
ఆర్టీసీ ఉద్యోగులకు పిఆర్సి, డిఎ ప్రకటించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ కామారెడ్డి స్థానిక సంస్థలలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత ను ఆయన సోమవారం బంజారాహిల్స్ లోని తమ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఆర్టీసీ అభివృద్ధికి విస్తృతంగా కృషి చేసిన వ్యక్తి కల్వకుంట్ల కవిత అని అన్నారు. ఆర్టీసీ కార్మికుల కష్టనష్టాలు తెలిసిన వ్యక్తి కవిత అని అన్నారు అలాంటి వ్యక్తి మినిస్టర్ గా అసెంబ్లీలో అడుగు పెట్టాలని కోరారు.
ఆర్టీసీ అభివృద్ధి చెందాలంటే యూనియన్ లు అన్ని కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్దేశంతోనే రెండు సంవత్సరాలుగా ఉనికిలో లేని ఆర్టీసీ యూనియన్ లను తిరిగి ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఆర్టీసీని బలోపేతం చేయడానికి నిష్ణాతులైన ఎండి సజ్జనార్, చైర్మన్ గోవర్ధన్ రెడ్డి లను నియమించినందుకు సీఎం కేసీఆర్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని 49 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, బోర్డులో తమ సంఘానికి ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తమ సంఘం ఎప్పుడూ ముందు ఉంటుందని తెలిపారు.