
వాషింగ్టన్: అమెరికాలో ప్రభుత్వ షట్ డౌన్ నేపథ్యంలో సైనికులతో సహా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థితి లేదు. మిగతా ఉద్యోగులను ప్రభుత్వం అన్ పెయిడ్ లీవ్‌పై పంపింది. సైన్యం, పోలీసులు సహా అత్యవసర సిబ్బంది మాత్రం జీతాల్లేకుండానే విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. భద్రతా బలగాలకు ఎలాగోలా జీతాలు అందించాలని డిఫెన్స్ డిపార్ట్ మెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు.
ఇందుకోసం అందుబాటులోని నిధులన్నీ వాడాలని సూచించారు. ఈ నెల 15 లోపు బలగాల ఖాతాల్లో వారి జీతాలు జమకావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ తన ట్రూత్ సోషల్‌లో ఆయన పోస్టు చేశారు. ‘‘మన ధైర్యవంతులైన బలగాలకు ఈ నెల 15 లోపు జీతాలు చెల్లించాల్సి ఉంది. లేకపోతే వారు తమ పేచెక్స్ను మిస్ అవుతారు. బలగాలకు జీతాలు చెల్లించాలని డిఫెన్స్ మంత్రి పీట్ హెగ్ సేత్‌కు కమాండర్ ఇన్ చీఫ్‌గా నేను ఆదేశిస్తున్నాను. కమాండర్ ఇన్ చీఫ్‌గా నాకు ఆ అధికారం ఉంది” అని ట్రంప్ పేర్కొన్నారు.
బలగాలకు జీతాలు చెల్లించడానికి నిధులు ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే, బలగాలకు జీతాలు చెల్లించడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందన్న విషయాన్ని ట్రంప్ వెల్లడించలేదు. రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ నిధులను వాడవచ్చని వైట్ హౌస్ ఆఫీస్ మేనేజ్ మెంట్ అండ్ బడ్జెట్ అధికారి ఒకరు తెలిపారు.
కాగా.. ఈ నెల 1 నుంచి అమెరికా షట్ డౌన్ కొనసాగుతోంది. కొన్నివేల మంది ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వం తొలగిస్తోంది. ఉద్యోగుల తొలగింపు (లేఆఫ్స్) ప్రక్రియను వైట్ హౌస్ బడ్జెట్ ఆఫీసు ఈ నెల 10న ప్రారంభించింది. ఈ నెల 1న షట్ డౌన్ ప్రారంభం కావడంతో ఈ నెల 15 లోపు తమకు ఎక్కడ జీతాలు రావోనని యూఎస్ సర్వీస్ మెంబర్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన ప్రకటనతో వారికి ఊరట కలిగినట్లయింది. ప్రస్తుతం అమెరికాలో 13 లక్షల సర్వీస్ మెంబర్లు ఉన్నారు.