ఏడాది నుంచి జీతాలిస్తలె 

V6 Velugu Posted on Aug 04, 2021

  • కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, లెక్చరర్లు, టీచర్లను పట్టించుకోని సర్కారు
  • కేజీబీవీల్లో 16 నెలలుగా.. మోడల్ స్కూళ్లలో 11 నెలలుగా శాలరీల్లేవు
  • పీహెచ్‌సీల్లో హెల్త్ వర్కర్లు, ధరణి ఆపరేటర్లకూ ఇదే పరిస్థితి
  • కొన్ని శాఖల్లో జాబ్స్ రెన్యువల్ చేయలే.. కానీ పని చేయించుకున్నరు
  • రెంట్లు, నిత్యావసరాలు, ఈఎంఐలు, స్కూల్‌ ఫీజులు 
  • చెల్లించలేక ఉద్యోగుల తండ్లాట 

లాస్టియర్ జీతాలివ్వలేదు
గతేడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన జీతం ఇప్పటికీ ఇవ్వలేదు. మా జిల్లాలో 574 మంది వీవీలున్నారు. ఏ ఒక్కరికీ వేతనాలు రాలేదు. మంత్రి హరీశ్‌రావును కూడా కలిశాం. ప్రైవేటు టీచర్లకు సాయం చేశారు కానీ.. మాకు మాత్రం పైసా ఇవ్వలేదు. ప్రభుత్వం జీతాలిచ్చి, మమ్మల్ని రెన్యువల్ చేయాలి.                                                     ‑ భావన, విద్యా వలంటీర్, భద్రాద్రి

 ప్రాణాలకు తెగించి పని చేసినా పట్టించుకోవట్లే
గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ.. కరోనా పేషెంట్లకు మందులందించాం. వ్యాక్సినేషన్​లోనూ పాలుపంచుకుంటున్నాం. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలోనూ ప్రాణాలకు తెగించి పేషెంట్లకు సేవలందించాం. ఇంత చేసినా 4 నెలలుగా మా జాబ్ రెన్యువల్ చేయలేదు. శాలరీలు ఇవ్వలేదు. ‑ మిట్టకోల సత్యానారాయణ, హెల్త్ అసిస్టెంట్, దంతాలపల్లి, మహబూబాబాద్
హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ ధనిక రాష్ట్రమని చెబుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. వివిధ శాఖల్లోని ఉద్యోగులకు జీతాలు మాత్రం ఇవ్వడం లేదు. వేల మందికి కొన్ని నెలలుగా శాలరీలు అందడం లేదు. కేజీబీవీ, హెల్త్‌‌ వర్కర్స్‌‌, సెర్ప్‌‌, ధరణి ఆపరేటర్లు, కాంట్రాక్టు లెక్చరర్లు, గెస్ట్‌‌ లెక్చరర్లు, మోడల్‌‌ స్కూల్‌‌ హవర్లీ బేస్డ్‌‌ టీచర్లకు వేతనాలు చెల్లించడం లేదు. కరోనాతో ఇక్కట్లు పడుతున్న ఉద్యోగులు.. జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా కుటుంబాల్లో పూటగడవడమే కష్టంగా మారింది. ఇండ్ల అద్దె కట్టేందుకు పైసలు లేక నానా అవస్థలు పడుతున్నారు. సమయానికి ఈఎంఐలు చెల్లించక వడ్డీలు, అడిషనల్‌‌ చార్జీలు పెరిగిపోతున్నాయి. నిత్యావసరాలకు డబ్బుల్లేక బయట అప్పులు చేస్తున్నారు. పిల్లల ఫీజులకు పడరాని పాట్లు పడుతున్నారు. కరోనాకు తోడు సీజనల్‌‌‌‌‌‌‌‌ వ్యాధులతో హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌ పాలై అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. సర్కారు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
హెల్త్ వర్కర్స్‌‌‌‌‌‌‌‌ను రెన్యువల్ చేయలె, జీతాలియ్యలె
రాష్ట్రవ్యాప్తంగా వివిధ పీహెచ్‌‌‌‌‌‌‌‌సీల్లో కరోనా పేషెంట్లకు సేవలందిస్తున్న హెల్త్ వర్కర్లకు సర్కారు నాలుగు నెలలుగా జీతాలివ్వడం లేదు. ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ నుంచి క్లియరెన్స్ రాలేదనే కారణం చూపి.. వేతనాలు ఇవ్వడంలో అధికారులు జాప్యం చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో 2003లో కాంట్రాక్ట్ పద్ధతిన 1,153 మంది హెల్త్ అసిస్టెంట్లు, 199 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 200 మంది ఫార్మాసిస్టులు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ(డీఎస్సీ) ద్వారా రిక్రూట్ అయ్యారు. ఏటా ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో ఆటోమేటిక్‌‌‌‌‌‌‌‌గా వారి కాంట్రాక్ట్ ను ప్రభుత్వం రెన్యువల్ చేస్తోంది. ఈ ఏడాది మాత్రం నాలుగు నెలలు దాటినా రెన్యువల్ చేయలేదు.
సెర్ప్‌‌‌‌‌‌‌‌లో బడ్జెట్ లేదంట
రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌‌‌‌‌‌‌‌)లో పని చేస్తున్న ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు రావడంలేదు. ప్రతి నెల 5వ తేదీన శాలరీస్‌‌‌‌‌‌‌‌ అందేవి. కానీ జూన్‌‌‌‌‌‌‌‌, జులై జీతాలు ఇంకా ఇవ్వలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,045 మంది ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌ ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలలకోసారి ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ నుంచి జీతాలకు సంబంధించి బడ్జెట్‌‌‌‌‌‌‌‌ సెర్ప్‌‌‌‌‌‌‌‌ సీఈవో అకౌంట్‌‌‌‌‌‌‌‌లో జమ చేస్తారు. అక్కడి నుంచి అన్ని జిల్లాలకు శాలరీలు రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేస్తారు. కానీ ఈసారి సెర్ప్‌‌‌‌‌‌‌‌లో బడ్జెట్‌‌‌‌‌‌‌‌ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు.
ధరణి ఆపరేటర్లు జీతమడిగితే వేధింపులు
రాష్ట్రంలో ధరణి ఆపరేటర్లకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదు. రాష్ట్రవ్యాప్తంగాగా 568 మంది ధరణి ఆపరేటర్లు, 32 మంది జిల్లా కోఆర్డినేటర్లకు ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నుంచి జీతాలు రావడంలేదు. టెక్నికల్‌‌‌‌‌‌‌‌ అర్హత ఉన్న వారు ఈ జాబ్‌‌‌‌‌‌‌‌లో చేరొచ్చని పేర్కొనడంతో బీటెక్‌‌‌‌‌‌‌‌ చదివిన నిరుద్యోగ యువకులు ధరణి ఆపరేటర్లుగా చేరారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేయాలన్న రూల్‌‌‌‌‌‌‌‌ ఉన్నా.. ధరణి పోర్టల్‌‌‌‌‌‌‌‌లో నెలకొన్న సమస్యల వల్ల రోజూ నైట్‌‌‌‌‌‌‌‌ డ్యూటీ చేయాల్సి వస్తోంది. జీతాలు అడిగితే అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆపరేటర్లు వాపోతున్నారు.
కేజీబీవీల్లో దారుణ పరిస్థితి
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) గతేడాది రిక్రూటైన టీచర్లకు శాలరీస్ రావడం లేదు. 16 నెలలుగా జీతాలు అందక వారు నానా అవస్థలు పడుతున్నారు. సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ), ఫైనాన్స్​ఆఫీస్ విభాగాల మధ్య సమన్వయ లోపం వల్లే జీతాలు వస్తలేవని తెలుస్తోంది. రాష్ట్రంలో కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న టీచర్ (ఎస్ఓలు, పీజీసీఆర్టీ, సీఆర్టీ) పోస్టులను ఉమ్మడి జిల్లాల వారీగా 2019లో భర్తీ చేశారు. కొన్ని జిల్లాల్లో గతేడాది ఫిబ్రవరి, మార్చిలో.. కొన్ని చోట్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆలస్యం కావడంతో అక్టోబర్ లో పోస్టింగ్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. స్కూళ్లే లేని సమయంలో వీరిని ఎందుకు రిక్రూట్ చేశారని ఫైనాన్స్ ఆఫీసర్లు కొర్రీ పెట్టినట్టు తెలిసింది. దీనిపై ఆన్​లైన్​ క్లాసులు తీసుకుంటున్నారని ఎస్ఎస్ఏ అధికారులు వివరణ ఇచ్చినా.. ఆర్థిక శాఖ అధికారుల నుంచి సరైన రెస్పాన్స్ రాలేదని టీచర్ల సంఘాలు తెలిపాయి.

రోడ్డునపడ్డ గెస్ట్ లెక్చరర్లు

గతేడాది మార్చి నుంచి ఫిజికల్ క్లాసులు బంద్ కావడంతో సర్కారు జూనియర్ కాలేజీల్లో పనిచేసే 1,700 మంది గెస్ట్ లెక్చరర్లను రెన్యూవల్ చేయలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఫిజికల్ క్లాసులు స్టార్ట్ కావడంతో అందరినీ రెన్యువల్ చేశారు. కేసులు పెరగడంతో ఫిజికల్ క్లాసులను మళ్లీ బంద్ చేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకే  వారిని విధుల్లోకి తీసుకున్నామని, ఆ మేరకే జీతాలిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. కానీ 4 నెలలైనా ఎవరికీ జీతాలందలేదు. దీంతో వారంతా రోడ్డునపడ్డారు. కనీసం ప్రైవేటు టీచర్ల మాదిరి కూడా తమకు సర్కారు చేయలేదని వారంతా ఆవేదనతో ఉన్నారు. 
మోడల్‌‌‌‌‌‌‌‌ స్కూళ్లలో పని చేయించుకుని జీతమిస్తలే
రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో వెయ్యి మంది దాకా అవర్లీ బేస్డ్ టీచర్లు పనిచేస్తున్నారు. ఫిజికల్ క్లాసులు లేవనే కారణంతో గతేడాది అధికారిక కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వలేదు. ఉన్నతాధికారుల ఓరల్ ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌తో వారితో పనిచేయించుకున్నారు. 17 మోడల్ స్కూళ్లు అవర్లీ బేస్డ్ టీచర్లతోనే కొనసాగుతున్నాయి. కానీ ఎవరికీ ఇప్పటిదాకా జీతాలివ్వలేదు. ఫిబ్రవరి నుంచి ఫిజికల్ క్లాసులు ప్రారంభమయ్యాక అందరికీ జీతాలిస్తామని చెప్పినా పైసా ఇవ్వలేదు. మొత్తంగా 11 నెలలుగా జీతాలు చెల్లించలేదు. పని చేయించుకుని జీతాలు ఎందుకివ్వట్లేదని వారంతా ప్రశ్నిస్తున్నారు.
ఆశ్రమ స్కూళ్లలో నిధులున్నా.. 
రాష్ట్రంలోని ఆశ్రమ స్కూళ్లలో కాంట్రాక్టు రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌ టీచర్లకు గతేడాది జూన్‌‌‌‌‌‌‌‌, జులై, ఆగస్టు జీతాలు ఇవ్వలేదు. జీతాల ఇచ్చేందుకు ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. నిధులూ ఉన్నాయి. కానీ కమిషనర్‌‌‌‌‌‌‌‌ కావాలనే కొర్రీలు పెడుతూ ఆపుతున్నట్లు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,945 మంది సీఆర్సీటీలు ఉన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్​ డైరెక్టరేట్ లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ సకాలంలో జీతాలందట్లేదు. 14 మంది కంప్యూటర్ ఆపరేటర్లకు 4 నెలలుగా జీతాల్లేవు. వాళ్లకు కంటిన్యూషన్ ఉత్తర్వులు రాకపోవడంతో జీతాలు ఆగాయని అధికారులు చెప్తున్నారు.
వాలంటీర్లకు 6 కోట్ల బకాయిలు
గతేడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన జీతాలు ఇప్పటికీ కొందరు విద్యావాలంటీర్లకు అందలేదు. కుమ్రంభీం, కొత్తగూడెం జిల్లాల్లో ఒక్కరికీ రాకపోగా, 12 జిల్లాల్లోని పలు మండలాల్లో పనిచేసే వారికి జీతాలు అందాల్సి ఉంది. ప్రస్తుతం వీవీలకు రూ. 6 కోట్ల నిధులు బకాయిలున్నాయి.
మంత్రులకు మొరపెట్టుకున్నా..
అకడమిక్ ఇయర్ స్టార్ట్ అయినా.. సర్కారు కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్టు లెక్చరర్లను ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు. కానీ వారంతా విధుల్లోనే కొనసాగుతున్నారు. రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో 3,700 మంది, పాలిటెక్నిక్ కాలేజీల్లో 500 మంది, డిగ్రీ కాలేజీల్లో 900 మంది దాకా కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరందరికీ జూన్, జులై నెలలకు సంబంధించిన జీతాలు అందలేదు. 17 జిల్లాల్లో ఫిబ్రవరి, మార్చి నెలల శాలరీలు, 20 జిల్లాల్లో ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన శాలరీలు కాంట్రాక్టు లెక్చరర్లకు పెండింగ్​లో ఉన్నాయి. 40 డిగ్రీ కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్టు లెక్చరర్లకు మార్చి నుంచి జీతాల్లేవు. పెండింగ్ జీతాలివ్వాలని మంత్రులు, ఉన్నతాధికారులను కలిసినా పట్టించుకునే దిక్కులేదు.


రెన్యువల్ చేసి జీతాలివ్వాలె..
రాష్ట్రంలో కాంట్రాక్టు లెక్చరర్లను రెన్యువల్ చేయలేదు. అయినా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ క్లాసులు చెప్తున్నం. చాలా జిల్లాల్లో ఫిబ్రవరి, మార్చి నుంచే జీతాలందట్లేదు. దీంతో కాంట్రాక్టు లెక్చరర్లు అప్పులతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. జీతాలు, రెన్యువల్ కోసం చాలా సార్లు అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసినా ఫలితం లేదు. అందరినీ రెన్యువల్ చేసి, జీతాలివ్వాలి.
- కొప్పిశెట్టి సురేశ్, జనరల్ సెక్రటరీ, కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్

కుటుంబాన్ని నడపడం కష్టంగా ఉంది
గతేడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో మా సేవలను ఉపయోగించుకున్నారు. కానీ ఇప్పటికీ జీతాలివ్వలేదు. 16 నెలలుగా ఉద్యోగం లేక కుటుంబాన్ని నడపడం కష్టంగా మారింది. ప్రస్తుతం వ్యవసాయ పనులు చేసుకుంటున్న. చాలాచోట్ల లెక్చరర్లు కూలీపనులకు పోయేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ‘సార్లు’ అనే గౌరవంతో మమ్మల్ని పనులకు పిలవడం లేదు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తయనుకున్నం. కానీ ఉన్న ఉద్యోగాలు పోయాయి. - దేవేందర్, గెస్ట్ లెక్చరర్, వరంగల్ జిల్లా
 

Tagged Ts Government, Contract, , teachers, ignores, outsourcing employees, lecturers

Latest Videos

Subscribe Now

More News