మూడు దశల్లో లాక్ డౌన్ ఎత్తేస్తాం

మూడు దశల్లో లాక్ డౌన్ ఎత్తేస్తాం
  • గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్

వాషింగ్టన్: కరోనా వల్ల దెబ్బతిన్న తమ దేశ ఎకానమీని రీఓపెన్ చేసేందుకు మూడు ఫేజ్ లలో లాక్ డౌన్ ఎత్తివేస్తామని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. ఈ మేరకు 18 పేజీల గైడ్ లైన్స్ ను ఆయన రిలీజ్ చేశారు. రాష్ట్రాల్లో క్రమంగా లాక్ డౌన్ ఎత్తివేత నిర్ణయాన్ని గవర్నర్ల కే వదిలేసినట్లు చెప్పారు. 52 లక్షల మంది వర్కర్లకు నిరుద్యోగ ప్రయోజనాలను అందిస్తామని లేబర్ డిపార్ట్ మెంట్ చెప్పిన మరుసటి రోజే ట్రంప్ ఈ ప్రకటన చేశారు. కొత్త కేసులు, టెస్టింగ్ సామర్థ్యం, అందుబాటులో ఉన్న హాస్పిటల్స్ ను క్రైటీరియాగా తీసుకుని మెడికల్ ఎక్స్ పర్ట్స్ 18 పేజీల గైడ్ లైన్స్ ను రూపొందించారు. వైట్ హౌస్ లో మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ.. “అమెరికా ఎకానమీ రీఓపెన్ అవుతుంది. దీర్ఘకాలం లాక్ డౌన్ పరిష్కారం కాదు. కొంత మంది సైంటిస్టులు చెబుతున్నట్లు వైరస్ మళ్లీ వస్తే.. త్వరగానే దాని నుంచి బయటపడేలా గైడ్ లైన్స్ ఉన్నాయి. కరోనాపై యుద్ధం కోసం లాక్ డౌన్ ప్రకటించాం. ఇప్పుడు ఆ యుద్ధం గెలిచే ప్రక్రియలో ఉన్నాం. మూడు ఫేజ్ లలో ఎకానమీని రీఓపెన్ చేస్తాం. అన్నీ ఒకేసారి ఓపెన్ చేయం. జాగ్రత్తగా చర్యలు తీసుకుంటాం” అని అన్నారు.

ఫేజ్ ల వారీగా ఇలా..

“ఫస్ట్ ఫేజ్ లో వరుసగా 14 రోజుల్లో కరోనా కేసులు తగ్గితేనే లాక్ డౌన్ ఎత్తివేయాలి. పరిస్థితిని బట్టి మిగతా రిస్ట్రిక్షన్స్ ను కూడా తొలగించాలి. రెండో ఫేజ్ లో కరోనా ముప్పు ఉన్నవారందర్నీ ఇంటికే పరిమితం చేయాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ ను ప్రోత్సహించాలి. సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ఉద్యోగుల ప్రయాణానికి అనుమతించవచ్చు. ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ బేసిస్ పై కొన్ని సర్జరీలు అనుమతించవచ్చు. మూడో ఫేజ్ లో ఆంక్షలు పూర్తిగా తొలగించాలి. పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సోషల్ డిస్టెన్స్ పాటించాలి” అని వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్ మెంబర్ డెబోరా బ్రిక్స్ వివరించారు.