దళితబంధు అడిగితే మహిళలపై కేసులు పెడతారా? : షర్మిల

దళితబంధు అడిగితే మహిళలపై కేసులు పెడతారా? : షర్మిల

నిర్మల్ జిల్లా: దళిత బంధు అడిగినందుకు మహిళలపై కేసులు పెడతారా అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా నర్సాపూర్ లో షర్మిల పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు దళిత మహిళలు ఆమెను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. దళిత బంధు అడిగినందుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తమపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడిన షర్మిల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. దళిత బంధు అడిగిన పాపానికి మహిళలని కూడా చూడకుండా కోర్టుకు లాగుతారా అని మండిపడ్డారు. దళిత బంధులో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దళిత బంధు కాస్త అనుచరుల బంధుగా మారిందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలకే దళిత బంధు ఇస్తామని ఆ పార్టీ నాయకులు బహిరంగంగా ప్రకటిస్తుండటం సిగ్గుచేటని అన్నారు.

టీఆర్ఎస్ నాయకులకు అధికార గర్వం తలకెక్కిందని, వాళ్ల ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని చెప్పారు. దళిత బంధు పేరుతో కేసీఆర్ డ్రామాలాడుతున్నారని, ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారో లబ్దిదారుల జాబితాను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హామీలు ప్రకటనల వరకేనని, అమలు చేసే ఆలోచన ఆయనకు ఏమాత్రం లేదని విమర్శించారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు ప్రజలు గుర్తొస్తారని మండిపడ్డారు. దళిత మహిళలపై పెట్టిన కేసులను వెంటనే వాపస్ తీసుకోవాలని, వారికి దళిత బంధు ఇవ్వాలని షర్మిల రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.