ఇండియాపై మరో 25 శాతం టారిఫ్లు..మొత్తం 50 శాతానికి చేరిన సుంకాలు

ఇండియాపై మరో 25 శాతం టారిఫ్లు..మొత్తం 50 శాతానికి చేరిన సుంకాలు
  • ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ 
  • మొత్తం 50 శాతానికి చేరిన సుంకాలు 
  • నేటి నుంచి 25% .. 27 నుంచి అదనపు 25%  సుంకాలు అమలులోకి 
  • రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును సాకుగా చూపిన అమెరికా అధ్యక్షుడు
  • ఇండియాపైనే అక్కసు.. చైనా, తుర్కియే, ఇతర దేశాలకు మాత్రం మినహాయింపు

వాషింగ్టన్/న్యూఢిల్లీ: ఇండియాపై టారిఫ్​లను మరో 25% పెంచుతున్నట్టు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో అమెరికాకు ఎగుమతి అయ్యే ఇండియన్ వస్తువులపై సుంకాలు మొత్తం 50 శాతానికి చేరాయి. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపనందుకుగాను ఇండియన్ వస్తువులపై ఇదివరకే 25 శాతం టారిఫ్ లు ప్రకటించిన ట్రంప్.. ఇరవై నాలుగు గంటల్లో అదనంగా మరో 25 శాతం పెంచుతామని మంగళవారం ప్రకటించారు. బుధవారం అదనపు టారిఫ్ లను పెంచుతూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసినట్టు వెల్లడించారు. ట్రంప్ ఇదివరకే ప్రకటించిన 25% టారిఫ్ లు ఈ నెల 7 నుంచి అమలులోకి వస్తుండగా.. అదనంగా ప్రకటించిన 25 శాతం టారిఫ్ లు 21 రోజుల తర్వాత లేదా ఆగస్ట్ 27 నుంచి అమలులోకి రానున్నాయి. 

రష్యన్ ఫెడరేషన్ ప్రభుత్వం నుంచి పొంచి ఉన్న ముప్పులను తొలగించుకోవడంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో పేర్కొన్నారు. ‘‘ఇండియా నుంచి ఇంపోర్ట్ అవుతున్న ఆయా వస్తువులపై ఇదివరకే ఉన్న డ్యూటీలు, ఫీజులు, ట్యాక్స్ లు, చార్జీలకు అదనంగా మరో 25 శాతం సుంకాలు వర్తిస్తాయి” అని అందులో తెలిపారు. ‘‘భారత ప్రభుత్వం డైరెక్ట్ గా లేదా ఇన్ డైరెక్ట్ గా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. అందుకే అమెరికాలోకి దిగుమతి అయ్యే ఇండియన్ వస్తువులపై అదనపు సుంకాలను విధించాలని నిర్ణయించాను. ఆయా దేశాలకు క్రూడ్ ఆయిల్, ఇతర ఎగుమతుల ద్వారా సంపాదిస్తున్న డబ్బును ఉక్రెయిన్ పై యుద్ధానికి రష్యా వినియోగిస్తోంది. అందుకే రష్యాతో బిజినెస్ చేస్తున్న ఇతర దేశాలపై కూడా టారిఫ్ లు పెంచుతాం” అని ట్రంప్ స్పష్టం చేశారు. అలాగే ఆగస్ట్ 9లోగా ఉక్రెయిన్ తో రష్యా శాంతి ఒప్పందం కుదుర్చుకోకపోతే 100 శాతం టారిఫ్ లు కూడా విధిస్తామని ట్రంప్ ఇదివరకే హెచ్చరించారు.

ఇండియాపైనే అక్కసు..

రష్యా నుంచి చైనా, తుర్కియే కూడా ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నా.. ఆ దేశాలపై ట్రంప్ ఎలాంటి పెనాల్టీ ప్రకటించలేదు. చైనాపై ప్రస్తుతం 30 శాతం, తుర్కియేపై 15 శాతం టారిఫ్ లు ఉన్నాయి. కానీ ఇండియాకు మాత్రమే బ్రెజిల్ తో సమానంగా ఏకంగా 50 శాతం టారిఫ్ లను ప్రకటించారు. మరోవైపు పొరుగుదేశం పాకిస్తాన్​పై 29 శాతంగా ఉన్న టారిఫ్ లను 19 శాతానికి తగ్గించి ఇదివరకే ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు.

అన్యాయం, అసంబద్ధం, అహేతుకం: కేంద్రం 

ఇండియన్ వస్తువులపై ట్రంప్ మరో 25 శాతం అదనపు టారిఫ్​లను ప్రకటించడం ‘అన్యాయం, అసంబద్ధం, అహేతుకం’ అని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. బుధవారం ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే భారత్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది. ‘‘రష్యా నుంచి మా దిగుమతులు మార్కెట్ లో అనుకూల అంశాల ఆధారంగా, 140 కోట్ల మంది భారతీయుల ఇంధన భద్రత కోసమే తీసుకున్న నిర్ణయమని మేం ఇదివరకే తేల్చిచెప్పాం. భారత్ ఒక్కటే కాకుండా మిగతా దేశాలు కూడా తమ జాతీయ ప్రయోజనాల కోసం ఇలాంటి నిర్ణయాలే తీసుకున్నాయి. కానీ కేవలం ఇండియాపైనే టారిఫ్ లను పెంచాలని నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరం” అని కేంద్రం పేర్కొంది. 

పుతిన్​తో అమెరికా  దౌత్యవేత్త భేటీ తర్వాత.. 

అమెరికా ప్రత్యేక దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్ బుధవారం ఉదయం రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్​తో భేటీ అయిన కాసేపటికే ఇండియాపై టారిఫ్​లు పెంచుతున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే అంశంపై చర్చించేందుకు విట్కాఫ్ మాస్కోకు వచ్చారు. ముందుగా రష్యా ఫారిన్ పాలసీ అధికారి యూరీ ఉషకోవ్​తో భేటీ అయిన విట్కాఫ్.. ఆ తర్వాత పుతిన్​తోనూ చర్చించారు. తర్వాత మధ్యాహ్నం అమెరికాకు బయలుదేరారు. యుద్ధాన్ని ముగించే విషయంలో పుతిన్​తో చర్చలు జరిపాకే టారిఫ్​ల విషయంపై ట్రంప్ ప్రకటన ఉంటుందని భావించారు. కానీ విట్కాఫ్ బయలుదేరగానే టారిఫ్​లు ట్రంప్ ప్రకటన చేయడంతో.. పుతిన్​తో భేటీలో ఏం జరిగిందనే సందేహాలు మొదలయ్యాయి.