
భారతదేశంలో జరిగే పెద్ద పండుగల్లో దేవీ నవరాత్రులు ఒకటి. ఈ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండుగ రోజుల్లో చాలామంది ఉపవాసం పాటిస్తారు. ఒక్కో రాష్ట్రంలో, ఒక్కో ప్రాంతంలో తమ ఆచారాలకు అనుగుణంగా భక్తులు ఉపవాసం ఉంటూ దుర్గాదేవికి మొక్కులు చెల్లించుకుంటారు. నాన్ వెజ్ వంటకాలకు దూరంగా ఉంటూ శుచి, శుభ్రతను పాటిస్తూ 9 రోజుల పాటు అమ్మవారి సేవలో గడుపుతారు. నవరాత్రుల్లో చాలామంది తాజా కూరగాయలు, పండ్లు, పాలు, డ్రై ప్రూట్స్ వంటి వాటిని ఆహారంగా తీసుకుంటారు. పలు రాష్ట్రాల్లో నవరాత్రుల సందర్భంగా సబుదానా ఖిచ్డీ, ఫ్రూట్ చాట్, ఖీర్, కుట్టు కి పూరీ వంటి రుచికరమైన వంటకాలను వండుకుని ఎంతో ఇష్టంగా తింటారు. 9 రోజుల పాటు ఉపవాసం ఉంటూ అమ్మవారి సేవలో తరించేవారు..ఈ వంటకాలను ఓ సారి ట్రై చేసి చూడండి. ఆరోగ్యంతో పాటు రుచికరంగానూ ఉంటాయి.
1. సబుదానా ఖిచ్డీ
ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది బలహీనంగా ఉంటున్నారు. వీటికి కారణాలు అనేకం కావొచ్చు. జీన్స్, ఒత్తిడి, హర్మో్న్స్ ఇన్ బ్యాలెన్స్, ఫుడ్ స్టైల్... ఇలా రకరకాలుగా కారణాలు చెప్పొచ్చు. ఈ నవరాత్రుల్లో సబుదానాను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సబుదానా ఖిచ్డీలో ప్రోటీన్స్, ఫైబర్ అధికంగా ఉంటుంది. అంతేకాదు.. త్వరగా జీర్ణక్రియ కావడానికి దోహదపడుతుంది. సబుదానా ఖిచ్డీకి నానబెట్టిన సాబుదానా, బంగాళాదుంపలు, నెయ్యి, తురిమిన కొబ్బరి, పచ్చిమిర్చి, వేయించిన వేరుశెనగ, కొద్దిగా కొత్తిమీరను అవసరం ఉంటుంది. ఎక్కువ కార్బోహైడ్రేట్లతో నిండిన ఈ వంటకాన్ని ఉపవాసం ఉండేవారు తినడం వల్ల వారికి ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. శక్తి కూడా వస్తుంది. అలాగే.. సబుదానా ఖీర్, సబుదానా వడ కూడా ఉపవాస చిరుతిండిగా పని చేస్తాయి.
2. సమక్ కి టిక్కీ
సబుదానాతో పాటు, మిల్లెట్ అని పిలువబడే సమక్ కే చావల్ ఉపవాస రోజుల్లో చాలా మంది ఉపయోగిస్తారు. ఈ పదార్ధంతో వంటకాలను తయారు చేయడం చాలా ఈజీ.
సమక్ కి టిక్కీ తయారీకి జీలకర్ర, పచ్చిమిర్చి, కడిగిన సమక్ కే చావల్, ప్రెషర్ కుక్కర్‌లో నీరు పోసి టిక్కీని తయారు చేస్తారు. ఒక విజిల్ తర్వాత, కుక్కర్‌ను వేడి నుండి తీసివేసి, చల్లారనివ్వాలి. రైస్ లో బంగాళదుంప, పచ్చిమిర్చి, వేయించిన వేరుశెనగ, కొత్తిమీర కలపాలి. ఆ తర్వాత కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. టిక్కీలు గోల్డ్ కలర్ లోకి వచ్చే వరకు వేయించాలి. పుదీనా-పెరుగు డిప్‌తో వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఆ రుచే వేరుగా ఉంటుంది.
3. మిల్లెట్ ఉతప్పం
కొర్రలు, ఊదలు, అండు కొర్రలు, రాగులు, సామలు, అరికలు, వరిగలు వంటి ఏదైనా మిల్లెట్స్ తో ఉతప్పం తయారు చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది.
4. సామా ఇడ్లీ
మినప పప్పు, సామలను విడివిడిగా నానబెట్టి రుబ్బాలి. మొత్తటి పిండి మాదిరిగా చేసుకున్న తర్వాత రెండింటిని కలపాలి. 8 గంటల పాటు పులియనీయాలి. ఆ తర్వాత ఇడ్లీ పాత్రల్లో పిండి వేసి ఉడికించాలి. పల్లీ చట్నీ, లేదా కారంపొడి, నెయ్యితో వేడివేడిగా తింటే ఆ రుచే వేరు. తిన్నాకొద్దీ మరిన్ని సామా ఇడ్లీలు తినాలపిస్తుంది.
5. కుట్టు దోస
సౌత్ ఇండియాలో అల్పహారంగా తీసుకునే ఆహారపదార్థాలలో దోశ ఒకటి. తేలికపాటి.. రుచికరమైన అల్పహారం ఇది. పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టపడుతుంటారు. కుట్టు దోస కోసం.. నెయ్యి, ఉడకబెట్టిన బంగాళాదుంపలు, రుచికి తగినంత ఉప్పు, అర టీస్పూన్ కారం, అర టీ స్పూన్ తరిగిన అల్లం అవసరం. కుట్టు దోసెలను పుదీనా, కొబ్బరి పచ్చడి, టొమాటో చట్నీతో తింటే మైమరచిపోతారంటే నమ్మండి.
6. వ్రత్వాలే ధోక్లా
ఉపవాస రోజులలో మిల్లేట్స్ తో తేలికపాటి ధోక్లా వంటకాన్ని రుచి చూడండి. ఆరోగ్యంతో పాటు తేలికగా ఉంటుంది.
7. మఖానా ఖీర్
ఈ పండుగ సమయంలో మఖానా ఖీర్ తయారు చేసుకుని తింటే ఎక్కువ ఆకలి కాకుండాఉంటుంది. ఉపవాసంలో ఉండే వారికి శక్తిని ఇస్తుంది. ఈ ఫుడ్ లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో బాగా ఉపకరిస్తుంది.
ఈ నవరాత్రుల్లో చాలామంది కేవలం పండ్లు మాత్రమే తీసుకుని ఉపవాసాలు చేస్తుంటారు. దీనికి అనువుగా ఈ తొమ్మిది రోజులూ నీరసం లేకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రోటీన్ రిచ్ డైట్ ని ఫ్లాన్ చేసుకోండి.ఉపవాసం సమయంలో బలహీనత లేకుండా ఉండేందుకు తప్పనిసరిగా 7 రకాల మిల్లెట్స్ ఆహారాలు తీసుకోండి.