Tspsc: తమ తప్పిదమేమీ లేదంటున్న టీఎస్​పీఎస్సీ పెద్దలు

Tspsc: తమ తప్పిదమేమీ లేదంటున్న టీఎస్​పీఎస్సీ పెద్దలు
  •  పేపర్ లీకేజీ ఘటనపై శాఖాపరమైన చర్యలు కరువు
  • ఇదే విషయాన్ని ప్రకటించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్​పీఎస్సీ‌‌‌‌‌‌‌‌) క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటనపై ఇప్పటివరకు శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు. దీంట్లో కేవలం ఆ ఇద్దరిదే తప్పన్నట్టు కమిషన్ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇదే విషయాన్ని రెండ్రోజుల కింద మంత్రి కేటీఆర్ కూడా ప్రకటించారు. ఆ ఇద్దరి వల్లే ఈ ఘటన జరిగిందని చెప్పుకొచ్చారు. అయితే, ఈ ఘటన జరిగే అవకాశం ఎవరిచ్చారు? ఆ నిర్లక్ష్యం ఎవరిది? అంటే మాత్రం ఏ ఒక్కరి దగ్గరా సమాధానం లేదు. ఘటనపై నిర్లక్ష్యం తమది కాదంటే.. తమది కాదంటూ ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్నట్టు తెలుస్తోంది. 

సిస్టమ్​కు అలర్ట్ పెట్టకపోవుడేంది?

క్వశ్చన్ పేపర్ల లీక్​తో గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఏఈ, ఏఈఈ, డీఏవో పరీక్షలను టీఎస్​పీఎస్​సీ రద్దు చేయగా, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, వెటర్నరీ అసిస్టెంట్ ఎగ్జామ్స్ వాయిదా వేసింది. ఈ లీకేజీ టీఎస్​పీఎస్సీ సెక్రటరీ అనితా రాంచంద్రన్ పీఏ ప్రవీణ్ కుమార్, టీఎస్​టీఎస్​ ఉద్యోగి, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్ రెడ్డి ద్వారా జరిగిందని పోలీసులు నిర్ధారించారు. వీరిద్దరితో పాటు ఇంకొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. వీరిద్దరు క్వశ్చన్ పేపర్లు లీక్ చేసేందుకు అవకాశం ఇచ్చింది ఎవరు? ఆ నిర్లక్ష్యం ఎవరిది అనే దానిపై మాత్రం కమిషన్ అధికారులు నోరుమెదపడం లేదు. కాన్ఫిడెన్షియల్ సిస్టమ్ నుంచి డేటా లీక్ అవుతుంటే, ఆ సెక్షన్ ఇన్​చార్జి ఏం చేస్తున్నట్లు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాన్ఫిడెన్షియల్ సిస్టమ్ ఓపెన్ చేస్తే అలర్ట్ మెసేజ్ కూడా రాకపోవడం, ఆ మేరకు సైబర్ అలర్ట్ సిస్టమ్ పెట్టకపోవడం ఎవరి తప్పనే ప్రశ్నలు వస్తున్నాయి. మరోపక్క కమిషన్ సెక్రటరీ అనితారాంచంద్రన్ పీఏ ప్రవీణ్​ కుమార్ ప్రవర్తన పైనా అనుమానం రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. సెలవులుపెట్టకుండా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాశారని కొందరు, కొన్ని రోజులు సెలవులు పెట్టారని ఇంకొందరు చెప్తున్నారు. అయినా 15..20 రోజులు చదివితే ఏకంగా 103 మార్కులు సాధించవచ్చా అనే అనుమానం కూడా టీఎస్​పీఎస్సీ అధికారుల్లో రాకపోవడం గమనార్హం. అప్పుడే గుర్తించి..రీచెక్ చేస్తే కనీసం మిగిలిన పేపర్లు లీక్ కాకుండా ఉండేవని నిరుద్యోగులు చెబుతున్నారు. 

కిందిస్థాయి ఉద్యోగికి బాధ్యతలా!

క్వశ్చన్ పేపర్ లీక్ కావడంతో టీఎస్​పీఎస్సీలో ఆదరబాదరగా కమిషన్​లోని అధికారుల సెక్షన్లను మార్చారు. ఈ క్రమంలో కాన్ఫిడెన్షియల్ విభాగం ఇన్​చార్జిగా ఉన్న సెక్షన్ ఆఫీసర్ ను తొలగించి, అడిషనల్ సెక్రటరీ అధికారికి ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే, కీలకమైన ఈ సెక్షన్​కు ఉన్నతాధికారికి కాకుండా, కిందిస్థాయి ఉద్యోగులకు ఇవ్వడంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి.