
- ముగిసిన ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డుల కాలపరిమితి
- కమిటీల పనితీరుపై కార్మికుల్లో అసంతృప్తి
- బాధ్యతల నుంచి తప్పుకుంటున్న మెంబర్లు
- ఎన్నికలు నిర్వహించాలని యూనియన్ల డిమాండ్
మంచిర్యాల, వెలుగు: టీఎస్ ఆర్టీసీలో గుర్తింపు యూనియన్లను రద్దు చేస్తూ వాటి స్థానంలో ఏర్పాటు చేసిన ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డు కమిటీల కాలపరిమితి డిసెంబర్ ఒకటో తేదీతో ముగిసింది. మళ్లా కొత్త బోర్డులను నియమిస్తారా? ప్రస్తుత కమిటీలనే కొనసాగిస్తారా? లేక ఎన్నికలు నిర్వహిస్తారా? అన్న అంశాలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ పెట్టిన గడువు ముగిసినందున వెంటనే గుర్తింపు యూనియన్ ఎలక్షన్లు నిర్వహించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ముగిసిన కమిటీల గడువు
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో సర్కారు మొండివైఖరికి నిరసనగా 2019 అక్టోబర్ 4 అర్ధరాత్రి నుంచి కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. యాభై రోజులకు పైగా సమ్మె చేసి, నవంబర్ 25న విరమించాయి. ఆర్టీసీ దుస్థితికి యూనియన్ల తీరే కారణమన్న సీఎం కేసీఆర్ రెండేండ్ల పాటు గుర్తింపు సంఘం ఎన్నికలను నిషేధించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రతి డిపోలో డీఎం ఆధ్వర్యంలో నలుగురు ఆఫీసర్లు, కండక్టర్, డ్రైవర్ మొత్తం ఏడుగురు మెంబర్లతో కమిటీలను నియమించారు. ఇందులో యూనియన్ లీడర్లకు చోటివ్వలేదు. కమిటీల్లో ఆఫీసర్లదే మెజారిటీ కావడంతో కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని, కండక్టర్, డ్రైవర్ మెంబర్లుగా ఉన్నప్పటికీ వారి అభిప్రాయాలను, సలహాలు, సూచనలను గౌరవించడం లేదని విమర్శలు వస్తున్నాయి. వెల్ఫేర్ బోర్డుల పనితీరుపై కార్మికులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు మెంబర్లు తమ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. కమిటీల కాలపరిమితి ముగిసిందని, అనారోగ్య కారణాలు చూపుతూ మెంబర్‌షిప్‌ను రద్దు చేయాలని కోరుతున్నారు.
ఎలక్షన్లు నిర్వహించాలి
ఆర్టీసీలో ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డ్ కమిటీల గడువు ముగిసినందున గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆర్టీసీలో 11 యూనియన్లు ఉండగా, టీఎంయూ మినహా మిగతా పది సంఘాలు జూన్‌లో జేఏసీగా ఏర్పడ్డాయి. గుర్తింపు యూనియన్ ఎలక్షన్లు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. కమిటీల గడువు ముగిసిన విషయాన్ని గుర్తుచేస్తూ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) ఇటీవల సీఎం కేసీఆర్‌కు లెటర్ రాసింది. 2018లో జరగాల్సిన గుర్తింపు సంఘం ఎన్నికలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వాయిదా వేసిందని పేర్కొంది. సీఎం కేసీఆర్ పెట్టిన రెండేండ్ల డెడ్‌లైన్ ముగిసినందున వెంటనే ఎలక్షన్లు నిర్వహించాలని డిమాండ్ చేసింది. సర్కారు స్పందించకపోవడంతో జనవరిలో పోరాట కార్యాచరణ ప్రకటించడానికి ఆర్టీసీ జేఏసీ సిద్ధమవుతోంది.
ఇంకా లేట్ చేయొద్దు
ఆర్టీసీలో గుర్తింపు యూనియన్లను రద్దు చేసి ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేసి రెండేండ్లు అయ్యింది. సమస్యలు పరిష్కారం కాక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. సీఎం కేసీఆర్ పెట్టిన గడువు డిసెంబర్ ఒకటితో ముగిసింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎలక్షన్లు నిర్వహించాలె. - బీవీ.రావు, ఈయూ రీజినల్ సెక్రటరీ, ఆదిలాబాద్
కార్మికులు ఇబ్బంది పడుతున్రు
ఆర్టీసీ కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నరు. గతంలో యూనియన్లు సమస్యలపై పోరాడి పరిష్కరించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీలు ఉన్నా లేనట్టే అయ్యింది. రోజురోజుకు పనిభారం, సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి గుర్తింపు ఎన్నికలే పరిష్కారం.
- కేఎస్.రావు, టీఎంయూ డిపో సెక్రటరీ, మంచిర్యాల