అభ్యర్థుల సూచనల మేరకు టీఎస్​పీఎస్సీ పనితీరు మారుస్తం: కేటీఆర్

అభ్యర్థుల సూచనల మేరకు టీఎస్​పీఎస్సీ పనితీరు మారుస్తం: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తెల్లారే డిసెంబర్ 4 ఉదయం 10 గంటలకు హైదరాబాద్​లోని అశోక్​నగర్​కు వచ్చి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న యువతతో సమేవేశమవుతానని మంత్రి కేటీఆర్ ​తెలిపారు. సోమవారం అశోక్ ​నగర్​తో పాటు పలు యూనివర్సిటీల్లో ఉద్యోగాల కోసం ప్రిపేర్​ అవుతున్న యువతీయువకులను కలిసి మాట్లాడారు. 2 గంటల పాటు వారితో ఉద్యోగాల భర్తీ గురించి ఆయన చర్చించారు. బీఆర్ఎస్​ఎన్నికల్లో గెలిచిన తర్వాత పోస్టుల సంఖ్య పెంచాలని, భర్తీ ప్రక్రియ, రోస్టర్​ పాయింట్ల కేటాయింపు, క్వాలిఫికేషన్ల విషయంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని యువకులు ఈ సందర్భంగా కేటీఆర్​కు సూచించారు. గ్రూప్​–2 పోస్టులు పెంచుతామని, మూడోసారి అధికారంలోకి రాగానే జాబ్​క్యాలెండర్ ​విడుదల చేస్తామని కేటీఆర్​ హామీ ఇచ్చారు. టీఎస్​పీఎస్సీ పని తీరు విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా మార్చుతామని, పూర్తి ప్రక్షాళన చేసి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగిస్తామన్నారు. వివిధ దశల్లో ఉన్న 60 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. కోర్టుల్లో కేసుల పరిష్కారానికి ప్రభుత్వపరంగా కృషి చేస్తామన్నారు. దశాబ్దం పాటు ప్రైవేట్ ​సెక్టార్​లో ఉద్యోగం చేసిన అనుభవం తనకు ఉన్నదని, ప్రభుత్వ ఉద్యోగమైనా, ప్రైవేట్​ఉద్యోగమైన దానిని సాధించడంలో ఎదురయ్యే సవాళ్లు ఏమిటో తనకు తెలుసని అన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో సోదరుడిగా తాను భరోసా ఇస్తున్నానని చెప్పారు. ఫలితాలు వచ్చిన తెల్లారే అశోక్​నగర్ లో ఉద్యోగాలకు ప్రిపేర్​అవుతున్న వారితో సమావేశమై చర్చిస్తానని.. సలహాలు, సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఏటా 10 వేల ఉద్యోగాలు భర్తీ చేసినం

తెలంగాణ వచ్చి తమ పార్టీ అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు ఇస్తామని గతంలో హామీ ఇచ్చామని, దానికి రెట్టింపుగా 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని కేటీఆర్ చెప్పారు. అందులో ఇప్పటికే 1.62 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. మిగతా వాటి భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉందని.. ఆ వివరాలను యువతకు అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో తమ నిబద్ధతను ఎవరూ ప్రశ్నించే అవకాశమే లేదని, ముఖ్యంగా ఏడాదికి వెయ్యి ఉద్యోగాలు కూడా ఇవ్వని కాంగ్రెస్​పార్టీకి అసలే లేదని అన్నారు. ఏటా10 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఏకైక ప్రభుత్వం దేశంలోనే తెలంగాణ ఒక్కటేనని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్​నాయకులు తమపై విమర్శలు చేస్తున్నారని, వారికి యువత తగిన విధంగా సమాధానం చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు.