
- 5వ తేదీ సాయంత్రం 6 గంటలలోగా అంగీకరించాలి
- లేదంటే హమాస్ ఫైటర్లను వేటాడతామని హెచ్చరిక
- గాజాలో శాంతికి 20 పాయింట్ల ప్రపోజల్
- ఇదివరకే ఓకే చెప్పిన ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు
వాషింగ్టన్ డీసీ: శాంతి ఒప్పందానికి ఒప్పుకోకపోతే నరకం తప్పదని పాలస్తీనియన్ టెర్రరిస్ట్ సంస్థ హమాస్ కు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అమెరికా టైం ప్రకారం.. 5వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు శాంతి ఒప్పందానికి అంగీకరించాలని, లేకపోతే హమాస్ ఫైటర్లను వేటాడతామని హెచ్చరించారు. ట్రంప్ ఈ మేరకు శుక్రవారం తన ట్రూత్ షోషల్ వేదికగా పోస్ట్ పెట్టారు.
హమాస్ కు ఇదే లాస్ట్ చాన్స్ అని, ఇజ్రాయెలీ బందీలందరినీ విడిచిపెట్టి, ఆయుధాలను వదిలేస్తే గాజాలో శాంతి నెలకొంటుందని, లేకపోతే మరో రకంగా ఉంటుందన్నారు. ‘‘మిడిల్ ఈస్ట్ లో చాలా ఏండ్లుగా హమాస్ క్రూరమైన, హింసాత్మకమైన ముప్పుగా పరిణమించింది. వాళ్లు అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్ లోకి చొరబడి పిల్లలు, మహిళలు, వృద్ధులు అన్న తేడా లేకుండా అతి కిరాతకంగా ఊచకోతకు పాల్పడ్డారు.
దీనికి బదులుగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 25 వేలకుపైగా హమాస్ ఫైటర్లు హతమయ్యారు. మిగతా వాళ్లలోనూ చాలా మందిని ఇప్పుడు బలగాలు చుట్టుముట్టి ఉన్నాయి. నేను ఒక్కమాట చెప్తే చాలు.. వాళ్లందరినీ మట్టుబెట్టేందుకు బలగాలు వెయిట్ చేస్తున్నాయి. అమాయక పాలస్తీనియన్లంతా ఆ ప్లేస్ నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి” అని ట్రంప్ పేర్కొన్నారు.
20 పాయింట్లతో ట్రంప్ పీస్ డీల్..
గాజా, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందానికి ట్రంప్ 20 పాయింట్లతో పీస్ డీల్ ను ప్రతిపాదించారు. ‘‘ఇరుపక్షాలు అంగీకరించిన వెంటనే గాజాలో కాల్పులు ఆగుతాయి. ఇజ్రాయెలీ బందీలందరినీ, చనిపోయినవాళ్ల డెడ్ బాడీలతో సహా హమాస్ అప్పగించాలి. అందుకు బదులుగా ఇజ్రాయెల్ పాలస్తీనియన్ ఖైదీలను విడిచిపెడుతుంది.
దశలవారీగా ఇజ్రాయెల్ బలగాలు వెనుదిరుగుతాయి. అనంతరం గాజాలో పాలనను పర్యవేక్షించేందుకు ట్రంప్ అధ్యక్షతన శాంతి మండలి ఏర్పాటవుతుంది. ఇందులో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ వంటి ప్రముఖులు ఉంటారు. గాజా ప్రజలకు మానవతా సాయంతోపాటు ఆ ప్రాంత పునర్నిర్మాణం కోసమూ శాంతి మండలి పని చేస్తుంది” అని ప్రపోజల్స్ లో పేర్కొన్నారు. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే ఓకే చెప్పారు. ట్రంప్ డీల్‌ను పరిశీలిస్తున్నామని హమాస్ బుధవారం వెల్లడించింది.