
- మూడురోజుల పాటు ఏఈఈ ఎగ్జామ్
- మే 8, 9, 21 తేదీల్లో నిర్వహిస్తం: టీఎస్పీఎస్సీ
- ఎలక్ట్రికల్, అగ్రికల్చర్, మెకానికల్ ఎగ్జామ్స్ ఆన్లైన్లో
- ఆఫ్‌లైన్‌లో సివిల్ ఇంజనీరింగ్ పరీక్ష పెడ్తమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : పేపర్ల లీకేజీతో రద్దయిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) రిక్రూట్మెంట్ టెస్టుల కోసం కొత్త తేదీలను టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. సబ్జెక్టుల వారీగా మూడు రోజుల పాటు పరీక్ష నిర్వహిస్తామని, రెండు రోజులు మూడు సబ్జెక్టులను ఆన్లైన్ లో, మరో పేపర్‌ను ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తామని వెల్లడించింది. బుధవారం టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి నేతృత్వంలో కమిటీ సమావేశమై, వివిధ పరీక్షల తేదీలపై చర్చించింది. అనంతరం ఏఈఈ తేదీని అధికారికంగా ప్రకటించారు. మే 8న ఎలక్ర్టికల్ అండ్ ఎలక్ర్టానిక్ ఎగ్జామ్, మే 9న అగికల్చర్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తామని కమిషన్ తెలిపింది.
మే 21న సివిల్ ఇంజనీరింగ్ పరీక్షను మాత్రం ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తామని ప్రకటించింది. వివిధ డిపార్ట్మెంట్లలో 1,540 పోస్టుల భర్తీకి నిరుడు సెప్టెంబర్ 3న నోటిఫికేషన్ ఇవ్వగా, జనవరి 22న ఏఈఈ పరీక్షను టీఎస్పీఎస్సీ నిర్వహించింది. దీనికి 81,148 మంది అప్లై చేసుకున్నారు. క్వశ్చన్ పేపర్ లీకేజీ నేపథ్యంలో ఈ పరీక్షను టీఎస్పీఎస్సీ ఇటీవల రద్దు చేసింది. ఈ పరీక్షను గతంలో ఆఫ్‌లైన్‌లో ఒకేరోజు ఉదయం, మధ్యాహ్నం నిర్వహించారు. ప్రస్తుతం ఆన్లైన్లోనే నిర్వహించాలని నిర్ణయించారు.
జూన్‌లోనే ఏఈ ఎగ్జామ్
క్వశ్చన్ పేపర్ లీకేజీతో రద్దయిన అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ ను జూన్ లో నిర్వహించే అవకాశముందని అధికారులు చెప్తున్నారు. ఈనెల 5న 837 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షకు 74,488 మంది అప్లై చేయగా, 55189 మంది అటెండ్ అయ్యారు. ఈ పరీక్షలను కూడా మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ తదితర పరీక్షలను మేలో నిర్వహించాలని భావిస్తున్నారు. వీటి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.