వచ్చే ఏడాది ఫీజులూ.. ఇప్పుడే కట్టాల్నట

వచ్చే ఏడాది ఫీజులూ.. ఇప్పుడే కట్టాల్నట
  • పేరెంట్స్ ను డిమాండ్ చేస్తున్న ప్రైవేట్ స్కూళ్లు 
  • మరోవైపు 50 శాతం వరకు ఫీజులు పెంచిన్రు  
  • ఇదేంటని ప్రశ్నిస్తే పిల్లలకు టీసీలు ఇస్తున్రు 
  • అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకుంటలేరు

హైదరాబాద్, వెలుగు: ‘‘మా పెద్దబ్బాయి బేగంపేట్ బ్రాహ్మణ వాడీలోని గీతాంజలి స్కూల్ లో మూడో తరగతి చదువుతున్నాడు. పోయినేడాది రూ.76 వేలు ఫీజు కట్టినం. వచ్చే ఏడాది ఫీజు ఇప్పుడే కట్టాలని ఒత్తిడి చేస్తున్నరు. మళ్లీ ఫీజు కూడా పెంచిన్రు. స్కూల్ ఫీజు రూ.96 వేలు, స్టేషనరీ కోసం మరో రూ.5 వేలు కట్టమంటున్రు. పేరెంట్స్ అందరం కలిసి మీటింగ్ పెట్టుకొని ఇదేంటని ప్రశ్నిస్తే, పిల్లలకు టీసీలు ఇచ్చేసిన్రు. ఇప్పుడు మా అబ్బాయి ఆన్ లైన్ క్లాసులకు కూడా అటెండ్ కావడం లేదు. వాడి ఐడీని బ్లాక్ చేసిన్రు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు” అని రమ్య అనే పేరెంట్ ఆవేదన వ్యక్తం చేశారు.  ఇదొక్క రమ్య సమస్యనే కాదు.. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. కరోనా వల్ల ఈ అకడమిక్ ఇయర్ చదువులు సక్కగా సాగనే లేదు. ఆన్ లైన్ క్లాసులు చెప్పిన ప్రైవేట్ స్కూల్స్.. ఏడాది మొత్తం ఫీజు కట్టాలని ఇన్ని రోజులు పేరెంట్స్ ను ఇబ్బందులకు గురిచేశాయి. ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని సర్కార్ చెప్పినా, మొత్తం ఫీజు వసూలు చేశాయి. ఇక ఇప్పుడు వచ్చే అకడమిక్ ఇయర్ ఫీజులు కూడా కట్టాలని పేరెంట్స్ పై ఒత్తిడి తెస్తున్నాయి. మరోవైపు ఫీజులను 50 శాతం వరకు పెంచాయి. ఇదేంటని ప్రశ్నిస్తే పిల్లలకు టీసీలు ఇచ్చేస్తూ, వాళ్ల ఆన్ లైన్ ఐడీలు బ్లాక్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాయి. దీనిపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
మళ్లా వేధింపులు... 
ఏడాదికి 10 శాతం ఫీజులు పెంచుకునేందుకు ప్రైవేట్ స్కూళ్లకు రాష్ట్ర సర్కార్ అవకాశం కల్పించింది. కానీ ప్రైవేట్ స్కూళ్ల మేనేజ్మెంట్లు మాత్రం ఇష్టానుసారంగా ఫీజులు పెంచేస్తున్నాయి. పోయినేడాది 20 శాతం ఫీజులు పెంచగా, ఈసారి 50 శాతం వరకు పెంచాయి. కరోనా కారణంగా ఈ ఏడాది కొన్ని నెలలే, అదీ ఆన్ లైన్ క్లాసులే నడిచాయి. అయినా ప్రైవేట్ స్కూళ్లు మొత్తం ఫీజులు వసూలు చేశాయి. ఫీజులు కడితేనే స్టూడెంట్లను ఎగ్జామ్స్ రాయనిస్తామని, పైతరగతికి ప్రమోట్ చేస్తామని మొదట్నుంచి పేరెంట్స్ పై ఒత్తిడి తెస్తున్నాయి. ఇక ఇప్పుడు అకడమిక్ ఇయర్ అయిపోతుండడంతో.. వచ్చే ఏడాది ఫీజులు కూడా కట్టాలని మళ్లా వేధిస్తున్నాయి. ఫీజు చెల్లించాలని, పుస్తకాలు కొనాలని ఫోన్లు చేస్తున్నాయి. ఫీజులు తగ్గించాలని పేరెంట్స్ అడిగితే.. ‘‘ఇష్టముంటే చదివించండి. లేకపోతే మీ పిల్లలను తీసుకెళ్లండి” అంటూ జవాబిస్తున్నాయి. ఇప్పటికే కరోనా వల్ల జాబ్స్ పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో అంత మొత్తం ఫీజులు ఎట్ల కట్టాలని పేరెంట్స్ వాపోతున్నారు.  
జూనియర్ కాలేజీల్లోనూ అంతే.. 
జూనియర్ కాలేజీలు కూడా ఫీజుల కోసం స్టూడెంట్లు, పేరెంట్స్ పై ఒత్తిడి తెస్తున్నాయి. ఇంటర్ స్టూడెంట్లకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్మెంటర్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. అయితే ఫీజు కడితేనే ఎగ్జామ్స్కు అనుమతిస్తామని కాలేజీ మేనేజ్మెంట్లు బెదిరిస్తున్నాయి. ఫీజు చెల్లిస్తేనే హాల్ టికెట్, ఎగ్జామ్స్ కు సంబంధించిన క్వశ్చన్ పేపర్లు, ఆన్సర్ బుక్ లెట్లు ఇస్తామని చెప్తున్నాయి. ఆన్సర్ బుక్ లెట్లతో పాటు ప్రాజెక్టు వర్క్ రిపోర్టును ఈ నెల 5లోపు సబ్మిట్ చేయాలని మెసేజ్ లు పంపుతున్నాయి.  

ప్రశ్నిస్తే టీసీలు ఇస్తున్రు..  
ఎక్కువ ఫీజులు ఎందుకు కట్టాలని మేనేజ్మెంట్లను ప్రశ్నిస్తే, పిల్లలకు టీసీలు ఇచ్చి స్కూల్ నుంచి తీసేస్తున్రు. మార్చి 12న దాదాపు 300 మంది తల్లిదండ్రులం కలిసి మీటింగ్ పెట్టుకున్నం. రూల్స్కు వ్యతిరేకంగా ఫీజులు ఎట్ల పెంచుతరని ప్రిన్సిపాల్ ను ప్రశ్నించినం. ‘‘మమ్మల్ని ప్రశ్నిస్తే, మీ పిల్లలను తీసేస్తం” అంటూ ప్రిన్సిపాల్ బెదిరించారు. మా అబ్బాయిని స్కూల్ నుంచి తీసేశారు. ఏ ఒక్క ప్రైవేట్ మేనేజ్మెంట్ రూల్స్ పాటించడం లేదు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. - వినీతాసింగ్, పేరెంట్, బేగంపేట్, హైదరాబాద్   

ఏం చేయాలో అర్థమైతలేదు..  
ఇప్పటికే సగం ఫీజు కట్టాను. కానీ మొత్తం ఫీజు కడితేనే క్వశ్చన్ పేపర్, ఆన్సర్ బుక్ లెట్ ఇస్తమంటున్రు. అసలు ఆన్ లైన్ క్లాసులతో పాఠాలేం అర్థం కావడం లేదు. ఇప్పుడు ఫీజు టెన్షన్ ఒకటి. ఇంకా ప్రాజెక్ట్ వర్క్ కూడా చేయలేదు. అన్నీ కలిపి ఈ నెల 5లోపు సబ్మిట్ చేయాలి. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాలేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. -రవికిరణ్, ఇంటర్ సెకండ్ ఇయర్, కేపీహెచ్‌బి, హైదరాబాద్