దళితబంధు స్కీంకు ఉపాధిహామీ ఫండ్స్

దళితబంధు స్కీంకు ఉపాధిహామీ ఫండ్స్

 

  • డెయిరీ యూనిట్​ షెడ్​కు రూ.లక్షన్నర కేటాయింపు
  • కరీంనగర్​ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు
  • మండలాల వారీగా ప్లాన్ పంపాలని ఎంపీడీవోలకు కలెక్టర్ ఆదేశాలు

కరీంనగర్, వెలుగు: దళితబంధు స్కీంకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) ఫండ్స్ వాడుకోవాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. గ్రౌండింగ్​ టైంలో యూనిట్ కాస్ట్ రూ.10 లక్షలు దాటుతున్న డెయిరీ యూనిట్ల కోసం ఈ నిధులు వాడుకునేలా చర్యలు చేపట్టింది. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే దీన్ని అమలులో చేస్తున్నారు. దళితబంధును పైలెట్​ప్రాజెక్టుగా అమలు చేస్తున్న హుజూరాబాద్ నియోజకర్గంతో పాటు జిల్లాలో డెయిరీ యూనిట్లు ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు ఒక్కో పసుల దొడ్డికి రూ.లక్షన్నర చొప్పున ఉపాధి హామీ నిధులు కేటాయించారు. ఈ మేరకు అన్ని మండలాల నుంచి అంచనాలతో ప్రణాళికలు తయారు చేసి​ పంపాలని కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తాజాగా ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు.

డెయిరీ షెడ్లకు పైసలు సాల్తలేవు

దళితబంధు పథకాన్ని ఆగస్టు16న సీఎం కేసీఆర్ హుజూరాబాద్​లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. అదే నెల 4న యాదాద్రి భువనగిరి జిల్లాలోని సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిని దళిత బంధు స్కీం కోసం ఎంపిక చేశారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లా చింతకాని, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, నాగర్​కర్నూల్ జిల్లా సారగొండ, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలాల్లోనూ పూర్తిస్థాయి పైలట్ ప్రాజెక్టుగా దళితబంధును అమలు చేయాలని నిర్ణయించారు. మిగిలిన నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారుల జాబితాలను ఫైనల్ చేస్తున్నారు. ప్రస్తుతం హుజూరాబాద్​నియోజకవర్గంతో పాటు వాసాలమర్రిలో దళితబంధు లబ్ధిదారుల ఎంపిక పూర్తయి యూనిట్ల గ్రౌండింగ్​జరుగుతోంది. లబ్ధిదారులు 30 అంశాల్లో తమకు నచ్చిన వ్యాపారం/యూనిట్ ఎంపిక చేసుకొనే అవకాశం ఇచ్చారు.

దీంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో చాలామంది డెయిరీ యూనిట్లు ఎంపిక చేసుకుంటున్నారు. తొలివిడత ఈ నియోజకవర్గం నుంచి డెయిరీ యూనిట్ల కోసం1,360 ప్రపోజల్స్ రాగా, ఆఫీసర్లు 400 యూనిట్లు గ్రౌండింగ్ చేస్తున్నారు. మినీ డెయిరీ యూనిట్ కింద లబ్ధిదారులకు 10 నుంచి 12 పాడి బర్లు, ఒక షెడ్, బైక్ ఇవ్వాలని మొదట నిర్ణయించారు. రూ.10 లక్షల్లో రూ.10 వేలు బీమా పోను, మిగిలిన రూ.9.90 లక్షల నుంచి షెడ్ కోసం రూ.లక్షన్నర, బైక్​ కోసం రూ.90 వేలు కేటాయించారు. మిగిలిన ఏడున్నర లక్షల్లో 8 బర్లు మాత్రమే వస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కో యూనిట్ కింద మొదటి విడత 4 బర్లు ఇస్తున్నారు. వీటి కోసం నిర్మించిన షెడ్లలో నాలుగు బర్లు కూడా తిరిగే పరిస్థితి లేదు. దీంతో రెండో విడత ఇచ్చే 4 బర్లను ఎక్కడ కట్టేయాలో అర్థం కాకుండా ఉంది. ఫీల్డ్ లెవల్​లో ఎదురవుతున్న ఈ సమస్యను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఉపాధి నిధుల కింద షెడ్​కు రూ.1.5 లక్షలు అదనంగా కేటాయిస్తున్నారు.

షెడ్ల కోసం ప్రపోజల్స్​.. 

దళితబంధు కింద పసుల దొడ్డి కోసం రాష్ట్ర సర్కార్ ఇస్తున్న రూ.1.5 లక్షలు సరిపోకపోవడంతో ఉపాధి హామీ పథకం కింద మరో రూ.1.5 లక్షలు ఇవ్వాలని, ఇందుకోసం మండలాలవారీగా ఎస్టిమేషన్స్ పంపాలని కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జిల్లాలోని​ఎంపీడీవోలు అందరికీ ఈ నెల 21న లెటర్ రాశారు. ప్రస్తుతం హుజూరాబాద్​లో మొదటిదశ కింద డెయిరీ యూనిట్లు ఎంపిక చేసుకున్న 1,360 మందితోపాటు మిగిలిన నియోజకవర్గాల్లో ఇప్పటికే యూనిట్లు ఎంచుకున్న 100 మంది లబ్ధిదారుల వివరాలు, వర్క్​ ఎస్టిమేషన్స్ పంపేందుకు ఎంపీడీవోలు వారం రోజులుగా కసరత్తు చేస్తున్నారు. దళిత బంధు స్కీంకు ఎంపికైన లబ్ధిదారుల్లో ఉపాధిహామీ జాబ్ కార్డు ఉన్న వాళ్లందరికీ ఈ అదనపు పసుల దొడ్డి మంజూరు చేస్తారు. ఈ నిధులతో విడిగా కొత్త షెడ్ వేసుకోవడంతో పాటు ఇప్పటికే ఉన్న షెడ్​ను విస్తరించుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా జాబ్​కార్డు లేకుంటే కొత్త కార్డు ఇచ్చి నిధులు మంజూరు చేస్తారు. ఫీల్డ్ లెవల్ లో టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీలకు ఈ బాధ్యత అప్పగించారు. వీళ్లు అంచనాలు తయారు చేసి ఎంపీడీవోల ద్వారా ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి అందిస్తారు. అక్కడి నుంచి పర్మిషన్ రాగానే మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ రేషియోలో ఫండ్స్ ఖర్చు చేస్తారు. పని ప్రారంభించే ముందు.. తర్వాత ఫొటోలు తీసుకోవడంతో పాటు పూర్తిగా పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉపాధి హామీ సిబ్బంది, అధికారులకే అప్పగించారు. కాగా, కేంద్రం ఇచ్చే ఉపాధి నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఊరూరా విలేజ్​పార్కులు, సెగ్రిగేషన్ షెడ్లు, శ్మశానవాటికలను, క్లస్టర్ల పరిధిలో రైతు వేదికలను నిర్మించింది.