫ్ లు వేస్తాం” అని హెచ్చరించానని, అందుకే ఇప్పుడు ఆయా దేశాలు బ్రిక్స్ పేరును కూడా ఎత్తడం లేదని ట్రంప్ చెప్పారు.  డాలర్ విషయంలో తాను చాలా స్ట్రాంగ్​గా ఉన్నానని, డాలర్స్ లో వాణిజ్యం నిర్వహించేవారికి మిగతావారి కంటే అడ్వాంటేజ్ ఉంటుందన్నారు. 

అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచి ఉండకపోతే ప్రపంచంపై డాలర్ ఆధిపత్యం కనుమరుగయ్యేదన్నారు. బ్రిక్స్ దేశాలు డాలర్​కు ప్రత్యామ్నాయంగా కొత్త కరెన్సీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయనే ప్రచారం నేపథ్యంలో ట్రంప్ ఈమేరకు స్పందించారు. బ్రిక్స్ నుంచి కొత్త కరెన్సీ వస్తే.. డాలర్​పై తీవ్రమైన ప్రభావం పడుతుందని, అమెరికా ఆర్థిక ఆధిపత్యానికి గండి పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, డాలర్​కు ప్రత్యామ్నాయ కరెన్సీని తేవడంలో తమకు ఆసక్తిలేదని ఇండియా ఇదివరకే స్పష్టం చేసింది. 

బ్రిక్స్ నుంచి ఏ దేశమూ బయటకు రాలే.. 

బ్రిక్స్ కూటమిలోని ఇండియా, చైనా, రష్యా, బ్రెజిల్ వంటి దేశాలపై ట్రంప్ ఇటీవల టారిఫ్‎లు భారీగా విధించిన విషయం వాస్తవమే అయినా.. ఆ కూటమి నుంచి దేశాలు బయటకు వస్తున్నాయన్నది మాత్రం అబద్ధం కావడం గమనించదగ్గ విషయం. 2009లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలతో బ్రిక్స్ కూటమి ఏర్పాటైంది. 

2024లో ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ చేరాయి. ఈ ఏడాది ఇండోనేసియా చేరికతో బ్రిక్స్ దేశాల సంఖ్య 10కి పెరిగింది. ప్రస్తుతం మరో 10 దేశాలు పార్ట్​నర్ కంట్రీస్​గా,  మరో 2 దేశాలు అబ్జర్వర్ పార్ట్​నర్ కంట్రీస్​గా ఉన్నాయి. అయితే, బ్రిక్స్​లో చేరేందుకు అర్జెంటీనా 2022లో దరఖాస్తు చేసుకోగా, 2023లో కూటమి ఆమోదించింది. కానీ, జేవియర్ మిలీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రిక్స్ కూటమిలో అర్జెంటీనా చేరికను తిరస్కరించింది.