నాలుగు జిల్లాలో 116 ఎలక్ట్రిక్ ​బస్సులు

నాలుగు జిల్లాలో 116 ఎలక్ట్రిక్ ​బస్సులు
  • త్వరలో 116 ఎలక్ట్రిక్ ​బస్సులు
  • పైలట్​ ప్రాజెక్టు కింద 4 జిల్లాల్లో నడిపిస్తాం
  • కొత్త ఆర్టీసీ యాప్​ తో బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు 
  • వేములవాడ రాజన్న ప్రసాదం అందించేందుకు ప్లాన్​

వేములవాడ, వెలుగు : త్వరలో 116 ఎలక్ట్రిక్​బస్సులను కొంటున్నామని, పైలట్​ప్రాజెక్టు కింద కరీంనగర్, నల్లగొండ , వరంగల్,  మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాల నుంచి నడిపిస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ తెలిపారు.గురువారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన అర్టీసీ అధికారులతో కలిసి ఆలయ గెస్ట్​హౌస్​లో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. అంతకుముందు సజ్జనార్​కు కలెక్టర్ ​అనురాగ్​ జయంతి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రకాంత్​, ఆలయ ఈఓ రమాదేవి స్వాగతం పలికారు. సజ్జనార్​మాట్లాడుతూ డీజిల్ భారం ఎక్కువ కావడంతో ఆ ఖర్చు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కార్మికులకు ఫస్ట్ ​తారీఖునే జీతాలు ఇస్తున్నామని, ఇటీవలే డీఏ కూడా ఇచ్చామన్నారు. ఈ నెలలో ఆర్టీసీ యాప్ ప్రారంభిస్తున్నామని, దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు కూడా బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చన్నారు.

రాజన్న దర్శనానికి ప్రతిరోజూ దాదాపు 30 వేల మంది వస్తుండగా 9 వేల మంది ఆర్టీసీ బస్సుల ద్వారానే తరలివస్తున్నారన్నారు. -వేములవాడతో పాటు అందుబాటులో ఉన్న ఆలయాలతో కలిపి ఒక టూరిస్ట్ ప్యాకేజీ ప్లాన్​ చేయబోతున్నట్టు చెప్పారు. ఆక్యుపెన్సీ 72 శాతం పెరిగిందని, ప్రతిభ చూపిన కార్మికులకు ఇన్సెంటివ్ ఇస్తున్నామన్నారు.  ఇప్పటికే కార్గో ద్వారా 100 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. భద్రాద్రి సీతారాముల కల్యాణం సందర్భంగా తలంబ్రాల కోసం లక్షకు పైగా ఆర్డర్లు వచ్చాయన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ , రాజన్న ఆలయ అధికారులతో చర్చించి రాజన్న ప్రసాదం కూడా కార్గో ద్వారా భక్తులకు అందించేందుకు ప్లాన్​చేస్తామన్నారు.