సులేమానీని అందుకే హతమార్చాం : ట్రంప్

సులేమానీని అందుకే హతమార్చాం : ట్రంప్

ఇరాన్ పై దాడి చేసిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  ట్రంప్ మాట్లాడుతూ సులేమానీ అనేక మంది అమెరికన్ల ప్రాణాలు తీసినట్లు తెలిపారు. అమెరికాపై మళ్లీ దాడి చేసేందుకు సులేమానీ ప్రయత్నించాడని, అందుకే అతన్ని చంపినట్లు చెప్పారు.  పశ్చిమాశియాలో ఉద్రిక్తతలకు ఇరానే  కారణమని అన్నారు. తాను ప్రెసిడెంట్ గా ఉన్నంతకాలం ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయలేదని హెచ్చరించారు. ఉగ్రవాదానికి ఇరాన్ అతిపెద్ద స్పాన్సర్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరాన్ పై దాడిలో ఏ ఒక్క అమెరికన్ కూడా గాయపడలేదన్న ట్రంప్.. ఇరాన్ పై యుద్ధం చేసేందుకు తాము సుముఖంగా లేమన్నారు. ఇరాన్ విషయంలో తాము శాంతి యుతంగా ఉన్నట్లు తెలిపిన ట్రంప్…ఒకవేళ ఇరాన్ దాడులకు దిగితే ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. గత వారం అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదులను మట్టుబెట్టామని చెప్పారు. సులేమానీని మట్టుబెట్టడంలో ఇప్పటికే ఆలస్యం చేశామని తెలిపారు. మిడిల్ ఈస్ట్ చమురు తమకు అవసరం లేదని ప్రకటించారు ట్రంప్.