టారిఫ్‌‌లతో 4 యుద్ధాలను ఆపిన.. మరోసారి చెప్పుకున్న అమెరికా ప్రెసిడెంట్‌‌ ట్రంప్‌‌

టారిఫ్‌‌లతో 4 యుద్ధాలను ఆపిన.. మరోసారి చెప్పుకున్న అమెరికా ప్రెసిడెంట్‌‌ ట్రంప్‌‌

వాషింగ్టన్: తాను రెండోసారి పదవిలోకి వచ్చాక ఏడు యుద్ధాలను ఆపానని అమెరికా ప్రెసిడెంట్‌‌‌‌ డొనాల్డ్‌‌‌‌ ట్రంప్‌‌‌‌ మరోసారి చెప్పారు. యుద్ధాలను ఆపేందుకే టారిఫ్‌‌‌‌లు విధిస్తున్నామని అన్నారు. తాము పన్నులు విధించి ఉండకపోతే ఆ ఏడింటిలో నాలుగు యుద్ధాలు ఇంకా కొనసాగుతూనే ఉండేవన్నారు. రోజుకు వేలాదిమంది చనిపోయేవారని కామెంట్‌‌‌‌ చేశారు. మంగళవారం ఆయన వాషింగ్టన్‌‌‌‌లోని ఓవల్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు.

నిజానికి టారిఫ్‌‌‌‌లు విధించడం అమెరికా ప్రయోజనాల కోసమే అయినప్పటికీ, అదే టారిఫ్‌‌‌‌ విధానం ప్రపంచంలో శాంతి నెలకొల్పడంలోనూ కీలకంగా పనిచేస్తోందన్నారు. యుద్ధాలను ఆపేందుకు ఒక పద్ధతిగా తాము టారిఫ్‌‌‌‌లు విధిస్తున్నామని చెప్పారు. ఆ పన్నుల విధానాన్ని ఉపయోగించి ఇండియా, పాకిస్తాన్‌‌‌‌ మధ్య యుద్ధాన్ని ఆపానని చెప్పుకొచ్చారు. న్యూక్లియర్‌‌‌‌‌‌‌‌ వెపన్లు ఉన్న ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఆగడంలో తాము విధించిన సుంకాలే కీలకంగా పనిచేశాయన్నారు. 

శాంతిదూతలా పనిచేస్తున్నం
భారత్‌‌‌‌, పాక్‌‌‌‌తోపాటు కంబోడియా–థాయిలాండ్‌‌‌‌, కొసావో–సెర్బియా, కాంగో–రువాండో, ఇజ్రాయెల్‌‌‌‌–ఇరాన్‌‌‌‌, ఈజిప్ట్‌‌‌‌ –ఇథియోపియా, అర్మేనియా–అజర్‌‌‌‌‌‌‌‌బైజాన్‌‌‌‌ దేశాల మధ్య యుద్ధాలను ఆపానని ట్రంప్‌‌‌‌ చెప్పారు. వీటిలో 4 యుద్ధాలు తాను పాటిస్తున్న వాణిజ్య విధానం, విధించిన టారిఫ్‌‌‌‌ల కారణంగానే నిలిచిపోయాయని చెప్పారు. ‘‘పన్నులు విధించి వందల బిలియన్‌‌‌‌ డాలర్లు సంపాదించడమే కాకుండా, ప్రపంచంలో శాంతిని నెలకొల్పుతున్నాం. టారిఫ్‌‌‌‌లు వేయడం ద్వారా యుద్ధాలను నిలిపివేశాం. అమెరికా ప్రపంచ శాంతిదూతగా పనిచేస్తోంది” అని ట్రంప్‌‌‌‌ అన్నారు.