ఉద్యోగాల భర్తీ ప్రక్రియ.. అవరోధాలతో ఆగిపోవద్దు

ఉద్యోగాల భర్తీ ప్రక్రియ.. అవరోధాలతో ఆగిపోవద్దు

సుదీర్ఘ కాలం నిరుద్యోగుల నిరీక్షణకు తెరదించుతూ గత ప్రభుత్వం హడావుడిగా ఏకకాలంలో పెద్ద మొత్తంలో ఉద్యోగ నోటిఫికేషన్​లను విడుదల చేసినప్పటికీ.. అనుకున్నంత స్థాయిలో ఉద్యోగ భర్తీ ప్రక్రియను చేపట్టడంలో మాత్రం వెనుకబడిపోయింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించిన పలు పరీక్షలు పేపర్ లీకేజీ కారణంగా రద్దయ్యాయి. పరీక్షా నిర్వహణపై పలు ప్రశ్నలు సంధిస్తూ కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో రెండోసారి నిర్వహించిన గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్ష  సైతం రద్దయింది.

ఇదిలా ఉండగా కోర్టుల్లో ఉన్న పలు కేసులు కారణంగా ఇప్పటికే నిర్వహించిన పరీక్షల ఫలితాలు కూడా వెలువడలేదు. మరికొన్ని పరీక్షలకు తేదీలను ప్రకటించలేదు. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా జాబ్ క్యాలెండర్​ను అమలు చేసే దిశగా అడుగులు వేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఉన్న నోటిఫికేషన్​లకు అనుబంధంగా మరిన్ని నోటిఫికేషన్లను విడుదల చేయడంతో పాటు కొన్ని పరీక్షల తేదీలను ప్రకటించడానికి, నిర్వహించిన పరీక్షల ఫలితాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నది

ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లలో ఉన్న న్యాయపర లోపాలను సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఈ ఆటంకాలను అధిగమించకుండా ఉద్యోగ భర్తీ ప్రక్రియను మొదలు పెట్టినా ఎక్కడో ఒకచోట ఆగిపోయే ప్రమాదం ఉన్నదని, న్యాయపర చిక్కులకు పరిష్కారం చూపకుండా భర్తీ ప్రక్రియను కొనసాగించడం కత్తి మీద సాము లాంటిదని న్యాయ నిపుణులు అభిప్రాయం. ప్రతిష్టాత్మకంగా జాబ్ క్యాలెండర్ ను అమలు చేయాలని చూస్తున్న కొత్త ప్రభుత్వం విడుదల చేయనున్న కొత్త అనుబంధ నోటిఫికేషన్లలో పాత నోటిఫికేషన్లలోనూ న్యాయపర అవరోధాలు కలగకుండా సరైన సవరణలు చేసి విలువైన సమయాన్ని, డబ్బును వృథా కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని అభ్యర్థులు కోరుకుంటారు. న్యాయపర చిక్కులను తొలగించకుండా నోటిఫికేషన్లను విడుదల చేయడం వల్ల గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు పునరావృతం అయ్యే అవకాశాలు ఉంటాయి.

మహిళా అభ్యర్థుల భర్తీ ప్రక్రియపై స్పష్టత రావాలి

ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా మహిళా అభ్యర్థులను భర్తీ చేసేటప్పుడు వారికి హారిజంటల్ రిజర్వేషన్​ వర్తింపచేయాలని రాజేష్ కుమార్ దారియా కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును ఆధారంగా చేసుకుని సర్వీస్ సబార్డినేట్ రూల్స్ 22,22 ఏ లను సవరిస్తూ ఇటీవల ఏపీలో ప్రత్యేక రిజర్వేషన్లైన మహిళా, స్పోర్ట్స్ కోటా, ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలకు రోస్టర్​లో ఎలాంటి పాయింట్స్ కేటాయించకుండా  జీవో 77  తీసుకురావడం జరిగింది. హారిజాంటల్ అంశం మీద తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్ శాఖల్లో  మహిళలను హారిజాంటల్ విధానం ద్వారానే భర్తీ చేశారు. కానీ అందుకు భిన్నంగా ఒకపక్క టీఎస్పీఎస్సీ రోస్టర్ లో ఎలాంటి మార్పు లేకుండా మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ను వర్తింప చేస్తామని చెబుతుండగా, మరోపక్క గురుకుల బోర్డు మాత్రం మహిళలను సమాంతరంగా కాకుండా నిలువుగానే భర్తీ చేస్తామని చెబుతుండడం వివాదాంశంగా మారింది.  హారిజాంటల్ అంశం ఇప్పటికీ కోర్టు పరిధిలో ఉండడం వల్ల నిర్వహించిన పరీక్షలకు ఫలితాలు వెలువడ లేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని తక్షణమే ఒక జీవోను తీసుకురావడం వల్ల ఈ వివాదానికి తెరదించవచ్చు.

ఆర్టీవో పోస్టుకు విద్యార్హతపై అభ్యంతరాలు

 గ్రూప్1 కేటగిరిలో ఉన్న ఆర్టీవో పోస్టుకు అర్హత డిగ్రీకి బదులుగా జీవో 7 ద్వారా దాని అర్హతను మెకానికల్ ఇంజనీరింగ్/ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అర్హతగా మార్చడం కూడా వివాదానికి తెర లేచింది. సాధారణ పరిపాలన విభాగానికి చెందిన పోస్టులకు ప్రత్యేక సాంకేతిక అర్హత అక్కర్లేదనేది కొంతమంది అభ్యర్థులువాదిస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు కోర్టును సైతం ఆశ్రయించారని తెలుస్తోంది.  ప్రభుత్వం కోర్టు పరిధిలో ఉన్న ఈ వివాదాలన్నింటికీ ముగింపు పలికి ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే  ప్రయత్నం చేయాలి.

 

జీవో 55 సవరణ చేయాలి

2022లో విడుదల చేసిన గ్రూప్1 నోటిఫికేషన్​లో పేర్కొన్న జీవో 55కు అనుగుణంగా రిజర్వేషన్ల వారీగా ప్రిలిమినరీ పరీక్ష నుంచి మెయిన్స్​కు 1:50 చొప్పున ఎంపిక చేయడం కూడా వివాదానికి దారితీసింది. గతంలో వెలువడ్డ అన్ని గ్రూప్1 నోటిఫికేషన్ ప్రిలిమినరీ స్థాయిలో ఎలాంటి రిజర్వేషన్లను పాటించకుండానే మెయిన్స్​కు ఎంపిక చేసేవారు. ఇదే విషయాన్ని గతంలో బాలోజీ బదావత్ కేసులోనూ, జాఫర్ సాహెబ్ కేసులోనూ ప్రస్తావించడం జరిగింది. కొంతమంది అభ్యర్థులు కోర్టును ఇప్పటికే ఆశ్రయించడం జరిగింది. కాబట్టి జీవో 55ను సవరణ చేయకపోతే ప్రక్రియకు బ్రేక్ పడే అవకాశం ఉంది. అట్లే రోస్టర్​లో కూడా బీసీ కమ్యూనిటీలో ఉన్న ఉప వర్గాలకు గల రిజర్వేషన్ వెయిటేజ్ ప్రకారంగా స్థానాన్ని కేటాయింపు చేయలేదని వివాదం కూడా రాజుకుంటున్నది. బీసీ కమ్యూనిటీకి గల మొత్తం రిజర్వేషన్​ను రోస్టర్​లో లెక్కించి, రిజర్వేషన్ వెయిటేజ్ అనుసరించి బి(10%), డి(7%), ఏ(7%), ఈ(4%), సి(1%) లకు వరుస క్రమస్థానాలు కేటాయించాలని అభ్యర్థులు కోరుతున్నారు.

- భాస్కర్ యలకంటి,సోషల్​ ఎనలిస్ట్