ప్రక్షాళన లేకుండానే పరీక్షలకు!..పేపర్లు లీకైనా లైట్​ తీసుకుంటున్న టీఎస్​పీఎస్సీ

ప్రక్షాళన లేకుండానే పరీక్షలకు!..పేపర్లు లీకైనా లైట్​ తీసుకుంటున్న టీఎస్​పీఎస్సీ
  • ప్రక్షాళన లేకుండానే పరీక్షలకు!
  • పేపర్లు లీకైనా లైట్​ తీసుకుంటున్న టీఎస్​పీఎస్సీ
  • నెలన్నర అవుతున్నా కమిషన్​లో ఎలాంటి చర్యల్లేవ్​ 
  • ఎగ్జామ్స్​ నిర్వహణలో సంస్కరణలు చేపట్టిందీ లేదు
  • కొన్ని పరీక్షలకు రీషెడ్యూల్.. మరికొన్నిటిపై నో క్లారిటీ
  • ఆగని నిరుద్యోగుల ఆందోళనలు

హైదరాబాద్, వెలుగు:  టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీ ఇష్యూ బయటికొచ్చి దాదాపు నెలన్నరైతున్నది. మొదటి రోజు నుంచీ నిరుద్యోగులు రోడ్ల మీదికి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. రోజూ దీక్షలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. టీఎస్​పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయాలని, పరీక్షల నిర్వహణలో సంస్కరణలపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. అయితే.. కమిషన్​ గానీ, ప్రభుత్వం గానీ ఇవేవీ పట్టించుకోవడం లేదు. కీలకమైన గ్రూప్​ 1 సహా నాలుగు ఎగ్జామ్స్​ పేపర్లు లీకైనట్లు తేలినప్పటికీ బోర్డులో ఎలాంటి ప్రక్షాళన చర్యలు చేపట్టకుండానే పాత బోర్డు ఆధ్వర్యంలో పలు పరీక్షల నిర్వహణకు రెడీ కావడం విమర్శలకు తావిస్తున్నది.

టీఎస్​పీఎస్సీ గతంలో 26 నోటిఫికేషన్లు ఇచ్చింది. దీని ద్వారా 17 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. వీటిలో ఏడు పరీక్షలు నిర్వహించింది. అయితే, క్వశ్చన్ పేపర్లు లీక్​ కావడంతో నాలుగు పరీక్షలను టీఎస్​పీఎస్సీ రద్దు చేసింది. మార్చి, ఏప్రిల్ నెలల పరీక్షలను పూర్తిగా రద్దు చేయగా.. మే నెలలో జరిగే కొన్ని పరీక్షల తేదీలను మార్చింది.  ప్రస్తుతం లీకేజీ నేపథ్యంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్, అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ), డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పరీక్షలు రద్దయ్యాయి. వీటిలో గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఏఈఈ పరీక్షలను మాత్రమే మళ్లీ నిర్వహించేందుకు డేట్లు ప్రకటించారు. మిగిలిన ఏఈ, డీఏవో పరీక్షలపై ఇప్పటికీ క్లారిటీ లేదు. మార్చిలో జరగాల్సిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను వాయిదా వేయగా.. వాటి తేదీలను కమిషన్​ వెల్లడించలేదు. పలు పరీక్షల నిర్వహణపై కమిషన్​ కాల్ సెంటర్​కు కాల్ చేసినా.. క్లారిటీ ఇవ్వడం లేదని అభ్యర్థులు అంటున్నారు. 

మేలోని పరీక్షలు,  గ్రూప్ 1, 4 పరీక్షలుంటాయా?

మే నెలలో పాలిటెక్నిక్ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పరీక్షలు ఉంటాయని జనవరిలో టీఎస్​పీఎస్సీ షెడ్యూల్ ఇచ్చింది. లీకేజీ ఇష్యూ బయటకు వచ్చినందున.. ఆయా పరీక్షలపై మాత్రం అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదు. పలు పరీక్షల తేదీలపై కొన్ని మీడియా సంస్థలకు లీకులు ఇస్తున్న టీఎస్​పీఎస్సీ అధికారులు.. మే నెలలో జరిగే ఎగ్జామ్స్​పై మాత్రం నోరుమెదపడం లేదు. దీంతో ఆ పరీక్షలుంటాయా లేదా అని అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. లీకేజీ కారణంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి.. జూన్ 11న నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. జులై 1 గ్రూప్ 4 పెడ్తామని పాత షెడ్యూల్​లో ఉంది. ఈ రెండు పరీక్షల మధ్యలో కేవలం 20 రోజులే గ్యాప్  ఉండటంతో అభ్యర్థులకు ప్రిపరేషన్​కు టైమ్​ లేకుండా పోయింది.

సీఎం స్పందిస్తలే.. రివ్యూ చేస్తలే..

లీకేజీపై నిరుద్యోగుల నుంచి భారీ ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నా.. సీఎం కేసీఆర్​ ఒక్క సారి కూడా స్పందించలేదు. కనీసం రివ్యూ కూడా చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ ఇష్యూలో సీఎం స్పందించకపోవడం ఏమిటని ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. మంత్రి కేటీఆర్​ మాత్రం ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరు చేసిన తప్పులకు వ్యవస్థను తప్పుబట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇక, పేపర్ లీకేజీ ఘటనపై గత నెల 14న టీఎస్​పీఎస్సీలో చైర్మన్ జనార్దన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్, ఇతర సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. కొందరు ఉద్యోగులను నమ్మి మోసపోయామని, కానీ మిగిలిన ఉద్యోగుల తప్పేం లేదనీ చెప్పుకొచ్చారు. కేవలం రీషెడ్యూల్ డేట్ల విషయం తప్ప, ఇప్పటికీ  ఏ ఒక్క అంశంపై కమిషన్ ఉన్నతాధికారులు మీడియాకు సమాచారం ఇవ్వడం లేదు. పలు అంశాలపై అభ్యర్థులు క్లారిటీ కోరినా.. అధికారులు ముఖం చాటేస్తున్నారు.

పాతోళ్లతోనే పరీక్షల నిర్వహణ!

టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నది.   లక్షల మంది అభ్యర్థులు ఆ షాక్​ నుంచి కోలుకోలేదు. పేపర్ల లీకేజీపై సిట్, ఈడీ దర్యాప్తు నడుస్తున్నది. ఇంకా పూర్తిస్థాయి రిపోర్టులూ రాలేదు. అయినా.. అవేవీ పట్టించుకోకుండా పలు పరీక్షల నిర్వహణకు టీఎస్​పీఎస్సీ తేదీలను ప్రకటిస్తున్నది. ఏకంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్​ ఎగ్జామ్​తో పాటు పలు పరీక్షలు లీకైనా.. ఏ ఒక్కరిపైనా కమిషన్​ గానీ, ప్రభుత్వం గానీ చర్యలు తీసుకోలేదు. కేవలం లీకేజీతో సంబంధం ఉందంటూ నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. దీంట్లో నిర్లక్ష్యం వహించిన ఏ అధికారికీ కనీసం షోకాజు నోటీసులూ ఇవ్వకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. కమిషన్​లో అనేక సంస్కరణలు తీసుకొస్తామని, మొత్తం ప్రక్షాళన చేస్తామని ఉన్నతాధికారులు కొన్ని మీడియా సంస్థలకు లీకులు ఇచ్చారు. ఆ తర్వాత  ఏం జరిగిందో ఏమో గానీ, ఇప్పటి వరకూ వాటిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పరీక్షల్లో సంస్కరణలు ఏం చేస్తున్నారో చెప్పకుండానే, ప్రక్షాళన ఏం చేశారో అభ్యర్థులకు వివరించకుండానే, పరీక్షల నిర్వహణకు రెడీ కావడంపై అందరినీ గందరగోళ పరుస్తున్నది. అభ్యర్థుల్లో ఉన్న ఆందోళన, అయోమయాన్ని తొలగించే వారే  కరువయ్యారు. కేవలం ఆన్​లైన్​లో పరీక్షలు నిర్వహించడం తప్ప, బయటకు ఏం జాగ్రత్తలు తీసుకుంటారనేది కనిపించడం లేదు. 

తేదీ     ఎగ్జామ్
మే 8    ఏఈఈ (ఎలక్ట్రికల్)
మే 9      ఏఈఈ  (అగ్రికల్చర్,మెకానికల్) 
మే 13     పాలిటెక్నిక్ లెక్చరర్ 
మే 16    అగ్రికల్చర్ ఆఫీసర్ 
మే 17      పీడీ , లైబ్రేరియన్​ 
మే 19      డ్రగ్ ఇన్‌‌స్పెక్టర్ 
మే 21      ఏఈఈ (సివిల్) - ఆఫ్​ లైన్ 
జూన్ 11    గ్రూప్ 1 ప్రిలిమ్స్ 
జూన్ 17      హార్టికల్చర్ ఆఫీసర్ 
జూన్ 28     ఏఎంవీఐ 
జులై 1    గ్రూప్ 4 
జులై 18, 19     గ్రౌండ్ వాటర్ గెజిటెడ్  
జులై 20, 21     గ్రౌండ్ వాటర్ నాన్ గెజిటెడ్ 
ఆగస్టు  29, 30    గ్రూప్ 2