
- విద్యాశాఖలో భారీ మార్పులు .. రాష్ట్ర సర్కారు స్పెషల్ ఫోకస్
- హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్ల తొలగింపు
- శాఖ సెక్రటరీపై బదిలీ వేటు
- ఎస్‌సీఈఆర్టీలో డిప్యూటేషన్ల రద్దు చేసేందుకు కసరత్తు
- అన్ని డిపార్ట్‌మెంట్లకు కొత్త ఆఫీసర్లు వచ్చే చాన్స్
- త్వరలో యూనివర్సిటీలకు కొత్త వీసీలు!
హైదరాబాద్, వెలుగు: విద్యా శాఖ ప్రక్షాళనపై రాష్ట్ర సర్కారు ఫోకస్ పెట్టింది. స్కూల్, హయ్యర్ ఎడ్యుకేషన్ సహా అన్నింటిలోనూ మార్పులు మొదలుపెట్టింది. ఇప్పటికే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్‌లో పనిచేస్తున్న ఇద్దరు కీలక అధికారులను తప్పించింది. కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ను తొలగించింది. కౌన్సిల్‌కు కొత్త టీమ్‌ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. ఎస్‌సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్)లో డిప్యూటేషన్లను రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. యూనివర్సిటీల పని విధానంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టగా.. విమర్శలు ఎదుర్కొంటున్న వీసీలను తొలగించే అవకాశం ఉందని చర్చ జరుగుతున్నది.
వీసీలపై ఆరోపణలు
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కారు.. విద్యా శాఖలో మార్పుల విషయంలో తన మార్కు చూపిస్తున్నది. ఇప్పటికే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటరమణను తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల విద్యా శాఖపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. పరీక్షల నిర్వహణపై శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. యూనివర్సిటీల పని విధానంపైనా వివరాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. వర్సిటీల్లో పరీక్షల విభాగంలో పనిచేసే వివరాలనూ సర్కారు తాజాగా సేకరించింది.
త్వరలోనే వర్సిటీ వీసీలతో సీఎం సమావేశం నిర్వహించే అవకాశముంది. ప్రస్తుతమున్న వీసీల్లో కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలుగా పని చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఓయూ, కేయూ, జేఎన్టీయూ వీసీల తీరుపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అఫిలియేషన్లు, సీట్ల పెంపునకు కాలేజీల నుంచి భారీగా ముడుపులు, ప్రొఫెసర్ల ప్రమోషన్లలో అక్రమాలు, న్యాక్ బృందం పరిశీలన సమయంలో వసతుల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేశారనే ఆరోపణలున్నాయి. మరోపక్క ఓయూ, కేయూల్లో వీసీలను మార్చాలంటూ ఆందోళనలూ కొనసాగుతున్నాయి. ఈక్రమంలో కొత్త వీసీలను తీసుకొస్తారనే ప్రచారం సాగుతున్నది.
ఎస్‌సీఈఆర్టీ డిప్యూటేషన్లపై కొరడా!
స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఎస్‌సీఈఆర్టీపై అనేక విమర్శలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నోటిఫికేషన్లు, రాత పరీక్షలు లేకుండా ఫారిన్ సర్వీస్, వర్క్ డిప్యూటేషన్, ఓరల్ డిప్యూటేషన్ పేరుతో ఏండ్ల నుంచి కొందరు టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది అప్పటి బీఆర్ఎస్ సర్కారు మంత్రులు, సీఎంఓ సిఫారులతో ఏండ్ల నుంచి బడులకు పోకుండా ఇక్కడే ఉంటున్నారు. ఎవరినైనా ఐదేండ్ల కంటే ఎక్కువ రోజులు డిప్యూటేషన్‌పై ఉంచొద్దు. కానీ కొందరు ఏదో ఒక పేరుతో 15 – 20 ఏండ్ల నుంచి అక్కడే పాతుకుపోయారనే ఆరోపణలున్నాయి.
ఈ నేపథ్యంలో ఎస్సీఈఆర్టీని ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలోనూ చెప్పింది. ఇప్పుడు ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ డిప్యూటేషన్లన్నీ రద్దు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. నిబంధన ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి, రాత పరీక్షల ద్వారా కొత్తగా నియామకాలు చేపట్టాలనే భావనలో సర్కారు ఉన్నది. మరోపక్క ఎస్సీఈఆర్టీలో స్వచ్చంధ సంస్థలకు చెందిన వ్యక్తులకు చోటిచ్చి, టీచర్ల గౌరవం తగ్గిస్తున్నారనే విమర్శలున్నాయి. వీటన్నింటిపై త్వరలో సీఎం రివ్యూ చేసి, సరిచేస్తారనే ప్రచారం జరుగుతున్నది.
డిపార్ట్‌మెంట్లకు కొత్త ఆఫీసర్లు!
విద్యా శాఖలో స్కూల్, ఇంటర్, హయ్యర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్లున్నాయి. వీటిలో కేవలం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన మాత్రమే రెగ్యులర్ అధికారి. ఆమె కూడా సుమారు మూడున్నర ఏండ్లుగా కొనసాగుతున్నారు. ఇంటర్ బోర్డు సెక్రటరీ, కమిషనర్‌గా నవీన్ మిట్టల్ ఇన్‌చార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌గా విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఇన్‌చార్జ్ బాధ్యతల్లో ఉన్నారు. తాజాగా వాకాటి కరుణపై బదిలీ వేటు పడింది. ఆమె స్థానంలో బుర్రా వెంకటేశంను కార్యదర్శిగా సర్కారు నియమించింది. మరోపక్క హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్‌కు కొత్త టీమ్‌ను తీసుకురానున్నారు.