కరోనాపై ఇంటలిజెన్స్ రిపోర్ట్ ..మళ్లీ చైనాపై విమర్శలు

కరోనాపై ఇంటలిజెన్స్ రిపోర్ట్ ..మళ్లీ చైనాపై విమర్శలు

వాషింగ్టన్:  కరోనా వైరస్ సహజంగానే పుట్టిందని, దానిని మనుషులు తయారు చేయలేదని అమెరికా ‘నేషనల్ ఇంటెలిజెన్స్’ డిపార్ట్ మెంట్ తేల్చిచెప్పింది. మరోవైపు సొంత ఇంటెలిజెన్స్ అధికారులే రిపోర్ట్ ఇచ్చినా, ఆ దేశ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం మళ్లీ పాత పాటే పాడారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఊసెత్తకుండానే.. చైనాపై విచారణ కొనసాగుతోందని, ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన చెప్పారు. గురువారం వైట్ హౌజ్ వద్ద మీడియాతో ట్రంప్ మాట్లాడారు. కరోనా వైరస్ చైనా ల్యాబ్ నుంచే వచ్చిందా? అని విలేకరులు ప్రశ్నించగా, ‘అవును నేను అదే నమ్ముతున్నాను’ అని ట్రంప్ చెప్పారు. దీనిపై విచారణ కొనసాగుతోందని, ఆ వివరాలు త్వరలోనే వెల్లడవుతాయన్నారు. వైరస్ చైనా నుంచే వచ్చిందని, దానిని చైనా ఆపగలిగి ఉండేది కూడా అని ట్రంప్ అన్నారు. చైనాలో విపత్తు మొదలైందని తెలిసినా, ఆ దేశం నుంచి అమెరికా, యూరప్ దేశాలకు విమాన సర్వీసులను కొనసాగించడమే వైరస్ వ్యాప్తికి దారి తీసిందన్నారు. అయితే, కరోనా వైరస్ ను మనుషులు తయారు చేయలేదని అమెరికా ‘నేషనల్ ఇంటెలిజెన్స్’ డిపార్ట్ మెంట్ తేల్చినా, ఆ సంస్థ రిపోర్టును పట్టించుకోకుండా ట్రంప్ తన విమర్శలను కొనసాగించారు. ‘‘ఈ వైరస్ ను మనుషులు తయారు చేయలేదు. దీనిని జెనెటికల్ గా మాడిఫైడ్ చేయలేదు. ఇది సహజంగానే పుట్టిన వైరస్” అని పలు సైంటిఫిక్ రీసెర్చ్ లలో తేలిందని, తాము ఆ రీసెర్చ్ ఫలితాలను అంగీకరిస్తున్నామని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు తమ రిపోర్టులో పేర్కొన్నారు.

చైనా ఏజెంట్ గా డబ్ల్యూహెచ్ వో..

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) పైనా ట్రంప్ మరోసారి ఫైర్ అయ్యారు. డబ్ల్యూహెచ్ వో చైనాకు పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీగా మారిపోయిందని, అందుకు ఆ సంస్థ సిగ్గుపడాలని ట్రంప్ విమర్శించారు. ‘‘డబ్ల్యూహెచ్ వోకు అమెరికా ఏటా 50 కోట్ల డాలర్లు ఇస్తోంది. చైనా 3.8 కోట్ల డాలర్లే ఇస్తోంది. నిధులెన్ని ఇస్తున్నామన్నది పెద్ద విషయం కాదు. కానీ వేలాది మంది చావులకు కారణమైన విపత్తు విషయంలో వారు తప్పులు చేయకూడదు. ఈ విషయంలో వారు సిగ్గుపడాలి” అని ట్రంప్ మండిపడ్డారు. కరోనా విషయంలో డబ్ల్యూహెచ్ వో ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిందని విదేశాంగ మంత్రి మైక్ పాంపియో విమర్శించారు.

చైనాపై ట్యాక్సులు పెంచుతాం..

చైనా నిర్లక్ష్యం వల్లే కరోనా వైరస్ అమెరికాకు పాకి తీవ్ర నష్టం కలిగించిందని, అందుకే భారీ నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ట్రంప్ ఆ దేశంపై టారిఫ్ (ట్యాక్సులు)లు పెంచుతామని వెల్లడించారు. చైనా నుంచి పరిహారం రాబట్టడం కోసం ఆ దేశానికి చెల్లించాల్సిన బకాయిలను ఆపేస్తారా? అని విలేకరులు అడగగా, అది మొరటు ఆట (రఫ్​ గేమ్) అవుతుందని ట్రంప్ చెప్పారు. బకాయిలు ఆపితే అమెరికా కరెన్సీ విలువ పడిపోతుందని, అందుకే టారిఫ్ లు విధిస్తామన్నారు. అమెరికాతో పాటు జర్మనీ, బ్రిటన్, ఆస్ట్రేలియా కూడా చైనా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి.