New US Map: అమెరికాలో భాగమైన కెనడా, వెనిజులా, గ్రీన్ లాండ్.. కొత్త మ్యాప్ షేర్ చేసిన ట్రంప్

New US Map: అమెరికాలో భాగమైన కెనడా, వెనిజులా, గ్రీన్ లాండ్.. కొత్త మ్యాప్ షేర్ చేసిన ట్రంప్

Trump’s New US Map: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా ట్రూత్ సోషల్ వేదికగా షేర్ చేసిన అమెరికా కొత్త మ్యాప్‌లో కెనడా, వెనిజులా, గ్రీన్ లాండ్‌లను అమెరికా భూభాగాలుగా చూపించడం అంతర్జాతీయ సమాజంలో చర్చనీయాంశమైంది. ఈ ఏఐ -జనరేటెడ్ మ్యాప్‌లో ఈ మూడు ప్రాంతాలను అమెరికాలో భాగంగా చిత్రీకరించిన ట్రంప్.. గ్రీన్ లాండ్‌ను "యూఎస్ టెరిటరీ ఎస్టాబ్లిష్డ్ 2026" అని ప్రకటించడం సంచలనంగా మారింది. వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోలతో కలిసి గ్రీన్ లాండ్‌లో అమెరికా జెండా పాతిన ఫొటోలను కూడా ట్రంప్ పోస్ట్ చేయటం సంచలనంగా మారింది.

గత ఏడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేర్చుకోవాలని ప్రతిపాదిస్తున్నారు. దీనిని కెనడా ప్రభుత్వం తీవ్రంగా తిరస్కరించడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. అలాగే మరోవైపు.. వెనిజులా విషయంలో ట్రంప్ మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల అమెరికా దళాలు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి న్యూయార్క్ తీసుకెళ్లిన నేపథ్యంలో.. క్రూడ్ ఆయిల్ నిల్వలపై అమెరికా కంపెనీలు నియంత్రణ కలిగి ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. వెనిజులాను ఇకపై అమెరికానే నడిపిస్తుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ సార్వభౌమాధికారంపై నేరుగా చేసిన దాడిగా భావిస్తున్నారు. డబ్బు సెటిల్మెంట్లు కూడా తామే చూసుకుంటాం అంటూ చేసిన కామెంట్స్ తర్వాత తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

గ్రీన్ లాండ్ విషయంలో ట్రంప్ వైఖరి మరింత విచిత్రంగా ఉంది. ఖనిజ సంపద కలిగిన ఈ ద్వీపం అమెరికా జాతీయ భద్రతకు కీలకమని వాదిస్తున్నారు ట్రంప్. తనను నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేయకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేసిన ట్రంప్.. ఇకపై తాను కేవలం "శాంతి" గురించి మాత్రమే ఆలోచించాల్సిన అవసరం లేదని నార్వే ప్రధానికి పంపిన సందేశంలో పేర్కొన్నారు. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్ లాండ్‌పై తనకు పూర్తి నియంత్రణ కావాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తున్న యూరోపియన్ మిత్రదేశాలపై భారీ టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించడంతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ట్రంప్ చేస్తున్న ఈ దూకుడు చర్యలు ప్రపంచ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.