గవర్నర్ లెటర్​తో సర్కారులో కదలిక

గవర్నర్ లెటర్​తో సర్కారులో కదలిక
  • పదిరోజుల్లో వర్సిటీలకు కొత్త వీసీలు
  • వారంలో వర్సిటీల సెర్చ్ కమిటీల మీటింగ్స్
  • ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వీసీలను భర్తీ చేసే చాన్స్

హైదరాబాద్, వెలుగు: ఏడాదిన్నరగా ఖాళీగా ఉన్న యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్​(వీసీ)ల నియామకంపై సర్కారులో కదలిక స్టార్ట్ అయింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడుతుండటం, గవర్నర్ తో పాటు ఇతర పార్టీల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో.. వారంపది రోజుల్లో కొత్త వీసీలను నియమించాలని సర్కారు నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే 5 వర్సిటీల సెర్చ్ కమిటీల సమావేశాలకు డేట్లు ఫిక్స్ చేశారు. సోమవారం తెలంగాణ యూనివర్సిటీ సెర్చ్ కమిటీ మీటింగ్ తో ఈ ప్రాసెస్ స్టార్ట్ కానుంది. దీంతో ఆశావహులు మంత్రుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

సీఎం ఆర్డర్ కోసమే ఆగారా?

రాష్ట్ర విద్యాశాఖ లిమిట్స్ లోని 11 వర్సీటీలకు ప్రస్తుతం ఇన్​చార్జి వీసీలుగా ఐఏఎస్​లు కొనసాగుతున్నారు. దాదాపు ఏడాదిన్నర నుంచి ఈ పోస్టుల్లో రెగ్యులర్ వీసీల్లేరు. గతంలో ఆర్జీయూకేటీ, జేఎన్ఏఎఫ్ఏయూ మినహా మిగిలిన 9 వర్సిటీల వీసీల నియామకం కోసం పోయినేడాది జులైలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, జేఎన్‌‌టీయూహెచ్‌‌, అంబేద్కర్ ఓపెన్, మహాత్మాగాంధీ, పాలమూరు, పొట్టిశ్రీరాములు తదితర 9 వర్సిటీలకు 984 అప్లికేషన్లు అందాయి. వీసీలను సెలెక్ట్ చేసేందుకు గతేడాది సెప్టెంబర్​లోనే ప్రభుత్వం సెర్చ్ కమిటీలు వేసినా, ఆ కమిటీలు ఇప్పటికీ సమావేశం కాలేదు. దీనికి సీఎం కేసీఆర్​వీసీల పేర్లు ఫైనల్ చేయకపోవడమే కారణమని తెలుస్తోంది. ఆర్జీయూకేటీకి మాత్రం డైరెక్ట్​గా వీసీని నియమించే చాన్స్ ఉందని అధికారులు చెప్తున్నారు.

గ్రాడ్యుయేట్స్ నుంచి వ్యతిరేకత భయం

త్వరలోనే హైదరాబాద్, వరంగల్ గ్రాడ్యుయేట్ సెగ్మెంట్లకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.  దీనికితోడు వీసీల నియామకంపై గవర్నర్​పలుమార్లు సర్కారుకు లేఖ రాయడం, ప్రతిపక్షాలు నిత్యం విమర్శలు చేస్తుండటంతో సర్కారులో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. వారం.. పదిరోజుల్లోనే గ్రాడ్యుయేట్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న మేరకు.. ఆ లోపే కొత్త వీసీలను ప్రకటించాలని సర్కారు భావిస్తున్నట్టు అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తోంది. వీసీలను రిక్రూట్ చేయకుండా, ఎమ్మెల్సీ ఎన్నికలకు పోతే గ్రాడ్యుయేట్స్ నుంచి వ్యతిరేకత వస్తుందని పార్టీ నేతల్లోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీసీలను నియమించాలని సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. సోమవారం సీఎం కేసీఆర్​తో సీఎస్​ సోమేష్ కుమార్ సమావేశం కానున్నట్టు తెలిసింది. దీంట్లో వీసీల పేర్లు ఫైనల్ చేసే అవకాశముంది.

నేటి నుంచే సెర్చ్ కమిటీల భేటీలు

సీఎం ఆదేశాల మేరకు సోమవారం నుంచి వీసీ సెర్చ్ కమిటీల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 9 వర్సిటీల సెర్చ్ కమిటీల్లో సర్కారు నామినీగా సీఎస్ సోమేశ్‌ కుమార్ ఉన్నారు. కాగా సెర్చ్ కమిటీల కోఆర్డినేషన్​ బాధ్యతలు చూస్తున్న టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ రెండ్రోజుల నుంచి యూజీసీ, వర్సిటీ ఈసీ నామినీల టైమ్ తీసుకుంటున్నారు. సోమవారం సాయంత్రం తెలంగాణ వర్సిటీ వీసీ సెర్చ్ కమిటీ భేటీ కానున్నది. 9 లేదా10న జేఎన్టీయూహెచ్​, అంబేద్కర్, మహాత్మాగాంధీ వర్సిటీల సెర్చ్ కమిటీల తేదీలు ఖరారైనట్టు సమాచారం. శనివారంలోపే అన్ని సెర్చ్ కమిటీల  భేటీలను పూర్తిచేయాలని అధికారులు యోచిస్తున్నారు. సెర్చ్ కమిటీలు ఒక్కో వర్సిటీకి ముగ్గురిపేర్లను ప్రతిపాదిస్తే, వాటిని గవర్నర్​కు పంపించనున్నారు. అందులోంచి ఒకర్ని వీసీగా ఎంపిక చేయనున్నారు.

ఇవి కూడా చదవండి..

మూడు నెలల సదువులకు ఏడాది ఫీజు కట్టాల్నట

మేం అధికారంలోకి వస్తే కేసీఆర్ జైలుకే

ఆర్టీసీని సర్కార్‌‌లో విలీనం చేయాలె

లైన్ దాటి మాట్లాడితే కర్రు కాల్చి వాత పెడ్త.. వినకపోతే కాళ్లు పట్టుకొని బండకు కొడతా

కేసీఆర్​ వార్నింగ్​ వెనుక మతలబేంది..? ఆరా తీస్తున్న కేడర్