ట్రంప్ పీస్ ప్లాన్కు ఓకే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకారం

ట్రంప్ పీస్ ప్లాన్కు ఓకే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకారం
  • వైట్​హౌస్​లో ట్రంప్​తో సుదీర్ఘ చర్చ
  • హమాస్​తో మాకు ఎప్పటికీ ముప్పు ఉండొద్దు: నెతన్యాహు
  • ప్రతిపాదనకు హమాస్ ఒప్పుకోవాల్సిందే: ట్రంప్​
  • 3 నుంచి 4 రోజులు డెడ్​లైన్

వాషింగ్టన్: గాజాలో శాంతి స్థాపనే లక్ష్యంగా అమెరికా చేసిన ప్రతిపాదనకు.. ఇజ్రాయెల్‌‌ అంగీకరించింది. మొత్తం 20 ప్రపోజల్​పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వైట్​హౌస్​లో సుదీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు పీస్ ప్లాన్ ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్లు ఇరు దేశాల అధినేతలు సంయుక్తంగా ప్రకటించారు. హమాస్ చేతిలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడం, గాజాకు పూర్తి సహాయం, హమాస్ సైనిక సామర్థ్యాలు దెబ్బతీయడం వంటి కీలక అంశాలు యూఎస్ పీస్ ప్లాన్ ప్రపోజల్స్​లో ఉన్నాయి. అయితే, ఈ ప్రతిపాదనలకు హమాస్‌‌ గ్రూప్‌‌ అంగీకరిస్తుందో.. లేదో.. అని ఇరువురు నేతలు అనుమానం వ్యక్తం చేశారు.

మా వాళ్లను వెంటనే రిలీజ్ చేయాలి: నెతన్యాహు

ట్రంప్, నెతన్యాహూ ఇద్దరూ ఈ ప్లాన్‌‌ను ‘హిస్టారిక్ డే ఫర్ పీస్’గా పిలిచారు. వైట్​హౌస్​లో జరిగిన ఈ భేటీలో సుమారు 2 గంటలకు పైగా చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఇరువురు నేతలు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. గాజాలో యుద్ధాన్ని ముగించడంతో పాటు పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పే దిశగా అడుగులు వేయాలని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. శాంతి కోసం అమెరికా ప్రతిపాదనలకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. హమాస్‌‌ నుంచి మళ్లీ ఇజ్రాయెల్‌‌కు ఎలాంటి ముప్పు ఉండొద్దని స్పష్టం చేశారు. డీల్​కు ఒప్పుకుంటే 72 గంటల్లోనే హమాస్ వద్ద ఉన్న తమ బంధీలను వెంటనే రిలీజ్ చేసేలా చూడాలని తెలిపారు. గాజా నుంచి తమ బలగాలను దశలవారీగా ఉపసంహరించుకుంటామన్నారు. హమాస్‌‌ ఆయుధాలను వదిలేయాలని కోరారు. 

ఒప్పుకోకపోతే తుడిచిపెట్టేస్తం: ట్రంప్

శాంతి ప్రతిపాదనకు హమాస్ ఒప్పుకోవాల్సిందే అని ట్రంప్ హెచ్చరించారు. లేకపోతే హమాస్​ను నామరూపాల్లేకుండా చేసేందుకు ఇజ్రాయెల్‌‌కు తాను పూర్తి మద్దతు ఇస్తానని స్పష్టంచేశారు. ఇదే ఫైనల్ వార్నింగ్ అని.. ఆ తర్వాత చర్చలు ఉండవని తేల్చి చెప్పారు. 3 నుంచి 4 రోజుల్లో స్పష్టత ఇవ్వాలని అల్టిమేటం జారీ చేశారు. కాగా, పీస్ ప్లాన్​కు హమాస్ అంగీకరిస్తే.. యుద్ధ విరమణ వెంటనే అమల్లోకి వస్తుంది. హమాస్ సభ్యులకు క్షమాభిక్ష దక్కడంతో పాటు భద్రత నడుమ ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కల్పిస్తారు. గాజాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటునకు బోర్డ్ ఆఫ్ పీస్​ను ఏర్పాటు చేస్తారు. గాజా పునర్నిర్మాణం కోసం అంతర్జాతీయ సహాయానికి ఇజ్రాయెల్ విన్నవిస్తుంది.

ప్రపోజల్​పై ఖతార్​లో హమాస్ చర్చలు

ట్రంప్‌‌, నెతన్యాహు ప్రకటించిన శాంతి ఒప్పందానికి ఇండియా, సౌదీ, ఈజిప్ట్‌‌ సహా మొత్తం 8 ముస్లిం దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, యూరప్‌‌ దేశాధినేతలు మాక్రాన్‌‌, స్టార్మర్‌‌ ఈ ప్రణాళికకు మద్దతు ప్రకటించారు. పీఎస్ ప్లాన్​  ప్రపోజల్​​ను స్వాగతిస్తున్నట్లు పాలస్తీనా వెల్లడించింది. యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ తీసుకుంటున్న చొరవపై ప్రశంసలు కురిపించింది. అయితే, హమాస్ మాత్రం ఇంకా అంగీకరించలేదు. ట్రంప్ ప్రతిపాదించిన పీఎస్ ప్లాన్.. రాతపూర్వకంగా తమకు అందలేదని హమాస్ అధికారి మహ్మౌద్ మర్దావీ తెలిపారు.

పాకిస్తాన్​ ప్రధాని, ఆర్మీ చీఫ్​పై ట్రంప్ ప్రశంసలు

గాజా పీస్ ప్లాన్​కు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మద్దతు తెలపడం తో ట్రంప్ వాళ్లను ప్రశంసించారు. పీస్ ప్లాన్​పై ట్రంప్ వైట్​హౌస్​లో బ్రీఫింగ్ ఇచ్చారు. ‘‘ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు పాకిస్తాన్ కూడా తనవంతు సహకారం అందిస్తున్నది. ముందు నుంచే నా 20 ప్రతిపాదనలకు మద్దతు ఇస్తున్నది. షెహబాజ్ షరీఫ్, మునీర్ నా వెంటే ఉన్నారు. అరబ్, ముస్లిం దేశాలు కూడా మద్దతు ప్రకటించాయి. వారందరికీ ధన్యవాదాలు’’ అని ట్రంప్ అన్నారు.