తెలంగాణలో అస్తులు ఉన్నాయన్న సంగతి మర్చిపోవద్దు : ఏపీ మంత్రికి బీఆర్ఎస్ లీడర్ వార్నింగ్

తెలంగాణలో అస్తులు ఉన్నాయన్న సంగతి మర్చిపోవద్దు : ఏపీ మంత్రికి బీఆర్ఎస్ లీడర్ వార్నింగ్

తెలంగాణ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని, హైదరాబాద్ కు రానివ్వమంటూ టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్ హెచ్చరించారు. మరోసారి తెలంగాణపై లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేసే నేతలు హైదరాబాద్ కు రావొద్దన్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధి చూసి.. ఓర్వలేక ఆంధ్ర ప్రాంత నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారంటూ ఆరోపించారు. మీరు మొనగాళ్లయితే ముందు మీ రాజధాని ఎక్కడో తెలుసుకోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ సెక్రటేరియట్‌లో ఎర్రోళ్ల శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ విద్యావ్యవస్థపై గురువారం (జులై 13న) ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏపీ విద్యా విధానాన్ని తెలంగాణతో పోల్చి చూడడం సరికాదన్నారు. టీఎస్పీఎస్సీలో చూచిరాతలు, స్కాంలు వెలుగు చూస్తున్నాయని ఎద్దేవా చేశారు. 

అవినీతి కుంభకోణాలకు కేరాఫ్ అడ్రాస్ కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యానించారు ఎర్రోళ్ల శ్రీనివాస్. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. తెలంగాణలో తమకు అస్తులు ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్కువగా మాట్లాడితే శంషాబాద్ ఎయిర్ ఫోర్ట్ లో దిగనివ్వమని హెచ్చరించారు. మీ హయాంలో ఒక్క డిగ్రీ కాలేజ్ కు అయినా అనుమతి ఇచ్చారా..? అని ప్రశ్నించారు.

మరోవైపు.. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పైనా ఆరోపణలు చేశారు ఎర్రోళ్ల శ్రీనివాస్. ఇచ్చిన హామీ ప్రకారం.. పసుపు బోర్డు ఎక్కడ అని ప్రశ్నించారు. మళ్లీ ఎన్నికలు వస్తున్న సందర్భంగా ఎక్కడ ఉన్నావని అడిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు ఎన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చారో అడగాలని డిమాండ్ చేశారు. రోడ్డు మీద తిరిగే అర్వింద్ కు టికెట్ ఇస్తే బీజేపీ ఎంపీగా గెలిచారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడైనా పాల్గొన్నరా..? అని ప్రశ్నించారు. మరోసారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రోడ్లమీద తిరగనివ్వమని హెచ్చరించారు.