వర్షం కారణంగా ఎప్​సెట్​ ఎగ్జామ్ ఆలస్యం.. పేరెంట్స్ ఆందోళన

వర్షం కారణంగా ఎప్​సెట్​ ఎగ్జామ్ ఆలస్యం.. పేరెంట్స్  ఆందోళన

తిమ్మాపూర్, వెలుగు: ఈదురు గాలులు, వర్షం కారణంగా విద్యుత్​ సరఫరాలో అంతరాయం కలగడంతో ఎప్​సెట్​ ఆలస్యం కావడంతో  విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్  మండలం రామకృష్ణ కాలనీలోని వాగేశ్వరి అయాన్  డిజిటల్  జోన్ లో అగ్రికల్చర్, ఫార్మసీల్లో అడ్మిషన్​ కోసం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహించాల్సి ఉంది. 

వర్షం, ఈదురు గాలులు, పిడుగు పడడంతో కరెంట్​ సప్లై నిలిచిపోయింది. దీంతో విద్యార్థులకు గంటన్నర పాటు వెసులుబాటు కేటాయించారు. కాగా, తమ పిల్లలు ఇంకా ఎగ్జామ్​ సెంటర్​ నుంచి బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై ఎగ్జామ్​ సెంటర్​ వద్దకు తరలివచ్చారు. ఎగ్జామ్​ సెంటర్​లోకి తమను అనుమతించాలని ఆందోళనకు దిగడంతో నిర్వాహకులు నిరాకరించారు. దీంతో ఆగ్రహంతో కాలేజీ ముందు రాజీవ్  రహదారిపై రాస్తారోకో చేశారు. 

ట్రాఫిక్  జామ్​ కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తల్లిదండ్రులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. రాత్రి 7.30కు స్టూడెంట్స్​ ఎగ్జామ్​ రాసి రావడంతో శాంతించారు. కరీంనగర్  రూరల్  ఏసీపీ వెంకటరమణ ఘటనా స్థలానికి చేరుకొని సీఐ స్వామి, ఎస్ఐ చేరాలును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆందోళనకారుల వివరాలను సేకరించి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.